గుప్త నిధులతో మోసం... ఏడుగురు అరెస్ట్​

గుప్త నిధులతో మోసం... ఏడుగురు అరెస్ట్​

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : గుప్త నిధుల పేరిట మోసం చేసిన కేసులో ఏడుగురిని అరెస్ట్​ చేశామని కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్​ తెలిపారు. లక్ష్మీదేవిపల్లి పోలీస్​ స్టేషన్​లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. బూర్గంపహాడ్​ మండలం మోరంపల్లి బంజారా గ్రామానికి చెందిన మానికల కృష్ణ అలియాస్​ మానాల కృష్ణ.. ప్రజలను మోసం చేసేందుకు పది మందితో ఒక గ్యాంగ్​ ఏర్పాటు చేశాడు. 

ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా నూతన్​కల్​ మండలం మిర్యాల గ్రామానికి చెందిన గొర్రెల వ్యాపారులు బోయిన బుచ్చయ్య, వేల్పుల కిరణ్​, కనకటి లింగయ్యను కృష్ణ ద్వారా ఈ గ్యాంగ్​ పరిచయం చేసుకుంది. తమ వద్ద గొర్రెలున్నాయని గ్యాంగ్  సభ్యులు వారిని నమ్మించి ఇటీవల పాల్వంచకు పిలిపించారు. సాటివారిగూడెం సమీపంలోని ముర్రేడువాగు అడవిలోకి వారిని తీసుకెళ్లి ‘‘మా వద్ద గొర్రెలు లేవు. గుప్త నిధులకు సంబంధించి రూ.2 కోట్లు ఉన్నాయి” అని వారికి చెప్పారు. రూ.50 లక్షలు ఇస్తే రూ.2 కోట్లు ఇస్తామని నమ్మించారు. వారి మాటలు నమ్మిన గొర్రెల వ్యాపారులు ఈనెల 9న రూ.40 లక్షలు తెచ్చి కృష్ణ గ్యాంగ్​కు ఇచ్చారు. 

తమ వద్ద కొంత ఒరిజినల్​ కరెన్సీతోపాటు తెల్లకాగితపు కట్టలను కరెన్సీ నోట్లంటూ గొర్రెల వ్యాపారులకు ఇచ్చారు. తర్వాత తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిఘా వేసి లక్ష్మీదేవిపల్లి మండలంలో వెహికిల్స్​ తనిఖీ చేస్తుండగా ఓ కారు వెనుకకు తిప్పుకొని వెళ్లింది. పోలీసులు అనుమానంతో ఆ కారును వెంబడించి పట్టుకున్నారు. ఆ వెహికల్ ను తనిఖీ చేయగా రూ.30.46 లక్షలు దొరికాయి. నిందితులను ప్రశ్నించగా గొర్రెల వ్యాపారులను మోసం చేసిన విషయం బయట పడింది.

 ఈ కేసులో మానికల కృష్ణతో పాటు పాల్వంచ మండలం శ్రీనివాస కాలనీకి చెందిన గూడవల్లి ప్రశాంత్, బూర్గంపహాడ్​ మండలం నకిరిపేటకు చెందిన ధరంసోత్​ శ్రీను, మొరంపల్లి బంజారాకు చెందిన రవి, నకిరిపేటకు చెందిన తేజావత్​ శివ, భానోత్​ నరేశ్ ను అరెస్టు చేశారు. మొరంపల్లి బంజారాకు చెందిన వెంకన్న, ములకల్లిపల్లి మండలం పూసుగూడెం గ్రామానికి చెందిన లక్ష్మణ్, భూక్యా నాగ, తేజావత్​ రాము, ధరావత్​ రవి పరారీలో ఉన్నారు.