ఢిల్లీ చిల్డ్రన్ హాస్పిటల్​లో మంటలు..ఏడుగురు శిశువులు మృతి

ఢిల్లీ చిల్డ్రన్ హాస్పిటల్​లో మంటలు..ఏడుగురు శిశువులు మృతి
  • ఢిల్లీలో ఘోర ప్రమాదం
  • ఆక్సిజన్ సిలిండర్ల పేలుడుతో భారీగా మంటలు 
  • ప్రమాదం జరగగానేపారిపోయిన ఆస్పత్రి స్టాఫ్
  • రంగంలోకి దిగి శిశువులను కాపాడిన స్థానికులు 
  • రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, సీఎం కేజ్రీవాల్ దిగ్భ్రాంతి 
  • హాస్పిటల్ ఓనర్, డాక్టర్ అరెస్టు 

న్యూఢిల్లీ:  దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. ఓ చిల్డ్రన్ హాస్పిటల్ లో మంటలు చెలరేగడంతో ఏడుగురు నవజాత శిశువులు మృతిచెందారు. తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్ లో ఉన్న బేబీ కేర్ న్యూ బోర్న్ హాస్పిటల్ లో శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆస్పత్రిలో 12 మంది శిశువులు చికిత్స పొందుతున్నారు. 

అయితే, మంటలు చెలరేగగానే ఆస్పత్రి స్టాఫ్ అంతా ప్రాణభయంతో పారిపోగా.. స్థానికులు, షహీద్ సేవా దళ్ అనే ఎన్జీఓ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. వెనకవైపు నుంచి బిల్డింగ్ పైకి ఎక్కి శిశువులను బయటకు తీసుకొచ్చారు. కాలిన గాయాలతో ఏడుగురు చిన్నారులు మృతిచెందగా.. మిగతా ఐదుగురికి స్వల్ప గాయాలు అయ్యాయని, వారిని వేరే ఆస్పత్రికి తరలించామని పోలీసులు వెల్లడించారు. రెండంతస్తుల బిల్డింగ్ లో నిర్వహిస్తున్న హాస్పిటల్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో అనధికారికంగా ఆక్సిజన్ సిలిండర్ల రీఫిల్లింగ్ దందా నడుపుతుండటంతోనే ప్రమాద తీవ్రత పెరిగిందని అంటున్నారు. 

హాస్పిటల్ కు పర్మిషన్ లేదని, డ్యూటీలో ఉన్న డాక్టర్ కు కూడా పిల్లలకు ట్రీట్మెంట్ చేసే అర్హత లేదని గుర్తించామన్నారు. అలాగే మంటలు అంటుకోవడంతో సిలిండర్లు పేలిపోయి పక్కనున్న బిల్డింగ్ లు కూడా దెబ్బతిన్నాయని పోలీసులు తెలిపారు. పక్క బిల్డింగ్ లోని ఓ షాపు, ఇండస్ ఇండ్ బ్యాంకు, రెండు బొటిక్స్ కూడా డ్యామేజ్ అయ్యాయన్నారు. దవాఖాన బయట ఉన్న ఒక అంబులెన్స్, స్కూటర్ కూడా పూర్తిగా కాలిపోయాయని చెప్పారు. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారని తెలిపారు. అయితే, ప్రమాదం జరిగిన బిల్డింగ్ వద్ద కరెంట్, కేబుల్ వైర్లు ఎక్కువగా, చాలా కిందకు వేలాడుతూ ఉండటంతో మంటలను ఆర్పడం, రెస్క్యూ చర్యల్లో ఫైర్ సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జనం బాగా గుమిగూడి వీడియోలు తీస్తూ అక్కడి నుంచి వెళ్లకపోవడం కూడా ఫైర్ సిబ్బందికి ఇబ్బందికరంగా మారింది. 

హాస్పిటల్ ఓనర్, మరో డాక్టర్ అరెస్టు  

దవాఖాన నిర్వహణలో నిర్లక్ష్యంతో చిన్నారుల మృతికి కారణమైన బేబీ కేర్ హాస్పిటల్ ఓనర్ డాక్టర్ నవీన్ కిచ్చీపై ఐపీసీ సెక్షన్ 336 (ఇతరుల వ్యక్తిగత భద్రతను ప్రమాదంలో పడేయడం), సెక్షన్ 304ఏ (నిర్లక్ష్యంతో ఇతరుల మరణానికి కారణమవడం) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటన జరిగిన వెంటనే అతడు పారిపోగా, ప్రత్యేక టీంను రంగంలోకి దింపి అతడిని పట్టుకుని అరెస్ట్ చేసినట్టు ఆదివారం ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ప్రమాద సమయంలో ఆస్పత్రిలో డ్యూటీలో ఉన్న డాక్టర్ ఆకాశ్ ను కూడా అరెస్ట్ చేశామని తెలిపారు. ఢిల్లీలో దీనితోపాటు మరిన్ని ఆస్పత్రులను కూడా డాక్టర్ నవీన్ కిచ్చీ నడుపుతున్నాడని పేర్కొన్నారు. హాస్పిటల్ నిర్వహణలో ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించారా? లేదా? అన్నది పరిశీలిస్తున్నామని, నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే మరిన్ని సెక్షన్లను నమోదు చేస్తామన్నారు. 
 
రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి 

హాస్పిటల్ లో ఏడుగురు శిశువులు మృతి చెందడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ చిన్నారుల తల్లిదండ్రులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. అగ్ని ప్రమాదంలో శిశువులు మృతిచెందడం తనను కలచివేసిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాల చుట్టే తన ఆలోచనలు సాగుతున్నాయంటూ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా, శిశువుల మృతికి కారణమైన వారిని వదిలిపెట్టబోమని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ చెప్పారు. 

గాయపడిన శిశువులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. దోషులకు కఠినమైన శిక్షలు పడేలా చూస్తామని ఢిల్లీ హెల్త్ మినిస్టర్ సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. బాధిత కుటుంబాలకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రగాఢ సానుభూతి తెలిపారు. హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం ఘటనపై విచారణ చేపట్టాలని, బాధితులకు అండగా నిలవాలని ఢిల్లీ చీఫ్ సెక్రటరీ, పోలీస్ కమిషనర్ లను ఆదేశించారు.  

మరో బిల్డింగ్​లో మంటలు..ముగ్గురు మృతి 

తూర్పు ఢిల్లీలోని కృష్ణా నగర్ ఏరియాలోని ఓ నాలుగంతస్తుల రెసిడెన్షియల్ బిల్డింగ్ లో కూడా అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఆదివారం తెల్లవారుజామున 2.35 గంటలకు జరిగిన ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక యువకుడు ఉన్నారన్నారు. బిల్డింగ్ వద్ద ఉన్న 14 వెహికల్స్, 2 సైకిల్స్ కూడా పూర్తిగా కాలిపోయాయని పేర్కొన్నారు.