75% కరోనా పేషెంట్ల‌లో ల‌క్ష‌ణాలు లేవు

75% కరోనా పేషెంట్ల‌లో ల‌క్ష‌ణాలు లేవు

దేశంలోనే అత్య‌ధిక క‌రోనా కేసుల న‌మోదైన మ‌హారాష్ట్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 66 వేల టెస్టులు చేసిన‌ట్లు ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ థాక్రే తెలిపారు. అందులో 95 శాతం శాంపిల్స్ నెగ‌టివ్ వ‌చ్చాయ‌ని చెప్పారు. మొత్తం 3600కు పైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయ‌న్నారు. ఆదివారం ఆయ‌న ముంబైలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో న‌మోదైన పాజిటివ్ కేసుల్లో ఇప్ప‌టికే 350 మందికిపైగా డిశ్చార్జ్ అయిన‌ట్లు చెప్పారు ఉద్ధ‌వ్. మ‌రో 52 మంది ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని, వారి ప్రాణాల‌ను నిలబెట్టేందుకు వైద్యులు శ్ర‌మిస్తున్నార‌ని అన్నారు. క‌రోనా పేషెంట్ల‌లో 75 శాతం వ‌ర‌కు మైల్డ్ సింప్ట‌మ్స్ లేదా అస‌లు ల‌క్ష‌ణాలే లేవ‌ని తెలిపారు.

రేప‌టి నుంచి ఆంక్ష‌ల స‌డ‌లింపు

ప్ర‌స్తుతం ప‌రిస్థితులు ఇలానే కొన‌సాగితే క‌రోనా స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డిన త‌ర్వాత రాష్ట్రం తీవ్ర‌మైన ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుని పోయే ప్ర‌మాదం ఉంద‌ని అన్నారు సీఎం ఉద్ధ‌వ్ థాక్రే. అందుకే ఏప్రిల్ 20 నుంచి లాక్ డౌన్ ఆంక్ష‌ల‌ను కొంత‌మేర స‌డ‌లించేందుకు మ‌హారాష్ట్ర స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుందని చెప్పారు. కేసులు త‌క్కువ‌గా ఉన్న జిల్లాల్లో అత్య‌వ‌స‌ర సేవ‌ల‌తో పాటు కొన్ని ర‌కాల ప‌రిశ్ర‌మ‌లు, ఇత‌ర ఫైనాన్షియ‌ల్ యాక్టివిటీకి మిన‌హాయింపు ఇస్తున్నామ‌న్నారు. రాష్ట్రంలో ప‌లు జిల్లాల్లో ఒక్క క‌రోనా కేసుల కూడా లేద‌ని చెప్పారాయ‌న‌. క‌రోనా లేని పేషెంట్ల‌కు ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో చికిత్స కూడా ప్రారంభించేందుకు అవ‌కాశ‌మిస్తున్నామ‌ని తెలిపారు.

వ‌ల‌స కార్మికులు భ‌య‌ప‌డొద్దు..

మ‌హారాష్ట్ర‌లో ఉన్న వ‌ల‌స కార్మికులు ఎక్క‌డివాళ్లు అక్క‌డే ఉండాల‌ని కోరారు సీఎం ఉద్ధ‌వ్. ఈ స‌మ‌స్య గురించి కేంద్రంతో మాట్లాడుతున్నామ‌ని, త్వ‌ర‌లోనే ఒక కొలిక్కి వ‌స్తుంద‌ని అన్నారు. ఎవ‌రూ భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని, నెమ్మ‌దిగా ఆర్థిక కార్య‌క‌లాపాలు మొద‌లుపెడుతున్నామ‌ని, అన్నీ కుదిరితే మ‌ళ్లీ ప‌నుల్లోకి వెళ్లి ఇక్క‌డే జీవ‌నం కొన‌సాగించొచ్చ‌ని చెప్పారు. ఊహించ‌ని ప‌రిస్థితులు ఎదురైనా వ‌లస కార్మికుల బాగోగులు త‌మ ప్ర‌భుత్వం చూస్తుంద‌ని భ‌రోసా ఇచ్చారు ఉద్ధ‌వ్. క‌రోనా క్రైసిస్ ముగిశాక మిమ్మ‌ల్ని ఇంటికి చేర్చే బాధ్య‌త మా ప్ర‌భుత్వం తీసుకుంటుంద‌ని మాట ఇస్తున్నా. మీరంతా ఇళ్ల‌కు చేరే స‌మ‌యానికి సంతోషంగా ఉండాలే కానీ, ఎవ‌రూ భ‌యాందోళ‌న‌ల‌తో వెళ్ల‌కూడ‌దు అంటూ వ‌ల‌స కార్మికుల‌కు భ‌రోసా నింపే ప్ర‌య‌త్నం చేశారు.