IT News: టెక్‌‌ సెక్టార్‌‌‌‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ఇప్పటికే 70వేల మంది ఇళ్లకు..

IT News: టెక్‌‌ సెక్టార్‌‌‌‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ఇప్పటికే 70వేల మంది ఇళ్లకు..

 టెక్ సెక్టార్‌‌‌‌లో మళ్లీ పెద్ద ఎత్తున ఉద్యోగ కోతలు మొదలయ్యాయి. ఈ ఏడాది  మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, క్రౌడ్‌‌స్ట్రయిక్, ఐబీఎం  లాంటి పెద్ద కంపెనీలు సుమారు 70 వేల మంది ఉద్యోగులను తీసేశాయి. రెవెన్యూ  పెరగకపోవడం, ఆర్థిక వ్యవస్థ అనిశ్చితులు,  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడకం పెరగడంతో ఉద్యోగుల కోత ఎక్కువవుతోంది.   

లేఆప్స్‌‌.ఎఫ్‌‌వైఐ డేటా ప్రకారం, ఈ ఏడాది 130 కంపెనీల్లో 70 వేల కంటే ఎక్కువ టెక్ జాబ్స్‌‌కు కోత పడింది. మైక్రోసాఫ్ట్ ఒక్కటే 6 వేల మందిని తీసేసింది. 2023 తర్వాత కంపెనీకి ఇదే  అతిపెద్ద లేఆఫ్‌‌. ఈ ఏడాది మే 13న చేసిన ప్రకటన ప్రకారం,  మైక్రోసాఫ్ట్‌‌ వివిధ డిపార్ట్‌‌మెంట్లు, గ్లోబల్ రీజియన్స్‌‌లోని ఉద్యోగులను తగ్గించుకుంది.  వాషింగ్టన్ (యూఎస్‌‌)  స్టేట్‌‌లో సుమారు 2 వేల మందిని  తొలగించింది. మరో పెద్ద కంపెనీ  గూగుల్ 2025లో  ఉద్యోగులను నెమ్మదిగా తగ్గించుకుంటోంది.  2023లో 12 వేల మందిని తీసేసిన ఈ కంపెనీ, ఈ ఏడాది మే ఆరంభంలో 200 మందిని తొలగించింది. 

కంపెనీని రీస్ట్రక్చరింగ్ చేస్తున్న గూగుల్‌‌,  ఉద్యోగుల కోతను కొనసాగిస్తోంది.  దీనికి ముందు పిక్సెల్, ఆండ్రాయిడ్, క్రోమ్, క్లౌడ్ యూనిట్స్‌‌లో కూడా జాబ్స్‌‌కు కోత పెట్టింది. అమెజాన్ కూడా మళ్లీ లేఆఫ్స్‌‌ చేపడుతోంది.  డివైసెస్ అండ్ సర్వీసెస్ డివిజన్ (అలెక్సా, కిండిల్, జూక్స్ ఆటోనమస్ వెహికల్ స్టార్టప్)లో 100  మందిని తీసేసింది. సైబర్‌‌సెక్యూరిటీ కంపెనీ క్రౌడ్‌‌స్ట్రయిక్ గత వారం తన గ్లోబల్ వర్క్‌‌ఫోర్స్‌‌లో 5 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తోంది.  ఐబీఎం తాజాగా 8 వేల మంది ఉద్యోగులను  తీసేసింది. ఏఐ,  ఆటోమేషన్‌‌తో ఖర్చులు ఆదా చేసుకోవాలనేది కంపెనీ ప్లాన్‌‌. 

ఇండియన్ స్టార్టప్‌ల కష్టాలు.. 

ఈ ఏడాది ఇండియన్ టెక్ కంపెనీలు, ప్రధానంగా స్టార్టప్‌‌లు ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి.   ఆటోమేషన్, ఏఐ వాడకం పెరగడం, ఫండింగ్ అందకపోవడం, ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా  లేఆఫ్స్ బాట పడుతున్నాయి. ఐఎన్‌‌సీ42 డేటా ప్రకారం,  ఈ ఏడాదిలో ఇప్పటివరకు 3,600 మందికి పైగా ఉద్యోగులను   స్టార్టప్‌‌లు తొలగించాయి. ఓలా ఎలక్ట్రిక్ వెయ్యికి పైగా ఉద్యోగులు, కాంట్రాక్టర్లను తొలగించింది. ఫ్రంట్-ఎండ్ ఆపరేషన్స్‌‌లో ఆటోమేషన్ కారణంగా ఈ కోతలు జరిగాయి. 

గప్‌‌షప్  డిసెంబర్ 2024 నుంచి ఏప్రిల్ 2025 మధ్య 500 మంది ఉద్యోగులను తొలగించింది. పని సామర్ధ్యాన్ని, లాభాన్ని పెంచుకోవడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఫండింగ్ దొరకకపోవడంతో  వెర్సే ఇన్నోవేషన్ 350 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ కంపెనీ డైలీహంట్, జోష్ లాంటి ప్లాట్‌‌ఫామ్స్‌‌ను  నడుపుతోంది. జోప్పర్ 2025లో 90 మంది ఉద్యోగులను లే ఆఫ్ చేసింది. జనవరిలో 40 మంది ఇన్సూరెన్స్ టీమ్‌‌ను, తర్వాత టెక్, ప్రొడక్ట్ టీమ్స్ నుంచి 50 మందిని తొలగించింది. ఖర్చులు తగ్గించుకోవడంపై ఫోకస్ పెట్టింది. జెన్‌‌వైజ్ 15–-20 మంది ఉద్యోగులను (కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 20శాతం) తొలగించింది. టెక్, మార్కెటింగ్, ఆపరేషన్స్ డిపార్ట్‌‌మెంట్స్ నుంచి ఎక్కువ మందిని తీసేసింది. కార్స్24 రెండు వందల మంది ఉద్యోగులను, వేకూల్  200 మంది ఉద్యోగులను లే ఆఫ్ చేశాయి. కంపెనీని రీస్ట్రక్చరింగ్ చేయడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ స్టార్టప్‌‌లు ప్రకటించాయి. 

ఉద్యోగుల కోత ఎందుకంటే?

కంపెనీలు ఏఐ, ఆటోమేషన్‌‌ వాడకాన్ని పెంచాయి.  దీనివల్ల కీలకంకాని జాబ్  రోల్స్ (మార్కెటింగ్, సేల్స్, హెచ్‌‌ఆర్‌‌‌‌) ఎక్కువగా ప్రభావితం అవుతున్నాయి. మరోవైపు స్టార్టప్‌‌లు ఫండింగ్ పొందడంలో ఇబ్బందులు పడుతున్నాయి.  2022 నుంచి కొనసాగుతున్న ఫండింగ్ కష్టాలతో  ఇవి తమ ఖర్చులను తగ్గించుకోవాల్సి వస్తోంది.  2‌‌‌‌023–24 లో 112 స్టార్టప్‌‌లలో 67  కంపెనీలకు నష్టాలు వచ్చాయి. వీటి మొత్తం లాస్  రూ.21,472 కోట్లుగా ఉంది.  నష్టాలు వస్తుండడంతో చాలా కంపెనీలు లేఆఫ్స్‌‌ బాట పడుతున్నాయి.  వీటికితోడు  గ్లోబల్ ఎకానమీ గ్రోత్‌‌ నెమ్మదించడం, డిమాండ్ తగ్గడంతో కూడా  కంపెనీలు  రీస్ట్రక్చరింగ్‌‌ చేపడుతున్నాయి.