దేశ వ్యాప్తంగా 70 వేల వెల్నెస్ సెంటర్లు

దేశ వ్యాప్తంగా 70 వేల వెల్నెస్ సెంటర్లు

ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా దేశంలో 70 వేల హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను మార్చి 31 కల్లా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అంతకుముందే టార్గెట్ను చేరుకున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 41.35 కోట్ల మంది ఈ వెల్నెస్ సెంటర్లలో ట్రీట్మెంట్ పొందారని, వీళ్లలో 54 శాతం మంది మహిళలేనని చెప్పింది. ఈ కరోనా టైమ్లోనూ కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతో ఇది సాధ్యమైందని, సహకార సమాఖ్యకు ఇది ఉదాహరణ అని వివరించింది. 2022 కల్లా 1,50,000 సబ్ హెల్త్ సెంటర్లు, ప్రైమరీ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పింది. టెలీ కన్సల్టెషన్ సర్వీసులు కూడా ప్రారంభించామని, ఇప్పటివరకు 9.45 లక్షల మంది ఈ సేవలను ఉపయోగించుకున్నారని తెలిపింది.

76 దేశాలకు 6 కోట్ల వ్యాక్సిన్లు ఇచ్చాం

ప్రపంచవ్యాప్తంగా 76 దేశాలకు 6 కోట్ల కరోనా వ్యాక్సిన్లను అందించామని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. దేశంలో 4.5 కోట్ల మందికి ఇప్పటివరకు టీకాలు వేశామన్నారు. హైదరాబాద్ సీసీఎంబీలోని అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు కొనసాగింపుగా చండీగఢ్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబియల్ టెక్నాలజీని మంత్రి ఆదివారం ప్రారంభించారు. లైఫ్ సైన్సెస్, బయో టెక్నాలజీ స్టార్టప్లకు హబ్గా ఉండేందుకు ఈ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా వల్ల మున్ముందు అకస్మాత్తుగా సంభవించే విపత్తులకు సైంటిస్టులు పరిష్కారాలు ఆలోచించాలని కోరారు. కరోనా వ్యాక్సిన్పై రీసెర్చ్ కోసం రూ. 900 కోట్ల స్పెషల్ ఫండ్ను ఏర్పాటు చేశామన్నారు.