నెరవేరిన కల.. 33 ఏళ్ల సినీ కెరీర్లో.. షారుఖ్ ఖాన్కు తొలి నేషనల్ ఫిలిం అవార్డు !

నెరవేరిన కల.. 33 ఏళ్ల సినీ కెరీర్లో..  షారుఖ్ ఖాన్కు  తొలి నేషనల్ ఫిలిం అవార్డు !

ఎన్నో రికార్డులు.. రివార్డులు.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు.. ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు. బాలీవుడ్ బాద్ షా గా చెప్పుకునే షారుఖ్ ఖాన్.. ఫిలింఫేర్ వంటి ప్రెస్టీజియ్ అవార్డులు ఎన్నో అందుకున్నారు కానీ.. జాతీయ చలన చిత్ర అవార్డు ఇప్పటి వరకు అందుకోలేదు. ఇప్పటి వరకు ఆ వెలితి అలానే ఉంటూ వచ్చింది. కానీ ఎన్నాళ్లో వేచిన హృదయం.. అన్నట్లుగా షారుఖ్ ఖాన్ కల 2025లో నెరవేరింది. శుక్రవారం (ఆగస్టు 01)న ప్రకటించిన ఇండియన్ ఫిలిం అవార్డ్స్ లో..  జాతీయ ఉత్తమ నటుడిగా షారుఖ్ ఖాన్ పేరును ప్రకటించింది కేంద్రం. 

2023లో విడుదలైన జవాన్ సినిమాకు గానూ షారుఖ్ ఖాన్ ను బెస్ట్ యాక్టర్ గా గుర్తిస్తూ అవార్డు ప్రకటించింది. ఈ చిత్రంలో డ్యుయల్ రోల్ లో కనబర్చిన అత్యుత్తమ నటనకు గానూ షారుఖ్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నారు. 

షారుఖ్ తో పోటీ పడిన 12th ఫెయిల్ హీరో..

బెస్ట్ యాక్టర్ అవార్డుకు షారుఖ్ తో పాటు 12 ఫెయిల్ హీరో విక్రాంత్ మాస్సే పోటీలో నిలిచారు. దీంతో ఇద్దరినీ ఉత్తమ నటులుగా ప్రకటించింది కేంద్రం. అంటే ఇద్దరూ సంయుక్తంగా బెస్ట్ యాక్టర్ అవార్డును పంచుకోనున్నారు. 

నేషనల్ ఫిలిం అవార్డు.. 33 ఏళ్ల కల:

షారుఖ్ ఖాన్ బాలీవుడ్ తో పాటు ప్రపంచ సినీ రంగంలో అత్యుత్తమ నటులలో ఒకరిగా స్థానం సంపాదించారు. 1992లో ‘దీవానా’ సినిమాతో కెరీర్ ప్రారంభించిన షారుఖ్.. అక్కడి నుంచి కొన్ని జనరేషన్స్ కు అభిమాన హీరోగా ఉంటూ వస్తున్నారు. 2023 లో పఠాన్, జవాన్, డుంకీ సినిమాలతో ఇండియాలో 70 మిలియన్ల వ్యూవర్స్ తో రికార్డు సృష్టించారు. ఈ మూడు ప్రాజెక్టులు ఇండియాలో 13 వందల కోట్ల కలెక్షన్లు సాధిస్తే.. వరల్డ్ వైడ్ గా దాదాపు 2500 కోట్ల గ్రాస్ ను రాబట్టాయి. 

అట్లీ డైరెక్షన్ లో వచ్చిన జవాన్ సినిమా.. షారుఖ్ లో నటన వైవిధ్యాన్ని మరోసారి బయటపెట్టింది. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ పై గౌరీ ఖాన్, గౌరవ్ వర్మ ఈ సినిమాను నిర్మించారు. నయనతార, విజయ్ సేతుపతి లాంటి తారాగణంతో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో జైలర్ గా ఉంటూ.. డ్యుయెల్ రోల్ షారుఖ్ చేసిన మెస్మరైజింగ్ యాక్టింగ్ కు బెస్ట్ యాక్టర్ గా అవార్డు అందుకోవడం విశేషం. కెరీర్ లోనే తొలిసారి ఉత్తమ నటుడిగా తొలి జాతీయ చలనచిత్ర అవార్డు అందుకోవడంపై ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు.