భారత్ లో ఒక్క రోజే 7230 కరోనా కేసులు

భారత్ లో ఒక్క రోజే 7230 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో వైరస్​ వ్యాప్తి మరింతగా పెరుగుతోంది. గత పది రోజులుగా రోజూ సగటున ఆరున్నర వేల కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఒక్కరోజే 7,230 మందికి పాజిటివ్​ రాగా.. 176 మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య లక్షా 65 వేలు దాటగా.. 4,710 మంది చనిపోయారు. మహారాష్ట్రలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. గురువారం ఒక్కరోజే రెండున్నర వేలకుపైగా కొత్త కేసులు, 85 మరణాలు నమోదుకాగా.. మొత్తం కేసులు 60 వేలకు చేరువయ్యాయి. తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్​ రాష్ట్రాలనూ కరోనా ఆగమాగం చేస్తోంది. వందల సంఖ్యలో కొత్త కేసులు, పదుల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తంగా ఈశాన్య రాష్ట్రాలు మినహా దేశమంతటా కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గురువారం ఆరు రాష్ట్రాల్లో వందకుపైగా, 3 రాష్ట్రాల్లో 200కుపైగా, మరో ఆరు రాష్ట్రాల్లో 300కుపైగా కొత్త కేసులు రిపోర్ట్​ అయ్యాయి. వైరస్​ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందనుకున్న కేరళలోనూ కొత్తగా 84 మందికి పాజిటివ్​ వచ్చింది. మొత్తంగా ఇప్పటివరకు 17 రాష్ట్రాల్లో వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి.