
భద్రాచలం, వెలుగు : భద్రాచలం వద్ద గోదావరి తీరంలో వినాయక విగ్రహాల నిమజ్జనం శుక్రవారం ఘనంగా కొనసాగింది. వివిధ ప్రాంతాల నుంచి విగ్రహాలతో వచ్చిన వాహనాలు పట్టణంలో బారులు తీరాయి. డిగ్రీ కాలేజీ మీదుగా కరకట్ట ఎక్కి గంగానమ్మ ఆలయం వద్ద స్నానఘట్టాల వద్దకు వాహనాలు చేరుకుంటున్నాయి. పోలీసులు ఎక్కడికక్కడే వాహనాలను నియంత్రిస్తూ ఒక్కొక్కటిగా పంపుతున్నారు. ఇప్పటి వరకు 728 విగ్రహాలు నిమజ్జనం చేశారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు పెద్ద సంఖ్యలో విగ్రహాలు వచ్చాయి.
కొత్తగూడెం బాబు క్యాంపు నుంచి 22 అడుగుల విగ్రహం వచ్చింది. ఆకర్షణీయంగా చూపరులను ఆకట్టుకున్న వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. లాంచీల్లో విగ్రహాలను వరుసగా చేర్చి నదీ గర్భంలో నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తుండగా వైద్యశిబిరాలు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలు ఏర్పాటు చేశారు, భక్తులు నదీ ప్రవాహంలోకి దిగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గజీతగాళ్లు లైఫ్ జాకెట్లు, టైర్లు, డ్రమ్ములు సిద్ధం చేశారు.