
- హైదరాబాద్‌లోఅట్టహాసంగా మొదలైనమిస్ వరల్డ్ పోటీలు
- ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
- రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’తో కార్యక్రమం షురూ
- ఆకట్టుకున్న తెలంగాణ కళా ప్రదర్శనలు
- ర్యాంప్ వాక్‌తో మెరిసిన అందాల భామలు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో మిస్ వరల్డ్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లీ, మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి పోటీలను ప్రారంభించారు. రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ తో కార్యక్రమం మొదలైంది. అనంతరం తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా నిర్వహించిన కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. దాదాపు 250 మంది చిన్నారులు చేసిన పేరిణి నృత్యం, గుస్సాడీ , కొమ్ము కోయ నృత్య ప్రదర్శనలు, ఒగ్గుడోలు కళారూపాలు అలరించాయి. ఇండియా, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బార్డర్‌లో దేశం కోసం పోరాడుతున్న సైనికులకు వేడుకల్లో సెల్యూట్ చేశారు. మొదటి రోజు పోటీల్లో భాగంగా కంటెస్టెంట్లు సంప్రదాయ దుస్తుల్లో తమ దేశ జెండాను పట్టుకుని ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా మన దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న మిస్ ఇండియా నందిని గుప్తా జాతీయ జెండాతో ర్యాంప్ పైకి రాగానే స్టేడియం మార్మోగిపోయింది. భారత్ మాతాకీ జై నినాదాలతో దద్దరిల్లింది. కాగా, ఇండియా,- పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరు కావడం లేదని నిర్వాహకులు మొదట ప్రకటించారు. కానీ సాయంత్రం 5 గంటలకు ఇండియా, పాక్ మధ్య కాల్పుల విరమణ ప్రకటన వెలువడడంతో చివరి నిమిషంలో సీఎం రేవంత్‌రెడ్డి ఈవెంట్‌కు హాజరయ్యారు. మరోవైపు బాలీవుడ్, టాలీవుడ్ నటులు, ప్రముఖ రాజకీయ నాయకులు హాజరవుతారని భావించినా.. బార్డర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా రాలేదని తెలిసింది. కార్యక్రమంలో సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, పర్యాటక శాఖ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఆత్మవిశ్వాసానికి ప్రతీక: క్రిస్టినా
మిస్ వరల్డ్ అంటే ఒక్క అందానికే కాదని.. ప్రతిభ, ఆత్మవిశ్వానికి ప్రతీక అని మిస్ వరల్డ్–2024 క్రిస్టినా పిస్కోవా అన్నారు. ప్రపంచ శాంతి, ఐక్యతకు మిస్ వరల్డ్ పోటీలు ఎంతో తోడ్పడుతాయని నిర్వాహకులు తెలిపారు. టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. ఈ వేడుకల ద్వారా ప్రపంచ శాంతికి చక్కటి మెసేజ్ ఇచ్చామన్నారు. తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేయాలని కంటెస్టెంట్స్‌ను ఆయన కోరారు.
భద్రత కట్టుదిట్టం..
ఇండియా, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మిస్ వరల్డ్ పోటీలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. పోలీసులు గచ్చిబౌలి పరిసర ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకుని అణువణువూ తనిఖీ చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో పాస్‌లు మంజూరు చేశారు. వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. కాగా, ఈ ఈవెంట్‌ను దేశవిదేశాల్లో కోట్లాది మంది వీక్షించారు. దాదాపు వెయ్యి మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు నేరుగా, ఆన్‌లైన్ ద్వారా ఈవెంట్‌ను కవర్ చేశారు.
ఆకట్టుకున్న ర్యాంప్ వాక్..
పోటీల్లో భాగంగా మొదటి రోజు అందాల భామల ర్యాంప్ వాక్ ఆకట్టుకుంది. వివిధ దేశాలకు చెందిన కంటెస్టెంట్లు.. తమ దేశ సంప్రదాయ దుస్తులను ధరించి ర్యాంప్ వాక్ చేశారు. మొదటి రౌండ్‌లో కరేబియన్, లాటిన్ అమెరికా, రెండో రౌండ్‌లో ఆఫ్రికా ఖండం, మూడో రౌండ్‌లో యూరప్ ఖండం కంటెస్టెంట్లు, నాలుగో రౌండ్‌లో ఆసియా ఓషియానియా కంటెస్టెంట్లు ర్యాంప్ పైకి వచ్చారు. అందరికంటే చివరగా ర్యాంప్ పైకి వచ్చిన మిస్ వియత్నాం తనదైన డాన్స్‌తో ఆకట్టుకుంది. మన దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న మిస్ ఇండియా నందిని గుప్తా వచ్చినప్పుడు స్టేడియం మార్మోగింది. చీర కట్టుతో ర్యాంపు పైకి వచ్చిన మిస్ నేపాలీ అందరి దృష్టిని ఆకర్షించింది.