వ్యవసాయానికి గతేడాది కంటే రూ.746 కోట్లు తక్కువ

వ్యవసాయానికి గతేడాది కంటే రూ.746 కోట్లు తక్కువ
  • గతేడాది కంటే రూ.746 కోట్లు తక్కువ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు:  వ్యవసాయానికి కేటాయింపులు కాస్త తగ్గినయ్. తాజా బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో రూ.24,254 కోట్లను రాష్ట్ర సర్కారు కేటాయించింది. గతేడాదితో పోలిస్తే రూ.746.65 కోట్లు తక్కువే ఇచ్చింది. అత్యధికంగా రైతుబంధు పథకానికి నిధులిచ్చింది. రుణమాఫీకి మాత్రం రూ.3 వేల కోట్లలోపే కేటాయించింది. ఇక మార్కెటింగ్ శాఖకు పైసా ఇయ్యలేదు. గతేడాది కంటే నిధులు తగ్గినా.. మొత్తం చూస్తే వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపులో రెండో ప్రాధాన్యం కల్పించింది.

రుణమాఫీ.. ఈ ఏడాదీ అంతే!

రూ.75 వేల వరకు ఉన్న రైతుల పంట రుణాల మాఫీ కోసం ప్రభుత్వం బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో రూ.2,939.20 కోట్లు కేటాయించింది. గత మూడేండ్లలో రైతు రుణాల మాఫీ కోసం రూ.17,225 కోట్లు ఇవ్వగా.. తాజా కేటాయింపులతో నాలుగేండ్లలో రుణమాఫీకి కేటాయించిన నిధులు రూ.20,164 కోట్లకు చేరాయి. 36.68 లక్షల మంది అర్హులైన రైతుల్లో.. ఇప్పటిదాకా 5.66 లక్షల మందికి మాత్రమే రూ.1,098 కోట్ల రుణాలను మాఫీ జరిగింది. ప్రస్తుతం 31 లక్షల మందికి పైగా రైతులు మాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. రూ.50 వేల వరకు రుణాలు ఉన్న రైతులు 3.02 లక్షల మంది ఉండగా.. వీరికి రూ.1,100 కోట్లు అవసరం. వీరే కాకుండా రూ.75 వేల వరకు ఉన్న రుణాల మాఫీ చేస్తామని సర్కారు ప్రకటించింది. ఈ కేటగిరీలో ఉన్న 7 లక్షల మంది రైతులకు.. రూ.4 వేల కోట్లు అవసరం. కానీ ఇప్పుడు ఇచ్చింది రూ.2,939.20 కోట్లే. ఇక లక్ష వరకు రుణాలు ఉన్న వాళ్లు 21 లక్షల మంది ఉన్నారు.

యాంత్రీకరణకు భారీ కోత

ఫామ్ మెకనైజేషన్‌‌‌‌‌‌‌‌కు నిరుడు రూ.1,500 కోట్లు కేటాయించగా.. ఈసారి కేవలం రూ.377.35 కోట్లు కేటాయించారు. హార్టికల్చర్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు రూ.994.85 కోట్లు కేటాయించారు. ఇందులో ఆయిల్ పామ్‌‌‌‌‌‌‌‌ సాగుకు ఎక్కువ ఇచ్చారు. ఈ బడ్జెట్‌‌‌‌‌‌‌‌ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2.5 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని లక్షంగా పెట్టుకుని.. 760.4 కోట్ల కేటాయిపులు చేశారు. కాగా, అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌ శాఖకు నిధుల కేటాయించ లేదు. ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌ మార్కెట్ల కోసం నిరుడు రూ.500 కోట్లుఇవ్వగా, ఇప్పడు పైసా కూడా ఇవ్వలేదు. 

రైతు బీమాకు రూ.216 కోట్లు పెంపు

రైతులకు పెట్టుబడి సాయం కింద ఇచ్చే ‘రైతు బంధు’ కోసం రూ.14,800 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌‌‌‌‌‌‌‌లోనూ ఈ పథకానికి ఇంతే నిధులిచ్చారు. నాలుగేండ్లలో 8 సీజన్లలో 63 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.50,443 కోట్లు జమ చేశారు. ఈసారి లబ్ధిదారుల సంఖ్య పెరిగే చాన్స్​ ఉన్నా.. కేటాయింపులు పెంచలేదు. ఇక రైతు బీమా పథకానికి రూ.1,466 కోట్లు కేటాయించారు. గత ఏడాది బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో రూ.1,250 కోట్లు మంజూరు చేసి 34 లక్షల మందికి బీమా కల్పించారు. ఈ ఏడాది మరో రూ.216 కోట్లు అదనంగా కేటాయింపులు చేశారు.