యూపీఎస్సీ ఎగ్జామ్స్ ను తలపించిన గ్రూప్ 1 పరీక్ష

యూపీఎస్సీ ఎగ్జామ్స్ ను తలపించిన  గ్రూప్ 1  పరీక్ష
  • టైమ్​ సరిపోక అభ్యర్థుల అవస్థలు..  75% మంది హాజరు
  • 8 రోజుల తర్వాత ప్రిలిమినరీ కీ: టీఎస్​పీఎస్సీ

 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆదివారం జరిగిన గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్​కు 75% మంది హాజరయ్యారు. 503 పోస్టులకు 3,80,082 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,86,051 మంది పరీక్ష రాశారు. పేపర్​ మస్తు టఫ్​గా వచ్చిందని అభ్యర్థులు అన్నారు. యూపీఎస్​సీ స్థాయిలో గ్రూప్ 1 పేపర్​ను టీఎస్​పీఎస్సీ ప్రిపేర్​ చేసిందని, డైరెక్ట్ ప్రశ్నలు కేవలం 20లోపే వచ్చాయని తెలిపారు. టైమ్ ఎక్కువగా తీసుకునే అనలటికల్​ ప్రశ్నలు ఇచ్చారని అన్నారు. కొత్తగా గ్రూప్స్ పరీక్షకు హాజరైన చాలామందికి టైమ్​ సరిపోలేదు. 90- నుంచి 100 ప్రశ్నలు రాయగానే టైమ్ దగ్గరపడిందనే విషయాన్ని ఇన్విజిలేటర్లు చెప్పడంతో ఆందోళనకు గురయ్యారు. చివరి నిమిషయంలో ఏదో ఒక ఆప్షన్​ను ఎంపిక చేసి వచ్చామని పలువురు అభ్యర్థులు తెలిపారు. గతంలో ఓఎమ్మార్​  షీట్​ బ్లూ ప్రింట్​ ఇచ్చేవారని, ఇప్పుడు ఇవ్వలేదని వారు అన్నారు. 150 మార్కుల పేపర్​లో కటాఫ్ 80–-85 మార్కులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 8 రోజుల్లో ఓఎంఆర్​ షీట్ల స్కానింగ్ ప్రక్రియ పూర్తవుతుందని, ఆ తర్వాతే ప్రిలిమినరీ కీ రిలీజ్ చేస్తామనీ టీఎస్​పీఎస్సీ అధికారులు ప్రకటించారు. 

గ్రూప్ 1 ప్రిలిమ్స్​ రాసేందుకు ఆదివారం ఉదయం 7.30 గంటల నుంచే అభ్యర్థులు సెంటర్లకు చేరుకోవడం మొదలుపెట్టారు. వారిని 8.30 గంటల నుంచి లోపలికి అనుమతించగా.. 10.15 గంటల తర్వాత వచ్చిన వారిని సెంటర్​లోకి అనుమతించలేదు. దీంతో వారు ఆ అభ్యర్థులు ఆందోళన చెందారు. కొన్ని సెంటర్లలో సాంకేతిక సమస్యల వల్ల ఎగ్జామ్​ కొంత ఆలస్యమైంది. చాలా సెంటర్ల బయట పేరెంట్స్, ఇతరుల కోసం పెద్దగా ఏర్పాట్లు చేయలేదు. పలు జిల్లాల్లో వర్షాలు పడటంతో  అభ్యర్థుల వెంట వచ్చిన పేరెంట్స్, సహాయకులు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్​తోపాటు చాలా జిల్లాల్లో వర్షం కారణంగా వందలాది మంది సమయానికి సెంటర్లకు చేరుకోక, పరీక్ష రాయలేకపోయారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎగ్జామ్​ కొనసాగింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మెడ్చల్ జిల్లాల్లో  70%లోపే అటెండెన్స్ నమోదైంది. నాగర్ కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 85.60% అభ్యర్థులు అటెండ్ కాగా, అత్యల్పంగా రంగారెడ్డి జిల్లాలో 67.24% మంది హాజరయ్యారు. అయితే ప్రతిసారి ఇచ్చే బ్లూ ప్రింట్ (ఓఎంఆర్) కాపీ ఈసారి అభ్యర్థులకు ఇవ్వలేదు.

తెలంగాణ హిస్టరీ, పాలసీలతోపాటు..!
గ్రూప్​ 1 ప్రిలిమ్స్ లో కాళేశ్వరం సహా పలు ప్రాజెక్టుల గురించి ప్రశ్నలు అడిగారు. మలావత్​ పూర్ణకు సంబంధించి కూడా ఓ ప్రశ్న వచ్చింది. తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ కు సంబంధించి 16, తెలంగాణ పాలసీస్​ గురించి ఐదు  ప్రశ్నలు వచ్చినట్టు అభ్యర్థులు తెలిపారు. జాగ్రఫీ నుంచి 16, ఇండియన్ హిస్టరీ నుంచి 9, ఇండియన్ గవర్నెన్స్ అండ్ పాలిటిక్స్ నుంచి 16, కరెంట్ అఫైర్స్  నుంచి 15, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 22, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కు సంబంధించి 7 ప్రశ్నలు వచ్చినట్టు పేర్కొన్నారు. 

 టీఎస్​పీఎస్సీ ఆఫీసులో కమాండ్ కంట్రోల్ రూమ్
గ్రూప్​ 1 ప్రిలిమినరీ పరీక్ష కోసం హైదరాబాద్​లోని టీఎస్​పీఎస్సీ ఆఫీస్​లో  కమాండ్ కంట్రోల్ సెంటర్​ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్​ నుంచే సెంటర్లలోని సీసీకెమెరాల ద్వారా పరీక్షల నిర్వహణను టీఎస్​పీఎస్సీ చైర్మన్​ జనార్దన్​రెడ్డి నేతృత్వంలోని టీమ్​ అబ్జర్వ్ చేస్తూ, సూచనలు అందించింది. వెబ్ సైట్​లో స్కాన్డ్​ ఓఎంఆర్ షీట్లను పెడ్తామని, ఆ తర్వాతే కీ రిలీజ్ చేస్తామనీ టీఎస్​పీఎస్సీ అధికారులు చెప్పారు.