నటులు శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘దండోరా’(Dhandoraa). తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఓ సెన్సిటివ్ సోషల్ ఇస్యూతో మూవీ రూపొందింది. ఈ రూటెడ్ సోషల్ డ్రామాని డైరెక్టర్ మురళీకాంత్ తెరకెక్కించారు. కలర్ ఫొటో, బెదురులంక 2012 చిత్రాలను నిర్మించిన లౌక్య ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ నిర్మించారు. క్రిస్మస్ కానుకగా గురువారం (2025 డిసెంబర్ 25న) మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ప్రమోషనల్ కంటెంట్‌తో ‘దండోరా’పై పాజిటివ్ వైబ్ తీసుకొచ్చారు మేకర్స్. అలా సినిమా విడుదలకు 2 రోజుల ముందురనే.. శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్స్తో జనాల్లో దండోరా మరింత హాట్ టాపిక్గా నిలిచింది. ఈ క్రమంలో ‘దండోరా’ విడుదల అయ్యాక ఎలాంటి ఆదరణ దక్కుతుంది? సినిమా కథనం ఎలా ఉంది? శివాజీకి మరో మంగపతి లాంటి ఇంటెన్స్ రోల్ పడిందా? లేదా అనేది పూర్తి రివ్యూలో చూసేద్దాం.
కథేంటంటే:
తెలంగాణలోని ఓ మారుమూల పల్లెటూరు తుళ్లూరు. ఆ గ్రామంలో కుల వివక్షత బలంగా నాటుకుని ఉంటుంది. అది ఎంతలా అంటే.. ఇక్కడ తక్కువ కులానికి చెందిన వ్యక్తులు చనిపోతే ఎక్కడో ఊరి చివరకు తీసుకెళ్లి, ఎవ్వరికీ కనిపించని ప్రదేశాల్లో దహనం చేసేలా. ఇలాంటి కుల వివక్షత.. ఆఖరికీ అంతిమ సంస్కారాలకు కూడా అడ్డు వస్తుండటంతో అక్కడి ప్రజలు ఏమిచేయలేని నిస్సహాయస్థితిలో ఉండిపోతారు.
ఈ క్రమంలోనే కులమే పంచ ప్రాణాలు అనే బతికే, ఓ అగ్ర కులానికి చెందిన రైతు శివాజీ (శివాజీ) చనిపోతాడు. కానీ, ఆయన మరణిస్తే అగ్రకుల సంఘానికి చెందిన స్మశాన వాటికలో దహనం చేయడానికి వీల్లేదని ఆ సదరు కుల సంఘ పెద్దలు తీర్మానం చేస్తారు. దాంతో శివాజీ శవాన్ని ఎలాగైనా అంతిమయాత్ర చేయాలని ఆ ఊరి సర్పంచ్ (నవదీప్), శివాజీ కొడుకు విష్ణు (నందు), కూతురు సుజాత (మనికా చిక్కాల) ప్రయత్నిస్తారు.
అసలు శివాజీని వాళ్ల కులమే ఎందుకు బషిష్కరించింది? ఆ ఊరి కుల రక్కసికి తక్కువ కులానికి చెందిన రవి (రవికృష్ణ) ఎలా బలైపోయాడు? రవిని హత్య చేసింది ఎవరు? రవి మరణం ఆ ఊళ్లో ఎటువంటి పరిస్థితులకు దారి తీసింది? శివాజీతో కన్న కొడుకు విష్ణు (నందు) ఎందుకు మాట్లాడటం మానేశాడు? వేశ్య శ్రీలత (బిందుమాధవి).. శివాజీలో తీసుకొచ్చిన మార్పు ఎలాంటి పరిస్థితులకు దారితీసింది? శివాజీ అంత్యక్రియల్లో తలెత్తిన సమస్య ఎటువంటి మార్పుకు దారి తీసింది? అనేది ‘దండోరా’ కథ.
విశ్లేషణ:
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో.. మన ఆచారాలు, సంప్రదాయాలను ఆవిష్కరిస్తూ.. హాస్యం, వ్యంగ్యంతో పాటు హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల సమూహరంగా మూవీ తెరకెక్కించారు దర్శకుడు మురళీకాంత్.
పరువు హత్యలు, కుల వివక్షనూ చూపిస్తూ తెలుగు, తమిళంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. చెప్పాలనుకున్న పాయింట్ ఒకటే అయిన, వేటికవే భిన్నమైన కథలో చెప్పేసి, మెసేజ్ ఇచ్చి వెళ్లాయి. అలాగే, తక్కువ కులపోడు చనిపోతే.. ఊరి మధ్యలో నుంచి కాకుండా చివర నుంచి వెళ్లి సమాధి చేసే సినిమాలు సైతం చాలా చూసేశాం. అయితే, ఈ దండోరా మాత్రం అందుకు కాస్తా భిన్నంగా తెరకెక్కింది.
నిజానికి ఇప్పటివరకు.. ఇలాంటి సామాజిక కథల్లో బాధితుడు అనే వాడు తక్కువ కులం వాడు అని చూపించారు దర్శకులు. కానీ, ఈ సినిమాలో మాత్రం డైరెక్టర్ కాస్త స్టెప్ తీసుకుని ఎక్కువ కులం వాడు కూడా బాధితుడే అని చెప్పే ప్రయత్నం చేశాడు. అదే ఈ సినిమాకు కొత్తదనం అని చెప్పొచ్చు. అందులో భాగంగానే పరువు హత్య, కుల రాజకీయాలను ప్రస్తావించారు. ఈ క్రమంలోనే కుల అహంకారంతో రగిలిన మనిషిలో మార్పును చూపించిన తీరుతో.. కథనం రూపొందించి సక్సెస్ అయ్యాడు మురళీకాంత్.
సాధారణంగా ఊళ్లల్లో మాల, మాదిగ, గౌడ్, రెడ్డి, కాపు, చౌదరి వంటి ఇలా కులాల వారీగా స్మశానాలు ఎప్పటినుంచో ఉన్నాయి. అలా వాళ్ల కులపోళ్లు ఎవరైనా చస్తే.. ఆ కుల స్మశానాల్లోనే తగలబెడతారు. అయితే, ఆ ఊరి చివరన ఉండే మాల, మాదిగలైతే మాత్రం ఊళ్ళో పెద్దలముందు నడిచిన, చెప్పులు తొడుక్కున్న, భుజాలపై కండువా వేసుకున్న మరీ దారుణంగా వివక్షతకు గురిచేస్తారు. ఇలా అనాది నుంచి నేటివరకు.. ఇంకా ఎన్నేళ్లు అయినా ఎన్నితరాలు మారినా కూడా ఇలాంటి వివక్షత వెంటాడుతూనే ఉంది.
ఈ క్రమంలోనే తక్కువ కులపోళ్లకి కేటాయించిన ఆ కొద్దిపాటి స్థలంలో దహనం చేయాలని రూల్ ఈ సినిమాలో ఉంది. అలా శవాన్ని పూడ్చడానికి గల ఎన్నో ఇబ్బందులను ఈ సినిమా ద్వారా కళ్లకుకట్టినట్లు చూపించారు దర్శకుడు. అయితే, ఇదే గతి ఓ అగ్ర కులానికి చెందినవాడికి వస్తే కూడా ఎదురయ్యే పరిస్థితిని సైతం చూపించాడు. అందుకు ప్రేమ, పగ, కుల రాజకీయాలను తనదైన శైలిలో చర్చించారు దర్శకుడు మురళి కాంత్.
ఫైనల్గా.. తుళ్లూరు గ్రామంలో జరుగుతున్న అక్రమాలు, అణచివేతలపై సాధారణ ప్రజలు ఎలా స్పందించారు? వారి పోరాటం ఎలాంటి మలుపులు తిరిగింది? అనే అంశాల చుట్టూ కథ నడిపించిన తీరు ఆకట్టుకుంటోంది. కథనం నేరుగా, స్పష్టంగా ఉండేలా దర్శకుడు చూపించే ప్రయత్నంతో ప్రతిఒక్కరినీ ఆలోచింపజేశాడు.
