- ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
కల్వకుర్తి, వెలుగు : గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం కల్వకుర్తి మండలంలో గ్రామీణ రహదారుల నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. తుర్కలపల్లి గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయితీ భవనాన్ని ప్రారంభించారు. జీడిపల్లి నుంచి ఎల్లికట్ట వరకు రూ.26 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ, ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
నూతనంగా నిర్మించిన యువజన భవనం, పంజుగుల నుంచి తర్నికల్ వరకు రూ.36 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. పంజుగుల గ్రామంలో రూ.65 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, రూ.15 లక్షలతో నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలు ముగిసినందున గ్రామాలు అభివృద్ధిపై సర్పంచులు దృష్టి పెట్టాలన్నారు.
గ్రామాల నుంచి మండల, జిల్లా కేంద్రానికి మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. అనంతరం కల్వకుర్తి పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన క్రిస్మస్వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమంలో పంజుగుల, తుర్కలపల్లి, జీడిపల్లి, తర్నికల్ గ్రామాల సర్పంచులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్సీనియర్ నాయకుడు అశోక్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
