- కలెక్టర్ఆదర్శ్ సురభి
వనపర్తి, వెలుగు : పదేండ్లుగా బ్యాంకుల్లో క్లెయిమ్ చేయకుండా ఉండిపోయిన డిపాజిట్ డబ్బులు తిరిగి పొందేందుకు ఆర్బీఐ కల్పించిన అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. బుధవారం కలెక్టరేట్లో లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో ‘మీ డబ్బు.. మీ హక్కు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్బీఐ ఏజీఎం లక్ష్మీశ్రావ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంకు డిపాజిట్లు, బీమా, మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్ షేర్ తదితర డబ్బులు తిరిగి పొందేందుకు ఆర్బీఐ ఖాతాదారులకు అవకాశం కల్పించిందని తెలిపారు. ఖాతాదారులు సంబంధిత బ్యాంకులను సంప్రదించి కేవైసీ చేయించుకోవడం ద్వారా వడ్డీతో సహా ఆ డబ్బులు పొందవచ్చని చెప్పారు.
జిల్లాలో 1.21 లక్షల క్లెయిమ్ చేయని ఖాతాలు ఉండగా, వాటి విలువ రూ.19 కోట్లుగా ఉంటుందని వివరించారు. అనంతరం వివిధ బ్యాంకర్లు కలెక్టర్ సమక్షంలో క్లెయిమ్ చేయని ఖాతాల హక్కుదారులకు పత్రాలు అందజేశారు. సమావేశంలో ఏడీసీ యాదయ్య, యూబీఐ చీఫ్ మేనేజర్ అశిష్ రంజన్, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ కృష్ణమూర్తి, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చీఫ్ మేనేజర్ శ్రీనివాస్, డీసీసీబీ చీఫ్ మేనేజర్ భూపాల్ రెడ్డి, వనపర్తి లీడ్ బ్యాంకు మేనేజర్ శివకుమార్ పాల్గొన్నారు.
ఆయిల్‌పామ్ సాగు లక్ష్యాన్ని సాధించాలి..
జిల్లాలో ఆయిల్ పామ్ సాగుకు సంబంధించిన లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. ఆయిల్ పామ్ సాగు లక్ష్యాల అంశంపై ఉద్యాన, వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి ఆయిల్ పామ్ సాగుకు ఆసక్తి కలిగిన రైతులను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.
