ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలి : కలెక్టర్ విజయేందిర బోయి

ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలి : కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : ధాన్యం అమ్మిన డబ్బులను ఆలస్యం చేయకుండా రైతులకు చెల్లించాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో ధాన్యం కొనుగోళ్లు, ఎంఎస్పీ చెల్లింపులు, ట్యాబ్ ఎంట్రీ, సీఎమ్మార్ తదితర అంశాలపై అధికారులతో రివ్యూ నిర్వహించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు సకాలంలో డబ్బుల చెల్లించేలా ట్యాబ్ ఎంట్రీలను తక్షణమే అమలు చేయాలన్నారు. కొనుగోళ్లు, ఆన్‌‌‌‌లైన్ ఎంట్రీల మధ్య ఉన్న గ్యాప్‌‌‌‌ను మూడు రోజులకు తగ్గించాలని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నందున రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

జిల్లాలో ఇప్పటివరకు 23,451 మంది రైతుల నుంచి 1,21,577 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం విలువ రూ.290 కోట్లు కాగా, రూ.251 కోట్లు రైతులకు చెల్లించామని తెలిపారు. 2024–25 రబీ సీజన్ కు  సంబంధించిన సీఎమ్మార్​ను వెంటనే ఎఫ్సీఐకి అప్పగించాలని రైస్ మిల్లర్లను ఆదేశించారు. 

పెండింగ్ దరఖాస్తులను క్లీయర్ చేయాలి 

కోయిలకొండ,  పెండింగ్ దరఖాస్తులను త్వరగా క్లీయర్ చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆమె తనిఖీ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని అగ్రో రైతు సేవా కేంద్రాన్ని ఆమె సందర్శించారు.