ఆ గణపతులను నిమజ్జనం చేయరు..నారాయణపేట వినాయకులకు 755 ఏండ్ల చరిత్ర

ఆ గణపతులను నిమజ్జనం చేయరు..నారాయణపేట వినాయకులకు 755 ఏండ్ల చరిత్ర
  •   హైదరాబాద్​కు దీటుగా గణేశ్​ ఉత్సవాలు 
  •   వందకు పైగా మండపాలు.. ఘనంగా నిమజ్జనం 
  •   వైభవోపేతంగా రథాల అలంకరణ 

మక్తల్​, వెలుగు: నారాయణపేట అంటే కాటన్​ చీరలు, పట్టు చీరలు, మేలిమి బంగారానికే కాదు.. వినాయక చవితి ఉత్సవాలకూ కూడా ఫేమస్​. నారాయణపేటలో వందల ఏండ్ల కింద ప్రతిష్ఠించిన నాలుగు మట్టి గణపతులను నిమజ్జనం చేయరు. నవరాత్రుల తర్వాత కూడా ఆ విగ్రహాలకు భక్తులు నిత్యం పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. మిగతా చోట్ల ప్రతిష్టించే విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు మాత్రం అట్టహాసంగా జరుగుతాయి. ఇక్కడ గణేశ్​ ఉత్సవాలు హైదరాబాద్​లో జరిగే ఉత్సవాలకు దీటుగా నిర్వహిస్తారు. 

నాలుగు చోట్ల నిత్యపూజలు

నారాయణపేట జిల్లా కేంద్రంలో కొన్ని చోట్ల ప్రతిష్టించిన గణనాథులు నిమజ్జనం ఎరుగరు. వందల ఏండ్ల కింద ఈ మట్టి గణపతులను ప్రతిష్ఠించగా.. వాటికి నిత్య పూజలు చేస్తుంటారు. స్థానిక పరిమళాపురం ప్రాంతంలో దీక్షితుల కుటుంబానికి చెందిన వారు దాదాపు 755 ఏండ్ల కిందట మట్టి వినాయకున్ని ప్రతిష్ఠించారు. అయితే ఓ రోజు విగ్రహం కింద పడి పగిలిపోయింది. ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేయాలని కొందరు సూచించగా .. దీక్షితులు కుటుంబానికి వినాయకుడు కలలోకి వచ్చి, తనకు ప్రత్యేక పూజలు చేయాలని చెప్పాడట. 

41 రోజులు ప్రత్యేక పూజలు చేశాక.. 42వ రోజు విగ్రహం యధారూపంలోకి వచ్చిందట. అప్పటి నుంచి ఈ వినాయకుడికి పూజలు చేస్తున్నారు. ఈ గణపతిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారు. గణేశ్​ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే స్థానిక సంత్‌‌‌‌‌‌‌‌మఠ్‌‌‌‌‌‌‌‌రాంమందిర్‌‌‌‌‌‌‌‌ ప్రాంతంలోని వినాయకుడికి 600 ఏండ్లు, మూల హనుమాన్‌‌‌‌‌‌‌‌దేవాలయ సమీపంలోని మట్టి గణపతి 400 ఏండ్లు, బ్రాహ్మణవాడిలోని గణపయ్యకు 360 ఏండ్ల చరిత్ర ఉంది. ఈవిగ్రహాలను కూడా నిమజ్జనం చేయరు. 

రథాలే హైలెట్​

 నారాయణపేటలో వినాయక ఉత్సవాలు అత్యంత భారీగా జరుగుతాయి. హైదరాబాద్​లో భారీ మండపాలు, భారీ విగ్రహాలుంటే ఇక్కడ మాత్రం విగ్రహాలు నాలుగు ఫీట్ల లోపు ఎత్తు ఉన్న విగ్రహాలనే ప్రతిష్ఠిస్తారు. పట్టణంలో వందకు పైగా మండపాలను ఏర్పాటు చేస్తారు. తొమ్మిది రోజుల పాటు పూజలు చేసినత తర్వాత పదో రోజు ఘనంగా నిమజ్జనానికి తరలిస్తారు. నిమజ్జనం కోసం విగ్రహాలను తరలించేందుకు రథాలను వైభవోపేతంగా అలంకరిస్తారు. రథాలకు చేసే డెకరేషన్లు ఉత్సవంలో హైలెట్​గా నిలుస్తాయి. రాజకీయ, సామాజిక, సాంకేతిక, ఆధ్యాత్మిక థీమ్​లతో రథాలను అలంకరిస్తారు. ఈ రథాలను చూసేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు కర్నాటక నుంచి భారీగా భక్తులు తరలి వస్తారు. 

నిజాం కాలం నుంచే ఉత్సవాలు

నారాయణపేటలో నిజాం పాలన నుంచి గణేశ్​ ఉత్సవాలు సాగుతున్నాయి. 1940లో స్వాతంత్య్ర సమర యోధుడు నాగర్‌‌‌‌‌‌‌‌కర్‌‌‌‌‌‌‌‌కిషన్‌‌‌‌‌‌‌‌రావు ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత బ్రహ్మణ్‌‌‌‌‌‌‌‌వాడి వీధిలోని ప్రజానంద్‌‌‌‌‌‌‌‌దీక్షితుల ఇంట్లో గణపతిని ప్రతిష్ఠించారు. ఆ రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు నిమజ్జనం చేశారు. మహారాష్ట్రకు చెందిన వారు తమ ప్రాంతంలో ఉత్సవాల గురించి, నిమజ్జన వేడుకల గురించి చెప్పడంతో కొంతకాలానికి ఇక్కడ కూడా తొమ్మిది రోజుల పాటు విగ్రహాలను పూజించి.. పదో రోజు నిమజ్జనం చేస్తున్నారు.