న్యాయ విచారణలో ప్రాసిక్యూటర్స్ కీలకం..

న్యాయ విచారణలో ప్రాసిక్యూటర్స్ కీలకం..

త్యాగాలకు విలువ లేని రోజుల్లో నడుస్తున్నాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ అందరి కోసం ఫైట్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయలను అరికట్టాలని సూచించారు. హైదరాబాద్లోని హోటల్ దస్పల్లాలో డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరిగిన 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా జస్టిస్ వెంకటేశ్వర్ రెడ్డి  హాజరయ్యారు. ఈ సందర్భంగా డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ లోగో ఆవిష్కరించారు. నిందితులకు శిక్షలు పడే విధంగా కృషి చేసిన పలువురు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్కు సర్టిఫికెట్స్ అందజేశారు. 

ప్రాసిక్యూటర్స్ న్యాయ విచారణలో కీలకం..
రాష్ట్రంలో  లీగల్ డిపార్ట్మెంట్ డైనమిక్గా పనిచేస్తుందని హైకోర్టు న్యాయమూర్తి వెంకటేశ్వర్ రెడ్డి  ప్రశంసించారు. అయితే ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. దీనివల్ల కన్విక్షన్ రేటు తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసుల విచారణ, దర్యాప్తు అంతా ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంటే చేస్తోందని అయినా వారికి సరైన సౌకర్యాలు లేవని అన్నారు. ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్కు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నం చేస్తానని జస్టిస్ వెంకటేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రాసిక్యూటర్స్ న్యాయ విచారణలో కీలకంగా పని చేస్తున్నారని ప్రశంసించిన ఆయన.. నిందితులకు శిక్ష పడేలా ప్రాసిక్యూటర్లు పారదర్శకంగా పని చేయాలని సూచించారు. 100 కేసుల్లో ఒక్కరికి శిక్ష పడినా.. మార్పు తప్పక వస్తుందని అభిప్రాయపడ్డారు. కేసు దర్యాప్తులో సాక్షులను కాపాడుకుంటే కేసుల పరిష్కారం సులువవుతుందని చెప్పారు. 

ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్కు ఆఫీసు లేదు..
ఏన్నో పోరాటాల ఫలితమే ఈ స్వాతంత్ర్య దినోత్సవమని ప్రోసిక్యూషన్ డైరెక్టర్ వైజయంతి అన్నారు. మహానుభావుల త్యాగాలతోనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పారు. ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రాసిక్యూషన్ డిపార్ట్ మెంట్కు ఆఫీసులు లేవన్న ఆమె... మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. కేసుల దర్యాప్తులో 75 శాతం పని ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ చేస్తుందని చెప్పారు.