ఎన్నికల ఖర్చులు జెప్పలే!

ఎన్నికల ఖర్చులు జెప్పలే!

రాష్ట్రంలో లోక్‌‌ సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో కొందరు ఎన్నికల ఖర్చు లెక్క చెప్పలేదు. ఇప్పటికే వీరికి ఈసీ రెండు సార్లు నోటీసులు కూడా జారీ చేసింది. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్​సభ స్థానాలకు ఏప్రిల్​ 11న  ఎన్నికలు జరుగగా 449 మంది క్యాండిడేట్లు పోటీపడ్డారు. ఇందులో 364 మంది ఖర్చు వివరాలు ఎన్నికల కమిషన్‌‌కు అందించారు. ఇంకా 76 మంది నుంచి లెక్కలు రావాల్సి ఉందని ఎన్నికల అధికారులు అంటున్నారు. నిజామాబాద్‌‌ లోక్​సభ నియోజకవర్గంలో అత్యధికంగా 68 మంది క్యాండిడేట్లు లెక్కలివ్వలేదు. ఇక్కడ దేశంలోనే రికార్డు స్థాయిలో 185 మంది రైతులు పోటీలో నిలిచిన విషయం తెలిసిందే. నల్గొండలో ఐదుగురు, మహబూబాబాద్‌‌లో ఇద్దరు, మెదక్‌‌లో ఒకరు చొప్పున వివరాలు సమర్పించలేదు. లెక్కలు చూపని వారంతా ఇండిపెండెంట్‌‌ అభ్యర్థులేనని అధికారులు చెప్తున్నారు. ఎన్నికల ఖర్చుకు సంబంధించిన జాబితాను సీఈవో సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించినట్లు తెలిసింది.

30 రోజుల్లో ఇవ్వాల్సి ఉండగా..

ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్థి లెక్కలు చూపాల్సిందేనని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. గెలిచినా, ఓడిపోయినా, డిపాజిట్‌‌ కోల్పోయినా లెక్కలు ఇవ్వాలిందేనని పేర్కొంటున్నారు. కొంతమంది క్యాండిడేట్లకు ఈ విషయం తెలియదని, అయినప్పటికీ జిల్లాల్లో డీఈవోలతో సమావేశాలు కూడా ఏర్పాటు చేసి, వివరించామంటున్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత 30 రోజుల్లో అభ్యర్థులు లెక్కలు సమర్పించాల్సి ఉంటుంది. లోక్​సభ ఎన్నికల ఫలితాలు మే 23న వెలువడ్డాయి. అంటే జూన్‌‌ 22 వరకు క్యాండిడేట్లు తమ ఎన్నికల ఖర్చు వివరాలను ఎన్నికల కమిషన్​కు అందజేయాలి. ఇప్పటివరకు 76 మంది అభ్యర్థులు ఆ వివరాలు ఇవ్వలేదు. వీరికి ఇప్పటికే రెండుసార్లు ఎన్నికల అధికారులు నోటీసులు కూడా పంపారు. మరోసారి నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్నారు.

లెక్కలియ్యకుంటే ఏం చేస్తరు?

లోక్​సభ ఎన్నికల్లో క్యాండిడేట్లు రూ. 70 లక్షల వరకు ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఖర్చుపై ఈసీ షాడో టీంలను కూడా ఏర్పాటు చేసింది. అభ్యర్థులు ఎంత ఖర్చు చేశామో వివరాలు ఇవ్వాలి. గెలిచిన అభ్యర్థులు ఇవ్వకపోతే వారిని ఎంపీ స్థానానికి అనర్హులుగా ప్రకటిస్తారు. ఓడిన అభ్యర్థుల విషయంలో అప్పటికప్పుడు చర్యలు ఉండవు. అయితే.. మళ్లీ ఎన్నికలప్పుడు కూడా ఈసీ నోటీసులు పంపి, వివరాలు కోరుతుంది. అప్పటికీ ఇవ్వకపోతే.. పోటీకి అనర్హులుగా ప్రకటిస్తుంది.

హుజూర్‌‌నగర్‌‌ ఉపఎన్నిక ఎప్పుడో?

హుజూర్‌‌ నగర్‌‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ఎప్పుడు అనేదానిపై స్పష్టత రాలేదు. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన పీసీసీ చీఫ్​ ఉత్తమ్‌‌ కుమార్​ రెడ్డి ఇటీవల నల్గొండ ఎంపీగా గెలవడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నిక నిర్వహణకు సంబంధించి తమకు సీఈసీ నుంచి ఎలాంటి సమాచారం రాలేదని రాష్ట్ర ఎన్నికల అధికారులు అంటున్నారు. ఎంపీ లేదా ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయితే ఆరు నెలల్లోగా ఎన్నిక జరగాల్సి ఉంటుంది. ఇంకా సమయం ఉన్నందున ఈ లోగా నోటిఫికేషన్‌‌ ఇచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.