గజ్వేల్​ బరిలో 44 మంది .. చివరి రోజు 77 మంది విత్​డ్రా

గజ్వేల్​ బరిలో 44 మంది .. చివరి రోజు 77 మంది విత్​డ్రా

సిద్దిపేట/ సంగారెడ్డి/మెదక్ , వెలుగు :  సీఎం కేసీఆర్​ పోటీచేస్తున్న గజ్వేల్​ నియోజకవర్గంలో చివరిరోజు 77 మంది విత్​డ్రా చేసుకున్నారు. ఇక్కడి నుంచి భూనిర్వాసితులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, చెరుకు రైతులు పెద్దసంఖ్యలో నామినేషన్లు వేయగా, వారితో విత్​డ్రా చేయించడంతో బీఆర్ఎస్​ లీడర్లు విజయం సాధించారు. ఉమ్మడి జిల్లాలోనూ నామినేషన్ల ఉప సంహరణ కొనసాగింది. చివరిరోజు సిద్దిపేట లో 16 మంది, దుబ్బాకలో నలుగురు, హుస్నాబాద్ లో 15 మంది తమ నామినేషన్లను ఉప సంహరించుకున్నారు. గజ్వేల్ బరిలో అత్యధికంగా 44 మంది, సిద్దిపేటలో 21, హుస్నాబాద్ లో 19, దుబ్బాకలో 11 మంది పోటీలో మిగిలారు. బీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారుతుందనుకున్న రోడ్ రోలర్ గుర్తు కలిగిన యుగతులసి పార్టీ అభ్యర్థులు సిద్దిపేట, దుబ్బాక స్థానాల్లో తమ నామినేషన్లను ఉప సంహరించుకోవడం గమనార్హం. 

 మెదక్ లో జిల్లాలో 

నామినేషన్ల విత్​డ్రా అనంతరం మెదక్​ అసెంబ్లీ స్థానంలో 13 మంది అభ్యర్థులు, నర్సాపూర్​ అసెంబ్లీ స్థానంలో 11 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. మెదక్ అసెంబ్లీలో మొత్తంలో 18 మంది నామినేషన్లు దాఖలు చేయగా, ఒకటి రిజెక్ట్ అయింది. మరో నలుగురు అభ్యర్థులు... మైనంపల్లి వాణి, చింతల నర్సింలు, సంతోష్​ రెడ్డి, కడారి ప్రభు తమ నామినేషన్లు విత్​డ్రా చేసుకున్నారు. దీంతో 13 మంది బరిలో మిగిలారు. బీఆర్​ఎస్​ అభ్యర్థిగా పద్మా దేవేందర్ రెడ్డి, కాంగ్రెస్​ నుంచి మైనంపల్లి రోహిత్ రావ్, బీజేపీ అభ్యర్థిగా పంజా విజయ్​ కుమార్, బీఎస్పీ అభ్యర్థిగా లక్ష్మీ, ఎంసీపీఐ అభ్యర్థిగా వనం పుల్లయ్య, ఇండియన్​ బిలీవర్​ పార్టీ అభ్యర్థిగా దేవదాస్​, బీసీవై పార్టీ అభ్యర్థిగా వనపర్తి రోహిత్​, ఇండిపెండెంట్లుగా కొమ్మాట స్వామి, గడ్డమీది నాగరాజు గౌడ్​, పట్లోళ్ల బాపురెడ్డి, లస్మగళ్ల పద్మ, లంబాడి తౌర్య బరిలో ఉన్నారు.

నర్సాపూర్​ అసెంబ్లీ స్థానంలో మొత్తం 16 మంది అభ్యర్థులు నామినేషన్​ దాఖలు చేయగా వారిలో ఐదుగురు అభ్యర్థులు... లుకావత్​ రమేష్​ నాయక్, గాలి అనిల్​ కుమార్, పిట్ల నవీన్​ కుమార్​, సీహెచ్​ నవీన్​ కుమార్, గొర్రె ప్రవీణ్​ రెడ్డి నామినేషన్​లు విత్​ డ్రా చేసుకున్నారు. దీంతో 11 మంది ఎన్నికల బరిలో మిగిలారు. ప్రధాన రాజకీయ పార్టీల బీఆర్ఎస్​ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి, కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థిగా ఆవుల రాజిరెడ్డి, బీజేపీ అభ్యర్థిగా మురళీ యాదవ్ బరిలో ఉన్నారు.

 సంగారెడ్డిలో జిల్లాలో 

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 102 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బుధవారం జరిగిన ఉపసంహరణ ప్రక్రియలో సంగారెడ్డి సెగ్మెంట్ నుంచి మొత్తం 30 మంది నామినేషన్లు వేయగా అందులో ఇద్దరు తమ నామినేషన్లు ఉపసంహరించుకోగా 28 మంది అభ్యర్థులు పోటీలో మిగిలారు. అలాగే పటాన్ చెరు నియోజకవర్గంలో చివరి రోజు నామినేషన్లు ఉపసంహరించుకోకపోవడంతో మొత్తం 16 మంది పోటీలో ఉన్నారు.

ఆందోల్ సెగ్మెంట్లో మొత్తం 22 మంది నామినేషన్లు వేయగా నలుగురు విత్ డ్రా చేసుకోగా 18 మంది బరిలో నిలిచారు. నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో మొత్తం 20 మంది నామినేషన్లు వేయగా అందులో ఇద్దరు ఉపసంహరించుకోగా 18 మంది బరిలో ఉన్నారు. జహీరాబాద్ అసెంబ్లీలో 28 నామినేషన్లు దాఖలు కాగా 6 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మిగతా 22 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.