రివ్యూ: 777 చార్లీ... డాగ్ లవర్స్ కు బాగా నచ్చుతుంది

రివ్యూ: 777 చార్లీ... డాగ్ లవర్స్ కు బాగా నచ్చుతుంది

కన్నడ హీరో రక్షిత్ శెట్టి డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో ప్రేక్షకులకు చేరువవుతున్నాడు. ఇంతకు ముందు ‘‘అతడే శ్రీమన్నారాయణ’’ లాంటి యూనిక్ కాన్సెప్ట్ తో ప్యాన్ ఇండియా సినిమా చేసిన రక్షిత్... ఇప్పుడు ‘‘777 చార్లీ’’ మూవీతో వచ్చాడు. రిలీజ్ కు ముందే  ఈ మూవీ విమర్శకుల ప్రశంసలందుకుంది. తెలుగులో హీరో రానా ఈ సినిమాను ప్రెజెంట్ చేశాడు. మరి ఈ రోజు రిలీజైన ఈ సినిమా ఎలా ఉందంటే?

కథేంటంటే..?

రక్షిత్ శెట్టి ఒంటరిగా జీవిస్తుంటాడు. ఓ రోజు తన ఇంటి దగ్గర చార్లీ అనే కుక్క కనిపిస్తుంది. అప్పటి వరకు లోన్లీగా ఉన్న హీరో ఆ చార్లీతో ఎమోషనల్ గా బాగా కనెక్టవుతాడు. సడన్ గా ఒక రోజు చార్లీ గురించి ఒక ఊహించని విషయం తెలుసుకుంటాడు. అదేంటి? చార్లీకి ఏమవుతుంది అనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.

ఆకట్టుకునే మ్యాన్, యానిమల్ మధ్య ఎమోషన్స్...

చార్లీ హార్ట్ టచింగ్ ఫిలిం. కమర్షియల్ గా కాకుండా మనసుతో తీసిన చిత్రం ఇది. ఇలాంటి సినిమాను కమర్షియల్ కోణంలో చూడలేం. మనిషి కి, కుక్క కు ఉండే మంచి అనుబంధం చూడొచ్చు. ఇలాంటి సినిమాలన్నీ ఎమోషనల్ గా సాగుతాయి. యానిమల్ లవర్స్ ఈ సినిమాతో బాగా కనెక్టవుతారు. హీరో,  డాగ్ ల మధ్య సన్నివేశాలు ఒకింత ఎమోషనల్ గా సాగుతాయి.
అయితే అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే అన్ని సినిమాల్లో లాగే ఈ కథ కూడా రెగులర్ గా సాగుతుంది. సినిమా డ్యురేషన్ కూడా ఎక్కువే కావడం మరో మైనస్. చార్లీ, ధర్మ ల మధ్య ఎమోషనల్ సీన్స్ మరీ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తాయి. అవే రిపీటెడ్ గా సాగుతున్నట్టు అనిపించడం మరో మైనస్.

ఎవరెవరు ఎలా పర్ఫార్మ్ చేశారంటే...?

హీరో రక్షిత్ శెట్టి మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ తో ఇంప్రెస్ చేస్తాడు. డాగ్ తో ఉన్న సీన్లల్లో కంటతడి పెట్టిస్తాడు. తన కెరీర్ లో ఇది ఓ గుర్తుండిపోయే చిత్రమవుతుంది. ఉన్నది కొద్దిసేపే అయినా తమిళ నటుడు బాబీ సింహా ఎమోషనల్ పర్ఫార్మెన్స్ పండించాడు. సంగీత శృంగేరి , రాజ్ బీ తదితరులు తమ పాత్రల్లో రాణించారు. మ్యూజిక్ డైరెక్టర్ నోబిన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకే హైలైట్ అని చెప్పుకోవాలి. ఎమోషనల్ సీన్లను బాగా ఎలివేట్ చేశాడు. సినిమటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్ గా ఉండాల్సింది. డైరెక్టర్ రాసుకున్న సంభాషణలు కొన్ని మనసును తాకుతాయి.

ఓటీటీకి ఓకే...

ఓవరాల్ గా ‘‘777 చార్లీ’’ ఆకట్టుకుంటుంది. అయితే ఇది డబ్బింగ్ సినిమా కావడం, ఫీల్ గుడ్ ఆర్ట్ సినిమా కావడం వల్ల లిమిటెడ్ ఆడియన్సే కనెక్టవుతారు. డాగ్ లవర్స్ అయితే బాగా కనెక్టవుతారు. లిమిటెడ్ అప్రోచ్ ఉండటం, కాస్త స్లో నరేషన్ వల్ల యావరేజ్ అనిపిస్తుంది. ఓటీటీలో చూడటానికి బాగుంటుంది.