- అట్టహాసంగా గణతంత్ర దినోత్సవం
- ఉమ్మడి జిల్లాలో అంబరాన్నంటిన సంబురాలు
- జెండా ఎగురవేసిన కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు
వెలుగు, నెట్వర్క్: ఉమ్మడి జిల్లాలో 77వ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కలెక్టరేట్లు, జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు జాతీయ జెండా ఎగురవేసి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. పట్టణాలు, మండల కేంద్రాల్లోని ప్రభుత్వ, పార్టీ, సంఘం కార్యాలయాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, నేతలు జెండాలు ఎగురవేశారు. ప్రజల సహకారంతో నిర్మల్ జిల్లా ప్రగతి పథంలో పయనిస్తోందని, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు.
గణతంత్ర వేడుకల్లో భాగంగా కలెక్టరేట్ లో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు. రైతులను రైతు భరోసా, రుణమాఫీ పథకాలు ఆర్థికంగా ఆదుకుంటున్నాయన్నారు.
జిల్లాలో 1,13,62 మంది రైతుల ఖాతాల్లో 268.75 కోట్లను నేరుగా వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. 71,565 మంది రైతులకు రూ.658.61 కోట్ల పంట రుణాలు మాఫీ చేశామన్నారు. గృహ జ్యోతి పథకం కింద 1,25,026 కుటుంబాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రసూతి మరణాలను తగ్గించాలన్న సంకల్పం చేపట్టిన అమ్మ రక్షిత కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. సదర్ మాట్ బ్యారేజీని నిర్మించి 18 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. ఎస్పీ జానకీ షర్మిల, అడిషనల్ కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆసిఫాబాద్ కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు పైసా ఖర్చు లేకుండా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని, జిల్లాలో ఇప్పటివరకు కోటి 99 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించి రూ.50.91 కోట్లు ఆదా చేసుకున్నారని తెలిపారు. జిల్లాలో 15,73,148 జీరో కరెంట్బిల్లులు జారీ చేశామని, 1,23,312 కుటుంబాలకు లబ్ధి చేకూరిందని తెలిపారు.
ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎస్పీ నితికా పంత్, అడిషనల్ కలెక్టర్లు దీపక్ తివారీ, డేవిడ్, డీఎఫ్‌వో నీరజ్ కుమార్, సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లా పాల్గొన్నారు.
అభివృద్ధిలో ఆదర్శంగా మంచిర్యాల
మంచిర్యాల జిల్లా అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తోందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. రిపబ్లిక్ డే వేడుకలను జిల్లా కేంద్రంలోని జడ్పీ బాయ్స్ హైస్కూల్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ పి.చంద్రయ్య, డీసీపీ ఎ.భాస్కర్, డీఎఫ్‌వో శివ్ ఆశిష్ సింగ్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్‌తో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రగతిని వివరించారు. మహాలక్ష్మి పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, గృహజ్యోతి, రుణమాఫీ, రైతు భరోసా, రైతుబీమా, ధాన్యం కొనుగోళ్లు, పత్తి కొనుగోళ్లు, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం, భూభారతి, ఇందిరా మహిళాశక్తి తదితర స్కీముల అమలు తీరును తెలియజేశారు.
అనంతరం ప్రభుత్వ శాఖలలో పనిచేస్తూ ఉత్తమ సేవలు అందించిన 86 అధికారులు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధికారి చాతరాజుల దుర్గాప్రసాద్‌తో కలిసి కులాంతర వివాహం చేసుకున్న ఒక్కో జంటకు రూ.2.50 లక్షల చొప్పున 3 సంవత్సరాల పాటు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన బాండ్లను అందజేశారు.
జాతీయ స్థాయిలో జిల్లాకు గుర్తింపు గర్వకారణం
జిల్లాను అభివృద్ధి పథంలో ముందుచుతూ ఆస్పిరేషన్ బ్లాక్‌లో జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం గర్వకారణమని ఆదిలాబాద్కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదిలాబాద్ పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన వేడుకల్లో పాల్గొన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క లబ్ధిదారులకు అందుతున్నాయని అన్నారు.
పేదల సొంతింటి కల సాకారం చేస్తూ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 లక్షలు అందజేస్తోందన్నారు. జిల్లా వ్యాప్తంగా 35,326 కొత్త రేషన్ కార్డులు అందించామన్నారు. మహాలక్ష్మీ పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 2.85 కోట్ల మంది మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించినట్లు తెలిపారు. గృహజ్యోతి కింద 1.04 లక్షల మంది లబ్ధి పొందారని అన్నారు.
వ్యవసాయ శాఖ ద్వారా 61,335 మంది రైతులకు రూ.673.88 కోట్ల రుణమాఫీ, 1.60 లక్షల మందికి 329.77 కోట్ల రైతు భరోసా చెల్లించామన్నారు. వేడుకల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు, ఎస్పీ అఖిల్ మహాజన్, అటవీశాఖ అధికారి ప్రశాంత్ బాజీరావు, అడిషనల్ కలెక్టర్లు శ్యామల దేవి, రాజేశ్వర్ పాల్గొన్నారు.
సింగరేణీయుల సమష్టి కృషితో కంపెనీ భవిష్యత్
సింగరేణియుల సమష్టి కృషితోనే కంపెనీ మనుగడ కొనసాగుతోందని మందమర్రి, శ్రీరాంపూర్ఏరియాల జీఎంలు ఎన్.రాధాకృష్ణ, ఎం.శ్రీనివాస్, జైపూర్ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి అన్నారు. ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు.
బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకతలో సంస్థ నిర్దేశిత లక్ష్యాలను సాధిస్తోందని, రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించడంలో ముందు ఉండాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. కోలిండియా స్థాయి క్రీడలు, కల్చరల్ పోటీల్లో మెడల్స్సాధించిన ఉద్యోగులను సన్మానించారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చినవారికి ప్రోత్సాహక బహుమతులును అందజేశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ లో సీపీ అంబర్ కిశోర్ ఝా జాతీయ జెండాను ఆవిష్కరించారు.
