మదినిండుగా.. జెండా పండుగ..ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అంబరాన్నంటిన స్వాతంత్ర్య సంబురాలు

మదినిండుగా.. జెండా పండుగ..ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అంబరాన్నంటిన స్వాతంత్ర్య సంబురాలు

ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్​ జిల్లాల్లో 79వ స్వాతంత్ర్య వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. పల్లె, పట్టణం తేడా లేకుండా వీధివీధినా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీల నాయకులు దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల సేవలను కొనియాడారు. మహాత్మాగాంధీ, అంబేద్కర్, భగత్​సింగ్, సుభాష్​చంద్రబోస్​తదితరుల ఫొటోలకు నివాళి అర్పించారు. 

 గరీబీ హటావో లక్ష్యం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

ఆదిలాబాద్, వెలుగు: గరీబీ హటావో లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్​పరేడ్ మైదానంలో జరిగిన స్వాతంత్ర్య వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించారు. ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. జిల్లాకు 9,093 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని తెలిపారు. నార్నూర్ ఆపరేషన్ బ్లాక్ కార్యక్రమంతో నీతి అయోగ్ పురస్కారం అందుకోవడంపై కలెక్టర్ రాజర్షి షాను అభినందించారు.

అధికారులు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రదర్శనలు ఇచ్చిన స్కూళ్ల అవసరాల కోసం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ రూ.50 వేలు అందజేశారు. ఎంపీ నగేశ్, ఎమ్మెల్యేలు శంకర్, బొజ్జు పటేల్, అనిల్ జాదవ్, అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, ఎస్పీ అఖిల్ మహాజన్, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య తదితరులున్నారు. 

సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం : ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్​

మంచిర్యాల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్​ తెలిపారు. శుక్రవారం నస్పూర్​లోని ఐడీవోసీ ఆవరణలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్​ కుమార్​దీపక్​, డీసీపీ భాస్కర్​తో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండా ఎగురవేశారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయ సాధనకు ప్రతీ పౌరుడు కృషి చేయాలని కోరారు. జిల్లాకు 24,079 కొత్త రేషన్​ కార్డులు జారీ చేశామని, కొత్తగా 53,040 మంది లబ్ధిదారుల పేర్లను చేర్చామని తెలిపారు.

1.22 లక్షల మందికి మహిళలకు రూ.14.63 కోట్ల లోన్లు సాంక్షన్​ చేశామన్నారు. జిల్లాలో 3 యంగ్​ ఇండియా ఇంటిగ్రేటెడ్​స్కూళ్ల పనులు జరుగుతున్నాయని చెప్పారు. కలెక్టరేట్ లో కలెక్టర్​ కుమార్​ దీపక్​, రామగుండం పోలీస్​కమిషనరేట్​హెడ్​క్వార్టర్స్​లో సీపీ అంబర్​ కిశోర్ ​ఝా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో తిరంగా బైక్​ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్​ ఆవరణలో విద్యార్థుల కల్చరల్​ ప్రోగ్రామ్స్​ అలరించాయి. ఆయా శాఖల స్టాళ్లు, శకటాలు ఆకట్టుకున్నాయి. 

యువతకు ఉపాధి కల్పనే ధ్యేయం: రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య

నిర్మల్, వెలుగు:  యువతకు ఉపాధి కల్పనే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు. నిర్మల్​కలెక్టరేట్ లో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ఎగురవేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలిపారు. భూభారతి చట్టం ద్వారా భూ సమస్యలన్నింటికీ శా శ్వత పరిష్కారం లభించబోతోందని చెప్పారు.

క్రీడల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ పాలసీని అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.  జిల్లాను అన్ని రంగాల్లో ముందు నిలిపేందుకు ఇన్​చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అందిస్తున్న సహకారం, ఎంపీ, ఎమ్మెల్యేలు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కలెక్టర్ అభిలాష అభినవ్, అడిషనల్ కలెక్టర్లు కిశోర్ కుమార్, ఫైజాన్ అహ్మద్, ఎస్పీ జానకి షర్మిల, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.  

అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు: మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్

ఆసిఫాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్​కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రూ.13 వేల కోట్లు ఖర్చు చేసి, 3.10 కోట్ల మందికి సన్న బియ్యం ఇస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో కొత్త రేషన్​కార్డుల కోసం 54 వేల దరఖాస్తులు రాగా48 వేలు పరిష్కరించామని పేర్కొన్నారు. 51,523 మంది రైతులకు రూ.465 కోట్ల రుణమాఫీ చేశామన్నారు.  

7,398 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని తెలిపారు. భూభారతి రెవెన్యూ సదస్సుల్లో 4,356 దరఖాస్తులు రాగా 148 అర్జీలను పరిష్కరించామని చెప్పారు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. అటవీ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్, అడిషనల్ కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, డీఎఫ్వో నీరజ్ కుమార్ టీబ్రేవాల్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఎమ్మెల్యే కోవ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.