అత్యంత ఎత్తయిన క్రికెటర్ కావడమే అతడి డ్రీమ్

అత్యంత ఎత్తయిన క్రికెటర్ కావడమే అతడి డ్రీమ్

న్యూఢిల్లీ: క్రికెట్‌‌లో బౌలర్ల ఫ్యాక్టరీగా పాకిస్తాన్‌‌కు మంచి పేరుంది. ఎంతోమంది ప్రపంచస్థాయి టాలెంటెడ్ స్వింగ్, పేస్ బౌలర్లను పాక్ అందిస్తూ వచ్చింది. ఇప్పుడు అత్యంత ఎత్తయిన క్రికెటర్‌‌‌‌ను అందించాలని దాయాది ఉవ్విళ్లూరుతోంది. పాక్‌‌కు చెందిన 21 ఏళ్ల ముదస్సిర్ గుజ్జార్ ఎత్తు 7 అడుగుల 6 ఇంచులు. ఫాస్ట్ బౌలర్ అయిన ముదస్సిర్‌‌ను పాకిస్తాన్ సూపర్ లీగ్‌‌లో లాహోర్ కలందర్స్ కొనుక్కుంది. ఏదో ఓ రోజు ముదస్సిర్‌‌ పాకిస్తాన్‌‌కు ప్రాతినిధ్యం వహిస్తాడని కలందర్స్ ఆశిస్తోంది. అందిన సమాచారం ప్రకారం.. ముదస్సిర్‌‌ తల్లిదండ్రుల ఎత్తు సాధారణమే. అతడి తండ్రి హషీమ్ మొహమ్మద్ ఎత్తు 5.6 ఫీట్లు కాగా, తల్లి పర్వీన్ హైట్ 5.3 ఫీట్స్. స్కూల్ టైమ్‌‌కే ముదస్సిర్‌‌ చాలా ఎత్తు పెరిగాడు.

ఒక దశలో ముదస్సిర్‌‌ ఎత్తు గురించి అతడి పేరెంట్స్ ఆందోళన చెందారు. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అని డాక్టర్లను కలిశారు. కొన్ని హార్మోనల్ సమస్యలతో అలా ఎత్తు పెరుగుతున్నాడని వైద్యులు చెప్పారట. గత ఏడాదిన్నర నుంచి ముదస్సిర్‌‌ ఎత్తు పెరగకపోవడం గమనార్హం. తన ఎత్తు వల్ల చాలా చోట్ల ఇబ్బందులు పడ్డానని, అయితే చాలా వేగంగా పరిగెత్తగలగడం పాజిటివ్‌‌గా మారిందని ముదస్సిర్‌‌ చెప్పాడు. అందుకే ఫాస్ట్ బౌలర్‌‌గా మారానన్నాడు. ఏదో ఓ రోజు ప్రపంచంలో అత్యంత ఎత్తయిన క్రికెటర్‌‌గా మారతాననే నమ్మకం ఉందని ముదస్సిర్‌‌ వివరించాడు.