తెలుగు రాష్ట్రాల గజదొంగ అరెస్ట్

తెలుగు రాష్ట్రాల గజదొంగ అరెస్ట్

అమరావతి: దివ్యాంగుడే..కానీ చేసేది మాత్రం దొంగతనం..రైళ్లలో నిద్రిస్తున్న ప్రయాణికులే అతడి టార్గెట్..రాత్రివేళ్లలో ఏసీ బోగీల్లోకి ప్రవేశించి తన చోరీకళ ప్రదర్శిస్తాడు. చాకచాక్యంగా బ్యాగుల్లోంచి విలువైన వస్తువులు మాయం చేస్తాడు. తెలుగు రాష్ట్రాల్లో కదులుతున్న రైళ్లలో లక్షల సొత్తు కాజేసిన కేటుగాడు. దివ్యాంగుడిగా టికెట్టు తీసుకొని దర్జాగా చోరీలు చేస్తున్న అంతర్ రాష్ట్ర గజదొంగను బుధవారం (ఆగస్టు 13) పోలీసులు అరెస్ట్ చేశారు.  వివరాల్లోకి వెళితే.. 

కదులుతున్న రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర గజదొంగనుపట్టుకున్నారు నెల్లూరు రైల్వే పోలీసులు. రైల్వే డీఎస్పీ వివరాల ప్రకారం..నెల్లూరు, గూడూరు, కావలి సహా పలు రైల్వే స్టేషన్ల పరిధిలో జరిగిన రైలు దొంగతనాల కేసుల దర్యాప్తులో భాగంగా పోలీసులు జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

అతడిని ప్రశ్నించగా అతను పాత నేరస్తుడని, గతంలో హైదరాబాద్, విజయవాడ, కర్నూలు, నంద్యాల, తిరుపతి రైల్వే స్టేషన్లలో జరిగిన 10కి పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్నట్టు బయటపడింది. అతని దగ్గర నుంచి రెండు మొబైల్ ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లు, 143 గ్రాముల బంగారం మొత్తం సుమారు రూ. 12 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 

దివ్యాంగుడిగా రైల్వే టికెట్ తీసుకుని రాత్రి వేళల్లో ఏసీ బోగీల్లోకి ప్రవేశించి నిద్రలో ఉన్న ప్రయాణికుల బ్యాగులు, విలువైన వస్తువులను అపహరించడం ఈ దొంగస్టయిల్. అని డీఎస్పీ వెల్లడించారు.