
- ఫోర్జరీ, నకిలీ ష్యూరిటీ సంతకాలతో బెయిల్ ఇప్పించిన ఘటనలో 17 మందిపై కేసు,
- 8 మంది అరెస్ట్
- వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్, వెలుగు: ఫోర్జరీ సంతకాలు, నకిలీ ష్యూరిటీలు సృష్టించి ఏకంగా కోర్టునే తప్పుదోవ పట్టించి నిందితులకు బెయిల్ ఇప్పించిన కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియాకు వివరాలు వెల్లడించారు. తలమడుగు మండలం కొత్తూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి గీరవేని రాహుల్ ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీస్స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. గ్రామానికి చెందిన కారోబార్ అభిలాశ్ రెడ్డి, బ్రోకర్ సయ్యద్ ఇర్ఫాన్ సెక్రటరీ ఫోర్జరీ సంతకాలతో పత్రాలు సృష్టించి నిందితులకు బెయిల్ తో పాటు జప్తు చేసిన ప్రాపర్టీ రిలీజ్ కోసం కోర్టులో సమర్పించినట్లు తేలిందన్నారు.
నకిలీ ష్యూరిటీలతో ముగ్గురికి బెయిల్ ఇప్పించినట్లు తెలిపారు. కొత్తూరుకు చెందిన కారోబార్ కాటిపెల్లి అభిలాశ్ రెడ్డి, గంటి సత్తన్న, మద్దెల అశోక్, రామిరెడ్డి, కోకటాయ్ అశోక్, ఆదిలాబాద్ కు చెందిన సయ్యద్ ఇర్ఫాన్, షాహిద్, ఎండీ అమీర్ ను అరెస్ట్ చేశామని చెప్పారు. గడుగు సురేశ్, ఉల్లెంగలువ భూమన్న, బోర్కర్ రాజు, బోర్కర్ శ్రీనివాస్, సద్దాం, ముషీర్, షాహీల్, కలీం, జంటి పరారీలో ఉన్నారని ఎస్పీ తెలిపారు. ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె నాగరాజు పాల్గొన్నారు.