న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ.. కీలకమైన హార్మూజ్ జలసంధిగుండా భారత నౌకల రాకపోకలు నిరంతరాయంగా సాగుతున్నాయి. ఇరాన్-–ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలోనూ.. భారత్‌కు చెందిన సుమారు 8 నౌకలు ఈ కీలక మార్గం ద్వారా సురక్షితంగా ప్రయాణించాయి. తాజాగా, ‘గ్రీన్ సాన్వీ’ అనే గ్యాస్ క్యారియర్ 46,650 టన్నుల ఎల్‌పీజీతో శుక్రవారం రాత్రి సురక్షితంగా ఈ జలసంధిని దాటింది.
ఫిబ్రవరి 28న యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పటి నుంచి భారత్‌కు చెందిన శివాలిక్, నందాదేవి, జగ్ లాడ్కీ, పైన్ గ్యాస్, జగ్ వసంత్, బీడబ్ల్యూ టైర్, బీడబ్ల్యూ ఎల్మ్, గ్రీన్ సాన్వీలాంటి షిప్‌లు హార్మూజ్ జలసంధిని దాటాయి. సాధారణ ప్రజలకు అవసరమైన ఇంధన సరఫరాలో అంతరాయం కలగకుండా ఈ నౌకలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
భారత్‌కు ఇరాన్ అభయం
ప్రపంచవ్యాప్తంగా జరిగే ముడి చమురు రవాణాలో 20% వాటా ఈ హార్మూజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. భారత్ తన ఇంధన అవసరాల కోసం గల్ఫ్ దేశాలపై ఎక్కువగా ఆధారపడటంతో ఈ మార్గం అత్యంత కీలకం. యుద్ధం నేపథ్యంలో ఇతర దేశాల నౌకలను అడ్డుకుంటున్న ఇరాన్.. భారత్‌ను మాత్రం ‘మిత్రదేశం’గా గుర్తించింది. ‘‘మా భారతీయ మిత్రులు సురక్షితమైన చేతుల్లో ఉన్నారు.. ఎలాంటి ఆందోళన వద్దు” అని ఇటీవల ఎక్స్ వేదికగా భారత్‌కు ఇరాన్ భరోసా ఇచ్చింది. హార్మూజ్ జలసంధి భవిష్యత్తును కేవలం ఇరాన్, ఒమన్ మాత్రమే నిర్ణయిస్తాయని కూడా ఈ సందర్భంగా పేర్కొన్నది.
కాగా, పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్న ప్రతి భారతీయ నౌకను, సిబ్బందిని భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తున్నదని కేంద్ర ఓడరేవుల శాఖ అదనపు కార్యదర్శి ముఖేశ్ మంగళ్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ఓడరేవుల్లో కార్యకలాపాలు యధావిధిగా.. ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో 18 భారతీయ నౌకలు, వాటిలో సుమారు 485 మంది నావికులు ఉన్నారని, ఇప్పటివరకు 964 మంది సిబ్బందిని స్వదేశానికి రప్పించినట్లు సమాచారం.
