లారీ ఢీకొన్న బస్సు.. మంటలు చెలరేగి 8 మంది మృతి

లారీ ఢీకొన్న బస్సు.. మంటలు చెలరేగి 8 మంది మృతి

రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి.. ఎనిమిది మంది మరణించారు.  మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. పచ్‌పద్రా సమీపంలోని బలోత్రా వద్ద బర్మర్‌‌ – జోధ్‌పూర్‌‌ హైవేపై ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో బస్సు, లారీ ఢీకొనడంతో ఆ బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో బస్సులో ఉన్న 25 మంది ఆ మంటల్లో చిక్కుకున్నారు. మంటల్లో కాలి తీవ్ర గాయాలు కావడంతో ఎనిమిది మంది మృతి చెందారు. ఈ ఘటన గురించి తెలియగానే పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటీన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇందులో పలువురికి తీవ్రగాయాలయ్యాయని పోలీసులు చెబుతున్నారు. 

ఈ ఘటన గురించి తెలిసి, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ వెంటనే బర్మర్ జిల్లా కలెక్టర్‌‌కు ఫోన్ చేసి మాట్లాడారు. వేగంగా సహాయచర్యలు చేపట్టి, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. జిల్లా అధికారులు, పోలీసులు, రాష్ట్ర మంత్రి సుఖ్‌రామ్‌ బిష్ణోయి, పచ్‌పద్ర ఎమ్మెల్యే మదన్ ప్రజాపత్ ఘటనాస్థలానికి వెళ్లి చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షించారు.