
హైదరాబాద్, వెలుగు : వరుస ఎన్నికల్లో ఓడిపోయిన కొందరు నేతలు ఎట్టకేలకు విజయం సాధించారు. ఇలా ఈ సారి 8 మంది అభ్యర్థులు గెలవగా.. ఇందులో ఎక్కువ మంది కాంగ్రెస్ లీడర్లే కావడం గమనార్హం. తాజాగా గెలిచిన ఆది శ్రీనివాస్ (వేములవాడ – కాంగ్రెస్), అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (ధర్మపురి - కాంగ్రెస్), గండ్ర సత్యనారాయణ (భూపాలపల్లి - కాంగ్రెస్), పాయల్ శంకర్ (ఆదిలాబాద్ – బీజేపీ), మేడిపల్లి సత్యం (చొప్పదండి– కాంగ్రెస్), కవ్వంపల్లి సత్యనారాయణ (మానకొండూరు – కాంగ్రెస్), హుస్నాబాద్ (పొన్నం ప్రభాకర్ – కాంగ్రెస్), ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా (నిజామాబాద్ అర్బన్ – బీజేపీ).. గత ఎన్నికల్లో వరుసగా ఓడిన వారే. వీరిలో పలువురు 2009, 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. పొన్నం ప్రభాకర్ మాత్రం 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
పని చేసిన సింపతీ
సొంత నియోజకవర్గం కరీంనగర్ నుంచి కాకుండా హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్ పోటీ చేశారు. అయితే హుస్నాబాద్ నుంచి టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డిని హైకమాండ్ బుజ్జగించటంతో పొన్నంకు లైన్ క్లియర్ అయింది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ గ్రామానికి వెళ్లినపుడు ఆది శ్రీనివాస్ కన్నీటి పర్యంతమయ్యారు.
ఆయనతో పాటు గ్రామస్థులు ఏడ్చారు. 2014 ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిన మట్టా దయానంద్.. ఇటీవల అనారోగ్యానికి గురై ఆపరేషన్ చేయించుకున్నారు. క్యాస్ట్ అంశంలో కేసు ఉండటంతో ఆయన భార్య మట్టా రాగమయికి టికెట్ ఇప్పించుకుని గెలిపించుకున్నారు.