జీహెచ్ఎంసీ క్వాలిటీ సెల్​లో8 వేల ఫైల్స్ పెండింగ్

జీహెచ్ఎంసీ క్వాలిటీ సెల్​లో8 వేల ఫైల్స్ పెండింగ్
  • ఫైనల్ రిపోర్టులు ఇచ్చి, బిల్లులు చెల్లించడంలో నిర్లక్ష్యం
  •  కాంట్రాక్టర్లకు దాదాపు రూ.400 కోట్లు బాకీ
  •  ఏఈ, డీఈ, ఎస్ఈలే ఫైళ్లను ఆపుతున్నారనే ఆరోపణలు 

హైదరాబాద్, వెలుగు: పూర్తి చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన రిపోర్టులు ఇచ్చి, బిల్లులు చెల్లించడంలో జీహెచ్‌‌‌‌ఎంసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ఆందోళన బాట పట్టినా పట్టించుకోవడం లేదు. పనులు పూర్తయిన వెంటనే క్వాలిటీ చెక్ చేసి ఫైనల్ రిపోర్టులు ఇవ్వకుండా ఏండ్లుగా తిప్పుకుంటున్నారు. ఒకరి మీద ఒకరు చెప్పుకొంటూ కాంట్రాక్టర్లను వేధిస్తున్నారు. కింది స్థాయి అధికారులు ఎందుకు పనిచేయడం లేదన్న దానిపై సూపరింటెండెంట్ ఇంజనీర్లు సమాధానం చెప్పలేకపోతున్నారు. క్వాలిటీ కంట్రోల్ సెల్ ఇవ్వాల్సిన ఫైనల్ రిపోర్టులు రాకపోవడంతో ఆరేండ్లుగా కాంట్రాక్టర్లకు బిల్లులు అందడం లేదు. దాదాపు 8 వేలకి పైగా ఫైల్స్​పెండింగ్​లో ఉన్నట్లు తెలుస్తోంది. బల్దియా వీటికి సంబంధించి దాదాపు రూ.400 కోట్లు చెల్లించాల్సి ఉంది.

ఒకరిపై ఒకరు చెప్పుకొంటూ..
 

క్వాలిటీ కంట్రోల్ సెల్ ఫైనల్ రిపోర్టులు ఎందుకు ఇవ్వడం లేదని ఆ విభాగంలోని అధికారులను అడిగితే తమ వద్దకు ఏఈలు, డీఈలు ఫైళ్లు పంపడం లేదని సమాధానం ఇస్తున్నారు. వాళ్లు పంపకపోతే మేమేం చేస్తామంటున్నారు. ఈ విషయమై ఎస్ఈలను అడిగితే క్వాలిటీ సెల్ వారు ఇచ్చే రిపోర్టుల గురించి మాకేం తెలుస్తుందని సమాధానం ఇస్తున్నారు. వీరి కింద పనిచేసే ఏఈలు, డీఈలు ఫైల్స్ పంపాల్సి ఉన్నప్పటికీ ఎస్ఈలు పట్టించుకోవడం లేదు. ఏదో ఒకటి చెబుతూ దాటుకుంటున్నారు. ఇలా అధికారుల నిర్లక్ష్యానికి కాంట్రాక్టర్లు బలవుతున్నారు.

సిట్టింగ్ జడ్జితో విచారించాలి: కాంట్రాక్టర్లు

ఫైనల్ రిపోర్టులు ఎందుకు ఇవ్వడం లేదన్న దానిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పలువురు కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. లంచాల కోసం కావాలనే రిపోర్టులు ఆపుతున్నారని ఆరోపిస్తున్నారు. పనులు చేసి ఏండ్లు గడుస్తున్నా ఫైనల్ బిల్లులు ఇవ్వకపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 2017 నుంచి వేలాది బిల్లులు ఆపారని, దీంతో చిన్న కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదని చెబుతున్నారు. కనీసం పెండింగ్​ బిల్లులను ఎప్పటిలోగా క్లియర్ ​చేస్తారో చెప్పడం లేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు.