చివర్లో విమాన టికెట్ క్యాన్సిల్ చేసుకున్నా 80 శాతం వరకు రీఫండ్‌‌?

చివర్లో విమాన టికెట్ క్యాన్సిల్ చేసుకున్నా 80 శాతం వరకు రీఫండ్‌‌?

 

  • కొత్త వ్యవస్థను రూపొందిస్తున్న  ప్రభుత్వం
  • వచ్చే మూడు నెలల్లో అమల్లోకి వచ్చే అవకాశం
  •  ట్రావెల్ ఇన్సూరెన్స్‌‌ తప్పనిసరి..టికెట్ ఖర్చులోనే కలిసి ఉంటుందని అంచనా

న్యూఢిల్లీ: విమాన ప్రయాణికులకు శుభవార్త!  ప్రయాణానికి నాలుగు గంటల ముందు టికెట్ రద్దు చేసుకున్నా 80 శాతం వరకు రిఫండ్ పొందే కొత్త వ్యవస్థను ప్రభుత్వం రూపొందిస్తోంది.  రానున్న  రెండు–మూడు నెలల్లో ఇది అమలులోకి రావచ్చని ఆంగ్ల పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది. ప్రస్తుతం, చివరి మూడు గంటల్లో బుకింగ్ రద్దు చేస్తే “నో -షో” గా పరిగణిస్తున్నారు. దీంతో ప్రయాణికులు  మొత్తం చార్జీ కోల్పోవాల్సి వస్తోంది. వైద్య అత్యవసర పరిస్థితుల్లో కొన్ని ఎయిర్‌‌లైన్స్ రీఫండ్ ఇస్తున్నా, అది పూర్తిగా వారి ఇష్టంపై ఆధారపడి ఉంటోంది.     “టికెట్ రీఫండ్ సమస్యలు ప్రయాణికుల ప్రధాన ఫిర్యాదుగా మారాయి”  అని  తన డ్రాఫ్ట్‌‌లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)  పేర్కొంది.  రీఫండ్ ఆలస్యంగా అందుతుండడం,  కొంత మొత్తాన్నే పొందడం వంటి సమస్యలను ప్రయాణికులు ఎదుర్కొంటున్నారని తెలిపింది.  

ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టేది కంపెనీనే!

కొత్త ప్రతిపాదనలో ప్రతి టికెట్‌‌లో చిన్న ఇన్సూరెన్స్ భాగాన్ని ఆటోమేటిక్‌‌గా చేర్చనున్నారు. ప్రయాణికులు అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు.  ఎయిర్‌‌లైన్స్ సంస్థలు ఇన్సూరెన్స్ కంపెనీలతో ఒప్పందం చేసుకుని ప్రీమియంను తామే భరిస్తాయి.  “ఈ చర్యలతో  ప్రయాణికులలో ఉన్న “చివరి నిమిషంలో  రద్దు చేస్తే డబ్బు పోతుందనే భయం” తగ్గుతుంది. దీంతో పాటు ప్రతి టికెట్‌‌లో సుమారు రూ.50 ప్రీమియం చేర్చితే, విమానం బయలుదేరే నాలుగు గంటల ముందు టికెట్ రద్దు చేసినా 80 శాతం వరకు రీఫండ్ పొందగలరు”అని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.  ఎయిర్‌‌లైన్స్ ఇప్పటికే ఆన్‌‌లైన్ పోర్టల్స్ ద్వారా  ఇన్సూరెన్స్ ఎంచుకోవడానికి ఆప్షన్ ఇస్తున్నాయి.  కానీ  మొత్తం ప్రయాణికులలో కేవలం 2–3 మంది మాత్రమే చివరి నిమిషంలో టికెట్ రద్దు  చేస్తే, ఈ కొత్త మోడల్‌‌ ఆర్థికంగా సక్సెస్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.  ఇన్సూరెన్స్ కంపెనీలు గతంలో రికార్డయిన క్యాన్సిలేషన్ శాంపిల్స్  విశ్లేషించి ప్రీమియంను నిర్ణయిస్తాయని తెలిపారు.