
వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో ఆదివారం జరగనున్న ఊర పండుగకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోచమ్మ, ఎల్లమ్మ, ముత్యాలమ్మ అమ్మవార్ల విగ్రహాలను వడ్రంగులు సిద్ధం చేశారు. ఏటా ఆషాఢమాసంలో నిర్వహించే ఈ పండుగకు నిష్ఠతో ఐదు రోజులపాటు 13 ప్రతిమలు తయారు చేస్తారు. మల్లారం ఆటవీ ప్రాంతంలోని మామిడి చెట్టు నుంచి తీసుకువచ్చిన కర్రతో మాత్రమే వీటిని తయారు చేస్తారని, దాదాపు 80 ఏళ్లుగా ఈ ఆచారం కొనసాగుతోందని సార్వజనిక్సభ్యులు చెప్పారు. ఉదయం ఖిల్లాలోని తేలు గద్దె వద్ద అమ్మవార్ల విగ్రహాలకు పూజలు చేసి, పలు ఆలయాలకు ఊరేగింపుగా తీసుకెళ్తామని పేర్కొన్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు
నిజామాబాద్, వెలుగు: నగరంలో ఆదివారం నిర్వహించనున్న ఊర పండుగ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించామని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్అలీ తెలిపారు. ఖిల్లా చౌరస్తా నుంచి ఉదయం 6 గంటలకు మొదలయ్యే పండుగ ఊరేగింపు వివేకానంద విగ్రహం, గాజుల్‌పేట, గురుద్వార, గోల్హనుమాన్ నుంచి వినాయక్‌నగర్, దుబ్బ వైపు వెళ్తుందన్నారు. బోధన్ వైపు వెళ్లే వాహనాలు, ఆర్టీసీ బస్సులు మధ్నాహ్నం 3 గంటల వరకు పాత బస్టాండ్, నెహ్రూ చౌక్, గాంధీ చౌక్ మీదుగా వెళ్తాయని పేర్కొన్నారు. తర్వాత ఆర్ఆర్చౌరస్తా, పులాంగ్చౌరస్తా మీదుగా యథావిధిగా ప్రయాణిస్తాయని తెలిపారు.