దసరాకు మస్తు కిక్కు! 4 రోజుల్లో లిక్కర్ సేల్... రూ. 800 కోట్లు

దసరాకు మస్తు కిక్కు! 4 రోజుల్లో లిక్కర్ సేల్... రూ. 800 కోట్లు
  • స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఊర్లలో జోరుగా దావత్​లు
  • 2న గాంధీ జయంతి వచ్చినా.. ముందే కొనుగోలు చేయడంతో పెరిగిన అమ్మకాలు
  • బెల్ట్ షాపుల్లో ఏరులై పారిన మద్యం

హైదరాబాద్, వెలుగు: దసరా పండుగ సందర్భంగా ఈసారి మద్యం అమ్మకాలు అనూహ్యంగా పెరిగాయి. పండుగ సరిగ్గా అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి రోజునే రావడంతో ప్రభుత్వం వైన్ షాపులు మూసివేయాలని ఆదేశించింది. దీంతో ఆబ్కారీ శాఖ కూడా ఈసారి అమ్మకాలు తగ్గుతాయని భావించింది. కానీ, మందుబాబులు ముందుగానే అలర్ట్ కావడంతో ఈ అంచనాలన్నీ పటాపంచలయ్యాయి. 

గతేడాది రికార్డును సైతం అధిగమిస్తూ, ఈ ఏడాది దసరా సందర్భంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే సుమారు రూ. 800 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగి ఎక్సైజ్ శాఖపై కాసుల వర్షం కురిసింది. దసరా పండుగ రోజు వైన్ షాపులు ఉండవని ముందే స్పష్టత రావడంతో మందుబాబులు ముందుగానే అలర్ట్ అయ్యారు. 

ఈసారి గాంధీ జయంతి బెల్ట్​ షాప్​ నిర్వాహకులకు కలిసివచ్చింది. వైన్స్​లు, బార్లు క్లోజ్​ఉండటంతో.. పెద్ద ఎత్తున లిక్కర్​ను గ్రామాల్లోకి డంప్​ చేసుకుని సరిగ్గా పండుగ రోజు అధిక ధరలకు అమ్ముకుని లాభపడ్డారు. శుక్రవారం కూడా సేల్స్​అధికంగానే జరిగినట్లు అధికారులు వెల్లడించారు. 

ముందుగానే కొన్నరు 

గాంధీ జయంతి కారణంగా వైన్ షాపులు మూసి ఉంటాయని స్పష్టత రావడంతో, జనం ముందుగానే అప్రమత్తమయ్యారు. ఈ సమాచారం వాట్సప్‌‌‌‌లలో అందరికీ చేరడంతో ముందుగానే వైన్ షాపుల ముందు క్యూ కట్టారు. పండుగకు నాలుగు రోజుల ముందు నుంచే అమ్మకాలు జెట్​స్పీడ్​ అందుకున్నాయి. సెప్టెంబరు 29న రూ. 278 కోట్లు, సెప్టెంబరు 30న రూ. 333 కోట్లు మేర లిక్కర్ అమ్మకాలు జరిగాయి, సెప్టెంబర్ 28న దాదాపు రూ. 200 కోట్లు, అక్టోబర్ 1న రూ. 86.23 కోట్లు అమ్ముడయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈ మూడు రోజుల్లోనే 60 నుంచి 80 శాతం వరకు అమ్మకాలు పెరిగాయని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. 

ఈ భారీ విక్రయాలకు కొన్ని కారణాలున్నాయి. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఆశావహులు ఊర్లలో జోరుగా దావత్‌‌‌‌లు ఇవ్వడం ఒకటైతే, చాలామందికి సెప్టెంబరు 29, 30 తేదీల్లోనే బ్యాంక్ ఖాతాల్లో జీతాలు జమ కావడం ముందస్తు కొనుగోళ్లకు దారితీసింది. అంతేగాక, వైన్ షాపులు మూసి ఉన్నప్పటికీ, గ్రామాల్లోని బెల్ట్ షాపుల్లో మద్యం ఏరులై పారింది. మొత్తంగా, ఈ ఏడాది సెప్టెంబరులో రూ. 3,046 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయి. 

ఈ ఏడాది ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 29.92 లక్షల కేసుల లిక్కర్‌‌‌‌, 36.46 లక్షల కేసుల బీర్లను విక్రయించారు. గతేడాదితో పోలిస్తే మొత్తం మద్యం అమ్మకాలు 7 శాతానికి పైగా పెరిగాయి. మద్యం సేల్స్ పెరగడంతో ఎక్సైజ్ శాఖకు రాబడి కూడా పెరిగింది. దసరా పండుగ సందర్భంగా అటు మందుబాబులకు ఇబ్బంది కలగలేదు, ఇటు ఎక్సైజ్ శాఖకు ఊహించినదానికంటే ఎక్కువ ఆదాయం సమకూరింది. మొత్తానికి ఈసారి దసరా పండుగ అందరికీ సంతృప్తినే మిగిల్చింది.