సోలో లైఫే సో బెటర్ అంటున్న యూత్

సోలో లైఫే సో బెటర్ అంటున్న యూత్

కాలంతో పాటు మనుషుల ఆలోచన విధానంలోనూ మార్పు వస్తోంది. ముఖ్యంగా పెళ్లి విషయంలో యూత్ ఆలోచన మారిపోయింది. కొన్నాళ్ల క్రితం చదువైపోగానే అమ్మాయిల పెళ్లి గురించి ప్రస్తావన వచ్చేది. వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా కుటుంబ పరిస్థితులు, ఇతర కారణాల వల్ల వివాహ బంధంలో అడుగుపెట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అమ్మాయిల్లో చాలా మంది లైఫ్ లో అడెస్ట్ మెంట్ కోరుకోవడంలేదు. తాము కోరుకున్నట్లు లైఫ్ లీడ్ చేయాలని అనుకుంటున్నారు. అలా సింగిల్ లైఫ్ ఇష్టపడుతున్న  మహిళలు మన దేశంలో 81శాతం మంది ఉన్నారని ఓ సర్వేలో తేలింది.

పేరెంట్స్ నుంచి ఒత్తిడి

ప్రముఖ డేటింగ్ యాప్ బంబుల్ ఈ మధ్యే ఓ సర్వే నిర్వహించింది. పెళ్లి టాపిక్ వచ్చినపుడల్లా తల్లిదండ్రుల నుంచి అమ్మాయిలు తీవ్ర ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తోందని ఇందులో తేలింది. ప్రతీ ఐదుగురిలో ఇద్దరు (39శాతం) మహిళలు పెళ్లి విషయం చర్చకు వస్తే ఒత్తిడికి గురవుతున్నారని చెప్పింది. పెళ్లి అనే బంధంలోకి వెళ్లాలని తమ పేరెంట్స్ బలవంతం చేస్తున్నట్టు 33శాతం మంది అమ్మాయిలు చెప్పారు. డేటింగ్​ విషయంలోనూ మహిళలు రాజీపడే ప్రసక్తే లేదని 63శాతం మంది అంటున్నారు. సరైన వ్యక్తి కోసం ఎదురుచూస్తాం తప్ప ఎవరుపడితే వారితో డేటింగ్​ చేయమని 83శాతం మంది అమ్మాయిలు చెప్పడం విశేషం.

సమాజానికి దూరంగా..

పెళ్లెప్పుడు?  ఇంకా పెళ్లి చేసుకోవా? స్నేహితులు, బంధువుల పెళ్లికి వెళ్తే ముందుగా ఎదురయ్యే ఈ ప్రశ్న లు  మరింత ఒత్తిడిని, చిరాకును కలిగిస్తాయని యువతులు చెబుతున్నారు. ఇలా 'సింగిల్​-షేమింగ్​' చేయడం వల్లే వారు సమాజానికి దూరంగా ఉండాలని భావిస్తున్నారట. ఫంక్షన్లు, పెళ్లిలకు వెళ్లి  ఇలాంటి ప్రశ్నలతో తలనొప్పి తెచ్చుకోవడం కన్నా వాటికి వెళ్లకుండా ఉండటమే బెటర్ అని ఫీల్ ​అవుతున్నారట. దేశంలో చాలా మంది యువతులు తమ సమస్యను తల్లిదండ్రులకు చెప్పలేక, లాంగ్ రిలేషన్ షిప్ లోకి వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారని సర్వేలో వెల్లడైంది. దీనితో పాటు  సమాజంలో జరుగుతున్న కొన్ని ఘటనలు సింగిల్ లైఫ్ ఇష్టపడేందుకు కారణమవుతున్నాయని సర్వే రిపోర్టులో తేలింది.