- రూ.250 కోట్లు నష్టం.. త్వరలో రిపేర్లు చేస్తం
- రాష్ట్ర ఈఎన్సీ(ఓఅండ్ఎం) ఇంజినీర్ ఇన్ చీఫ్ నాగేందర్రావు
కూసుమంచి, వెలుగు: ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ర్ట వ్యాప్తంగా 817 చెరువులు దెబ్బతిన్నాయని, రూ.250 కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర ఈఎన్సీ(ఓఅండ్ఎం), ఇంజినీర్ ఇన్ చీఫ్ నాగేందర్రావు చెప్పారు. శుక్రవారం ఖమ్మం జిల్లాలో దెబ్బతిన్న చెరువులు, పాలేరు రిజర్వాయర్ అలుగు ఆటోమేటిక్ ఫాలింగ్ గేట్లను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.. రాష్ర్టంలో ములుగు, వరంగల్, జగిత్యాల జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో ఇరిగేషన్‌శాఖకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. చెరువులు, గేట్లు, షట్టర్లు దెబ్బతిన్నాయని, మిషన్ భగరథ నీళ్ల వల్ల గేట్లకు రిపేర్లు చేయలేకపోతున్నారని చెప్పారు.
అనంతరం నాయకన్‌గూడెంలోని గెస్ట్‌హౌజ్‌ను పరిశీలించారు. దీని రిపేర్లకు త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. పాలేరు ప్రధాన కాల్వను పరిశీలించారు. కార్యక్రమంలో ఐబీ సీఈ శంకర్‌నాయక్, ఖమ్మం, కల్లూరి ఎస్ఈలు నర్సింగరావు, ఆనంద్‌కుమార్, ఈఎన్సీ ఈఈ వెంకటరమణ, ఈఈ మంగళపూడి వెంకటేశ్వర్లు, డీఈలు, ఏఈ పాల్గొన్నారు.