10 రోజుల్లో 82 మరణాలు..తెలంగాణలో పెరుగుతున్నకరోనా

10 రోజుల్లో 82 మరణాలు..తెలంగాణలో పెరుగుతున్నకరోనా
  • ప్రతి వంద పాజిటివ్​ కేసుల్లో నలుగురి మృతి
  • రాష్ట్రంలో 3.87 శాతానికి చేరిన డెత్‌ రేట్‌
  • శుక్రవారం 9 మంది మృతి.. 174కు చేరిన మరణాలు
  • కొత్త పాజిటివ్​ కేసులు 164.. గ్రేటర్‌‌లోనే 133

పది రోజుల్లో 1,593 కేసులు

లాక్‌డౌన్ సడలింపుల తర్వాత రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. గత నెల చివరి వారంలో 844 కేసులు నమోదైతే, ఈ నెల తొలి వారం రోజుల్లో 952 కేసులు నమోదయ్యాయి. ఈ వారంలో 5 రోజుల్లోనే 834 కేసులు వచ్చాయి. మొత్తంగా గడిచిన పది రోజుల్లో 1,593 కేసులు రికార్డయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో చేస్తున్న టెస్టుల్లో సగటున 19 శాతం మందికి పాజిటివ్ వస్తోంది. ప్రైమరీ కాంటాక్టుల్లో కొంతమందికే సర్కార్ టెస్టులు చేయిస్తోంది. అందరికీ టెస్టు చేస్తే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. వైరస్​ పాజిటివ్​ వచ్చిన ప్రతి వంద మందిలో నలుగురు మృత్యువాత పడుతున్నారు. శుక్రవారం కరోనాతో 9 మంది చనిపోయినట్టు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 174కు చేరింది. గడిచిన పది రోజుల్లోనే 82 మరణాలు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాల్లో మరణిస్తున్న వారి వివరాలు, మరణాలకు గల కారణాలను హెల్త్​ బులెటిన్లలో స్పష్టంగా వెల్లడిస్తున్నా.. మన రాష్ట్రంలో చనిపోయిన వారి వయసు కూడా వెల్లడించడం లేదు.

3.87% డెత్​రేటు

కరోనా డెత్ రేట్‌లో రాష్ట్రం దేశ సగటును దాటేసింది. డెత్ రేట్ ఎక్కువగా ఉన్న టాప్‌ 8 స్టేట్స్‌లోకి తెలంగాణ చేరింది. నెల క్రితం వరకూ రాష్ట్రంలో 2.5 శాతం డెత్‌ రేట్‌ ఉంటే, ఇప్పుడు 3.87 శాతానికి చేరింది. ప్రభుత్వం దాచిపెట్టిన మరణాలను కూడా వెల్లడిస్తే, ఈ సంఖ్య 4 శాతం దాటేదని డాక్టర్లు చెబుతున్నారు. మరోవైపు, కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. శుక్రవారం కొత్తగా 164 మందికి వైరస్ పాజిటివ్ వచ్చింది. ఇందులో 133 కేసులు గ్రేటర్ హైదరాబాద్‌లోనే నమోదయ్యాయి. మేడ్చల్‌లో 6, రంగారెడ్డి 6, సంగారెడ్డి 4, నిజామాబాద్ 3, మహబూబ్‌నగర్‌‌ 2, కరీంనగర్‌‌ 2, ములుగులో 2 కేసులు నమోదయ్యాయి. సిద్దిపేట, యాదాద్రి, మంచిర్యాల్‌, కామారెడ్డి, మెదక్‌, వనపర్తి జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,484కు చేరింది. ఇందులో 2,278 మంది డిశ్చార్జ్‌ అవగా, 2,032 మంది ట్రీట్​మెంట్ పొందుతున్నారు. కాగా, ఉస్మానియా ఆస్పత్రిలో ఆరుగురు డాక్టర్లకు కరోనా వైరస్​ సోకింది. దీంతో ఈ హాస్పిటల్​లో వైరస్​ బారిన పడిన డాక్టర్ల సంఖ్య 64కు చేరింది.

గవర్నర్ నిమ్స్ కు వెళ్తే..సీఎం గడపదాటలె