సింపుల్​గా కుమ్రం భీం వర్ధంతి .. దర్బార్ పై ఎన్నికల కోడ్  ఎఫెక్ట్

సింపుల్​గా కుమ్రం భీం వర్ధంతి .. దర్బార్ పై ఎన్నికల కోడ్  ఎఫెక్ట్
  • జోడేఘాట్ ను మరింత అభివృద్ధి చేయాలె: కుమ్రం సోనేరావు

ఆసిఫాబాద్, వెలుగు : ఆసిఫాబాద్  జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్ లో శనివారం కుమ్రం భీం 83వ వర్ధంతి గిరిజన సంప్రదాయాలతో నిర్వహించారు. ఎన్నికల కోడ్  కారణంగా కార్యక్రమం సాదాసీదాగా జరిగింది. ఏటా జిల్లా, ఇతర రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చే ఆదివాసీలు ఈసారి ఆ స్థాయిలో రాలేదు. సమస్యల పరిష్కారం నిమిత్తం ఏటా జోడేఘాట్ లో నిర్వహించే దర్బార్.. ఎన్నికల కోడ్  అమల్లో ఉన్నందున ఈసారి జరగలేదు.

ఈ కార్యక్రమానికి కలెక్టర్  హేమంత్  సహదేవరావు, ఐటీడీఏ పీఓ చాహత్  బాజ్ పాయ్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కుమ్రంభీం వారసులు, ఆదివాసీ నాయకులు, అధికారులు హాజరయ్యారు. కుమ్రంభీం మనుమడు కుమ్రం సోనేరావు మాట్లాడుతూ జల్, జంగల్, జమీన్  కోసం పోరాటం చేసి అసువులు బాసిన కుమ్రం భీం పోరుగడ్డ జోడేఘాట్ ను ప్రభుత్వం మరింత అభివృద్ధి చేయాలన్నారు. హట్టి నుంచి జోడేఘాట్ మధ్యలో అసంపూర్తిగా ఉన్న రోడ్డుకు ఫారెస్ట్  క్లియరెన్స్ ఇప్పించి పూర్తిచేయాలని, జోడేఘాట్ నుంచి డెమ్మిడిగుడా వరకు రోడ్డు వేయాలని కోరారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ కుమ్రం భీం స్ఫూర్తితో కలిసికట్టుగా హక్కులను సాధించుకుందామని పిలుపునిచ్చారు.

ఆదివాసులకు చేయాల్సిన అభివృద్ధి ఇంకా ఎంతో ఉందని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. జడ్పీ చైర్ పర్సన్  కోవ లక్ష్మి మాట్లాడుతూ గత పాలకులు కుమ్రం భీంను, జోడేఘాట్ ను విస్మరించారని విమర్శించారు. ఎన్నికల కోడ్  కారణంగా ఈసారి దర్బార్ నిర్వహించలేకపోతున్నామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కుమ్రంభీం ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశామని, రూ.25 కోట్లతో గిరిజన మ్యూజియం నిర్మించామని పేర్కొన్నారు. ఆదివాసీలు సాగుచేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇచ్చామని చెప్పారు.