కొడితే ఓకేనా!: భర్తలు, భార్యల్ని కొట్టొచ్చట

కొడితే ఓకేనా!: భర్తలు, భార్యల్ని కొట్టొచ్చట
  • మన తెలంగాణలో ఈ మధ్య టైంకి భోజనం పెట్టలేదని భార్యని కొట్టి చంపాడు ఒక భర్త.
  • కూరలో ఉప్పు ఎక్కువైందని భార్యకు గుండు గీయించాడు అహ్మదాబాద్​​లో ఓ కూలీ.
  • పప్పు మాడిందని భార్య తల పగలగొట్టాడు ఓ సాఫ్ట్​వేర్ ఇంజినీర్​. 
  • చికెన్​ టేస్టీగా రాలేదని భార్యని కడతేర్చాడు బెంగళూరులో ఓ భర్త. 
  • అన్నం కాస్త మెత్తగా అయిందని.. భోజనం వడ్డించలేదని.. 
  • డిన్నర్​లో సలాడ్​ ఇవ్వనందుకు కూడా భార్యల్ని కొట్టినవాళ్లు, చంపేసినవాళ్లు ఉన్నారు.

అమ్మో! అంత చిన్న కారణాలకే కొట్టడం, చంపడం ఏంటి? అనుకుంటున్నారా!  కానీ, కొందరు ఆడవాళ్లు మాత్రం భర్తలు కొట్టడం కరెక్టే  అంటున్నారు. ఏ ఒక్కరో ఇద్దరో కాదు దేశవ్యాప్తంగా 40శాతం మంది ఆడవాళ్లు భర్త తమపై చెయ్యి చేసుకోవడంలో తప్పేం లేదంటున్నారు. నేషనల్​ ఫ్యామిలీ హెల్త్​ సర్వే –5 ప్రకారం 38 శాతం మగవాళ్ల మాట కూడా ఇదే. ఎక్కువగా తెలంగాణలోనే 84 శాతం మంది ఆడవాళ్లు భర్త కొట్టడాన్ని సమర్థిస్తున్నారట. కారణం ఏదైనా సరే భర్త, భార్యని కొట్టడం సబబు ఎలా అవుతుంది? దీన్ని మగవాళ్ల కంటే  ఆడవాళ్లే  ఎందుకు ఎక్కువ సమర్థిస్తున్నారు?  

నేషనల్​ ఫ్యామిలీ హెల్త్​ సర్వే (ఎన్​ ఎఫ్​ హెచ్​ఎస్)​ 2019– 21 మధ్య ఐదో ఎడిషన్​ సర్వే చేసింది. అందులో భాగంగా.. భార్యను భర్త కొట్టడం కరెక్టేనా? అని ఆడవాళ్లను, మగవాళ్లను అడిగారు.17 రాష్ట్రాలు, ఐదు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్​.ఎఫ్.హెచ్.​ఎస్. ​చేసిన ఈ సర్వేలో మెజార్టీ ఆడవాళ్లు భర్త, భార్యను కొట్టడం సబబేనని చెప్పారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో భార్యను కొట్టడాన్ని మగవాళ్ల కంటే ఆడవాళ్లే ఎక్కువగా సమర్థించారు. అందులోనూ అత్యధికంగా తెలంగాణలో 83.8శాతం మంది ఆడవాళ్లు భర్తలు, భార్యల్ని కొట్టొచ్చు అన్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్​లో 83.6 శాతం, కర్ణాటకలో 76.9శాతం, మణిపూర్​లో 65.9శాతం, కేరళలో 52.4శాతం మంది ఆడవాళ్లు.. కొన్ని పరిస్థితుల్లో భర్తలు కొట్టడంలో తప్పులేదని చెప్పారు. అసలు భార్య మీద భర్త చెయ్యి చేసుకోవడానికి కారణాలేంటి అని అడిగితే... ‘వంట బాగాలేదని, భర్తకు చెప్పకుండా బయటకు వెళ్లడం, పిల్లలు, కుటుంబాన్ని చూసుకోకపోవడం, ఫిజికల్​ రిలేషన్​కి ఒప్పుకోకపోవడం, అత్తమామలకు గౌరవం ఇవ్వకపోవడం’ వంటి వాటివల్ల ఎక్కువ దాడులు జరుగుతున్నట్లు చెప్పారు. 
 

గృహహింసే ఎక్కువ
మహిళలపై హింసకు సంబంధించి నమోదవుతున్న కేసుల్లో గృహహింస కేసులే ఎక్కువ. నివేదికల  ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి పదిమంది ఆడవాళ్లలో ముగ్గురు గృహహింస బాధితులే. ప్రతి ఐదు నిమిషాలకి ఒక ఇంట్లో గృహహింస జరుగుతోంది. అయితే ఆ హింసకు పెద్ద కారణాలు కూడా ఉండట్లేదు. నచ్చిన వంట వండలేదని, టైంకి టీ, కాఫీలు ఇవ్వలేదని , అంతెందుకు చండీగఢ్‌లో తనకి నచ్చని భాషలో మాట్లాడుతోందని భార్యపై కిరోసిన్​ పోశాడు ఒక మర్చంట్ నేవీ ఆఫీసర్. కిచిడిలో కాస్త ఉప్పు ఎక్కువైనందుకు భార్యని చంపినవాళ్లూ ఉన్నారు. ఇలాంటి కేసుల్లో హింస  తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి అవి బయటికొచ్చాయి. మిగతా చాలా కేసులు నాలుగ్గోడల మధ్యే ఉండిపోతున్నాయి. కారణం ఆడవాళ్లు తమపై జరుగుతున్న ఆ దాడుల్ని వ్యతిరేకించకపోగా.. సమర్థించడమే. వాళ్లని వాళ్లే దోషులుగా చూసుకుంటూ.. భర్తని వెనకేసుకురావడమే. గ్రామాలతో పాటు అర్బన్​లో.. అది కూడా పెద్ద చదువులు చదువుకున్న వాళ్లు, మంచి జీతాలు వస్తున్న వాళ్లు  కూడా భర్త  చెయ్యి చేసుకోవడం తప్పు కాదంటున్నారు. ఇది చదివాక అసలు లోపం ఎక్కడుంది? భార్యని కొట్టడం భర్త హక్కుగా ఎందుకు చూస్తున్నారు? భర్త చెయ్యి చేసుకోవడాన్ని ఆడవాళ్లు ఎందుకు అంత చిన్న విషయం  అనుకుంటున్నారు? అంటూ బోలెడు ప్రశ్నలు తలెత్తుతాయి. ఇదే విషయంపై కొందరు సోషల్ యాక్టివిస్ట్​లు, ఎక్స్​పర్ట్స్, ఆడ, మగవాళ్ల​తో మాట్లాడితే ఒక్కొక్కరూ ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ, అందరి సమాధానాలు మాత్రం దాదాపుగా ఒకేలా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా డబ్బు ఉన్నవాళ్లు, లేనివాళ్లు అని కాకుండా.. అన్ని వయసుల వాళ్లు, చదువుతో సంబంధంలేకుండా గృహహింస  ఎదుర్కొంటున్నారు. అయితే కాస్త డబ్బున్న కుటుంబాల్లో పుట్టిన ఆడవాళ్లలో పందొమ్మిది శాతం బాధితులు ఉంటే... 44 శాతం నిరుపేద కుటుంబాలకి చెందినవాళ్లే ఉన్నారు. కానీ, మనదేశంలో 66 శాతం మంది మహిళలు తమపై జరుగుతున్న దాడుల్ని ఎవరికీ చెప్పుకోవట్లేదు. పైగా ప్రపంచ దేశాల్లో మరెక్కడా లేని విధంగా భర్త కొట్టడాన్ని సమర్థిస్తున్నారు. అయితే ఇలా భర్తను వెనకేసుకు వచ్చేది ఎక్కువగా పల్లెల్లో ఉండేవాళ్లు అనుకుంటే పొరపాటు.పెద్దపెద్ద సిటీల్లో ఉంటున్న వాళ్లూ ఉన్నారు. దీనికి కారణాలు చాలానే ఉన్నా.. వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి మాత్రం కొన్నే. 
 

ఆడ, మగ తేడా.. 
ఆడవాళ్లపై హింస అనేది ఇప్పటిది కాదు. తరతరాలుగా.. ఏదో ఒక రూపంలో ఉంటూనే ఉంది. దీనికి మూల కారణం పెంపకంలో ఆడ, మగ పిల్లల మధ్య చూపించే తేడాలే. చిన్నప్పట్నించీ అబ్బాయిలకి, అమ్మాయిలకి వేరువేరు రూల్స్​ ఉంటాయి సొసైటీలో.  ‘‘భర్త మాట వినాలి..అతనికి నచ్చినట్టు నడుచుకోవాలి.. కోపం తెప్పించకూడదు’’ అనే మాటలు పదేపదే ఆడపిల్లల చెవిన పడుతుంటాయి. ‘‘పైగా అతను ఉద్యోగం చేస్తాడు. ఆమె మూడు పూటలా వంట చేయాలి. ఇంటిని చక్కబెట్టుకోవాలి. భర్త, పిల్లల బాగోగులు చూసుకోవాలి. ఆర్థిక విషయాల్లో వేలు పెట్టకూడదు. భర్త ఏం చేసినా ఎదురు చెప్పకూడదు. భర్త మూడ్​ని బట్టి నడుచుకోవాలి. నాలుగ్గోడల మధ్య ఉండాల్సినవి నాలుగ్గోడల మధ్యే ఉంచాల’’ని చెప్తూ ఆడపిల్లలను మెట్టినింటికి పంపిస్తారు తల్లిదండ్రులు. ఆ మాటలు వాళ్ల మైండ్​లో బలంగా నాటుకుపోతున్నాయి. వాటన్నింటి వల్ల అమ్మాయిల మనసుల్లో ఏమూలనో మగవాళ్లు.. తమకన్నా ఎక్కువ అన్న భావన వచ్చేస్తోంది. అందుకే పెండ్లి తర్వాత భర్తకి, అతని కుటుంబానికి సేవ చేయడమే తొలి ప్రయారిటీ అనుకుంటున్నారు అమ్మాయిలు. 

భర్త, అత్తమామలు కూడా దాన్నే బలంగా నమ్ముతారు. అందుకే ఇంటి, వంట పనులు, కుటుంబ బాధ్యతలు.. ఇలా అన్నింటినీ పూర్తిగా ఆమె పనులే అన్నట్టు చూస్తారు. అందుకు విరుద్ధంగా ఏ భార్య ప్రవర్తించినా.. లేదా ఈ డ్యూటీల్లో ఏ చిన్న పొరపాటు జరిగినా... దాన్ని మామూలుగా తీసుకోలేకపోతున్నాడు సదరు భర్త. ఆమెకి తన స్థానం ఏంటో గుర్తు చేయడానికి తిట్టడం, కొట్టడం వంటివి చేస్తున్నాడు.  ‘‘పెండ్లి చేశాక ఆడపిల్ల పరాయిది అయిపోతుంది. భర్త కొట్టుకుంటాడో.. తిట్టుకుంటాడో.. అతని ఇష్టం. మధ్యలో తలదూర్చడానికి మనమెవరం?’’ అంటూ అయినవాళ్లు, చుట్టు పక్కల వాళ్లు. భార్య ఏదో తప్పు చేసి ఉంటుంది.  భర్త ఆమెను  కరెక్ట్​ చేస్తున్నాడన్న ఆలోచనల్లోనే ఉంటారు కొందరు. భార్య కూడా తనేదో తప్పు చేసింది కాబట్టే భర్త కొట్టాడు అనుకుంటుంది. పెండ్లి తర్వాత భర్త ఏం చేసినా చెల్లుతుందని భావించేవాళ్లు చాలామందే ఉన్నారు. ఈ ఆలోచనకి దారితీస్తున్న కారణాలు మాత్రం అనేకం.
 

వయొలెన్స్​ ‘ఓకే’
చిన్న చిన్న విషయాలకే  తల్లిని తిడుతుంటాడు తండ్రి. ఇంటి నిర్ణయాల్లో ఆమె మాట్లాడితే ‘నీకేం తెలియదంటూ’ తీసి పారేస్తాడు. పిల్లల పెంపకంలో ఏ చిన్న పొరపాటు చేసినా ఆమెని కొడుతుంటాడు. ఇంటి, వంట పనులకి సంబంధించి పదేపదే ఆమెపై చిరాకు పడుతుంటాడు.  ఆమె ఎంత కష్టపడుతున్నా సరైన గౌరవం ఇవ్వడు. బంధువులు, ఇరుగుపొరుగు ఇండ్లలోనూ ఇదే జరుగుతుంటుంది. చిన్నప్పట్నించీ వీటన్నింటినీ ప్రత్యక్షంగా చూస్తుందామె. కానీ, తల్లితో పాటు మిగతా ఆడవాళ్లంతా  మౌనంగానే ఆ హింసని భరిస్తుండటం వల్ల అది తప్పు కాదేమో అన్న స్థితికి వచ్చేస్తోంది. ‘భర్తంటే ఇలానే ఉంటాడు.. భార్య అంటే తన తల్లిలాగే  నడుచుకోవాలి’ అనుకుంటోంది. ఒక విధంగా చెప్పాలంటే భార్యపై జరిగే హింస​ ‘ఓకే’ అనుకుంటోంది. తండ్రితో తల్లి ప్రవర్తిస్తున్న తీరు చూస్తూ పెరిగిన మగపిల్లలు..భర్తంటే ఇలానే ఉండాలంటూ ఒక రూల్​ బుక్​ పెట్టుకుంటున్నారు. వాటిల్లో ఏ ఒక్కటి బ్రేక్ అయినా తండ్రిలానే భార్యపై చెయ్యి చేసుకుంటున్నారు. భార్యని తిట్టడం, కొట్టడం తమ హక్కుగా భావిస్తున్నారు. 
 

కట్టుబాట్లకి కట్టుబడి
అమెరికా, యూకె, జర్మనీ, స్విట్జ​ర్లాండ్.. లాంటి అభివృద్ధి చెందిన దేశాలతో పాటు...ఇప్పుడిప్పుడే డెవలప్​మెంట్​ దిశగా అడుగులేస్తున్న అన్ని దేశాల్లోనూ ఆడవాళ్లు గృహహింస ఎదుర్కొంటున్నారు. కానీ, ఏ దేశంలోనూ మన దగ్గరిలా ఆడవాళ్లు భర్త కొట్టడాన్ని సపోర్ట్​ చేయట్లేదు. కారణం అక్కడ పెండ్లి తర్వాత మహిళలు ఎలా ప్రవర్తించాలన్న దానిపై ప్రత్యేకంగా ఎలాంటి కట్టుబాట్లు లేవు. భర్త ఏం చేసినా చెల్లుతుందని భావించే ఆడవాళ్ల సంఖ్య కూడా చాలా తక్కువ. కానీ, మన దగ్గర పరిస్థితులు అందుకు పూర్తిగా భిన్నం. పెండ్లి బంధానికి అన్నింటికన్నా ఎక్కువ విలువ ఇస్తారు. ఆ బంధం దూరమైతే జీవితమే లేనట్లు భావిస్తారు. భర్తతో విడిపోవడాన్ని పెద్ద నేరంగా చూస్తారు. భర్త కొట్టినా, తిట్టినా పడి ఉండాలన్న మాటలకి కొదవలేదు. అందుకే పెండ్లిని శాశ్వతంగా నిలబెట్టుకొనే ప్రయత్నంలో అన్నింటినీ భరిస్తున్నారు ఆడవాళ్లు. ఆ స్టీరియోటైప్​ ఆలోచనల వల్లే భర్త కొట్టడం, తిట్టడం కరెక్టే  అనుకుంటున్నారు. దాంతో  భార్యపై భర్త చెయ్యి చేసుకోవడం ‘ఓకే’ అయిపోయింది. వీటన్నింటికి తోడు గృహహింసని ఆడవాళ్లు సమర్థించడానికి పేదరికం కూడా ఓ కారణం అయింది. 
 

పేదరికం
ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న రెండో దేశం మనది. కానీ, మన జనాభాలో కొన్ని కోట్ల మందికి కడుపునిండా తినడానికి తిండి లేదు. ఇలాంటి పరిస్థితులు ఉన్న కుటుంబంలో ఆడపిల్ల పుడితే గుండెల మీద కుంపటి అనుకుంటారు తల్లిదండ్రులు. ఆ బరువుని పెండ్లి చేస్తే దింపేసుకోవచ్చు అనుకుంటారు ఎక్కువమంది. దాంతో తల్లిదండ్రుల కష్టం చూసిన అమ్మాయిలు పెండ్లి తర్వాత భర్త ఎంతలా హింసించినా ...వాళ్లకి ఎక్కడ భారం అవ్వాల్సి వస్తుందేమోనని అన్నీ భరిస్తున్నారు. ఆ విషయం తల్లిదండ్రులతో చెప్తే వాళ్లు ఏమైపోతారోననే బాధ ఓ వైపు.. వేధింపులు తాళలేక పుట్టింటికి చేరితే సమాజం నుంచి ఎదురయ్యే సూటిపోటి మాటలు కుంగదీస్తాయనే భయం మరోవైపు మౌనంగా ఉండిపోయేలా చేస్తోంది. కొందరు ధైర్యం చేసి తల్లిదండ్రులకి చెప్పినా ‘పెండ్లి తర్వాత చిన్నాచితకా సమస్యలు మామూలే.. సర్దుకుపోవాలి’ అని  నచ్చజెప్తున్నారు. ‘భర్త తోడు లేకపోతే ఎలా?’ అంటున్నారు. ఆడవాళ్లు  కేసుపెట్టినా తోడుండే తల్లిదండ్రులు చాలా తక్కువ. పోలీసులు యాక్షన్​ తీసుకునే లోపే సర్దిచెప్పి ఆడపిల్లని అత్తారింటికి పంపుతున్నారు. పోలీసులు కూడా కాంప్రమైజ్​ పాలసీని అప్లై చేస్తున్నారు. వీటన్నింటినీ దాటి ఆ బంధం నుంచి బయటికొద్దాం అనుకుంటే చట్టపరంగా న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు. వాళ్లని ఆదుకునే వ్యవస్థ సరిగా లేదు. షెల్టర్ హోమ్స్ తక్కువగా ఉన్నాయి. దాంతో ఆడపిల్లలు ఆ హింస గురించి మాట్లాడటం లేదు. తమపై జరుగుతున్న దాడికి సొసైటీ ఇస్తున్న రియాక్షన్​ చూసి చివరికి దాన్ని సమర్థించే స్థితికి వచ్చేస్తున్నారు.
 

ఎమోషనల్​ స్ట్రక్​ 
భర్త, కుటుంబం విషయానికొచ్చేసరికి ఆడవాళ్లు ఎమోషనల్​గా ఒకచోట స్ట్రక్​ అయిపోతుంటారు. ఇది హౌస్​వైవ్స్​​లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. చాలామంది ఫైనాన్షియల్​గా భర్త మీదే పూర్తిగా ఆధారపడతారు. దానివల్ల వాళ్లు లేకపోతే ఎలా? అన్న ఆలోచనని కూడా రానివ్వరు. భర్త తోడు లేకుండా పిల్లల పోషణ అనేది ఊహించుకోలేరు. ఒక విధంగా చెప్పాలంటే ఫైనాన్షియల్​గా ఇన్​సెక్యూరిటీ. పైగా భర్తతో విడిపోతే జీవితం ముగిసిపోతుందన్న ఆలోచనలతో భర్త గీసిన గిరిలోనే ఉంటారు. ఆ విషయంలోనే భార్యల్ని గ్రాంటెడ్​గా తీసుకుని తిడుతుంటారు, కొడుతుంటారు భర్తలు. ‘నా భర్తేగా కొట్టింది’ అనుకుంటూ ఆ హింసని కూడా భరిస్తున్నారు ఆడవాళ్లు. అసలు కొట్టడం తప్పే కాదన్నట్టు చూస్తున్నారు. ఈ మధ్య జరిగిన సర్వేలో భర్త చెయ్యి చేసుకోవడాన్ని సమర్థించిన ఆడవాళ్లలో సగానికి పైగా వీళ్లే ఉన్నారు. 
 

భయం పుట్టించే సమాజం
భర్త నుంచి విడిపోయిన మహిళలకి  సమాజంలో సరైన గౌరవం ఉండదనేది చాలామంది వాదన. దాన్ని పూర్తిగా అబద్ధమని తీసి పారేయడానికి లేదు. ఆడపిల్ల పెండ్లి తర్వాత పుట్టింటికి వస్తే.. మొదటిగా వచ్చే ప్రశ్న ‘ఏమైందని?’. అదొక్కటే కాకుండా  భర్తకి దూరంగా ఉన్న మహిళల గురించి ఎలాగంటే అలా మాట్లాడతారు. చివరికి బంధువులు, స్నేహితులు కూడా ‘ఏమో.. ఆ అమ్మాయి ఏం చేసిందో?’ అని మాట్లాడతారు. ఇంట్లో పెండ్లి కావాల్సిన ఇంకో ఆడపిల్ల ఉంటే మరో సమస్య. వీటన్నింటికీ భయపడి ఆడవాళ్లు తమపై జరుగుతున్న హింసను బయటకు చెప్పట్లేదు. ఇది మామూలే అన్నట్టు సర్దుకుపోతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే భర్త బాగోగులు చూసుకోవడం, ఇంటి బాధ్యతల్ని చక్కబెట్టుకోవడం లాంటివే వాళ్ల అధికారంగా భావిస్తున్నారు. ఆ విషయాల్లో ఏదైనా తప్పు జరిగితే  చెయ్యి చేసుకోవడం భర్త హక్కు అనుకుంటున్నారు. 
 

అవగాహన లేదు
ఆడవాళ్లు ఎక్కువగా గృహహింస ఎదుర్కోవడానికి కారణం భర్తతో శారీరక సంబంధానికి ఒప్పుకోకపోవడమే. ఇదే విషయం చాలా స్టడీల్లో కూడా వెల్లడైంది.  ఈ విషయానికొచ్చేసరికి ‘నా భార్య.. నా ఇష్టం’ అనే మాట భర్త నోటి నుంచి ఎక్కువగా వినిపిస్తుంటుంది. సొసైటీ కూడా మారిటల్​ రేప్​ని అసలు నేరంగానే చూడట్లేదు. పైగా ఏ భార్య అయినా మారిటల్​ రేప్​ గురించి మాట్లాడితే.. ఆశ్చర్యంగా చూస్తారు. ఆమె క్యారెక్టర్​పైనే నిందలేస్తారు. భార్యగా ఎలా నడుచుకోవాలో తెలియదు అంటారు. ఈ విషయంలో భర్త పెట్టే హింస అయితే మాటల్లో చెప్పలేనిది. చుట్టూ ఉన్నవాళ్లు, సొసైటీ అంతా ఆ తప్పుని కరెక్ట్​ అంటుండటంతో.. చేసేదేంలేక ఆడవాళ్లు కూడా మారిటల్​ రేప్​ని ఒప్పుకుంటున్నారు. మారిటల్​ రేప్​ నేరస్మృతిపై ఢిల్లీ న్యాయస్థానం కూడా ఏకాభిప్రాయంతో తీర్పు చెప్పలేని పరిస్థితుల్లో... అది సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
 

ఒంటరితనం భయంతో..
భార్య ఏం చేసినా పడుతుందన్న ఆలోచనల నుంచే ఈ హింస పుడుతుంది అంటున్నారు సైకాలజిస్ట్​లు. మరయితే తమ కాళ్ల మీద తాము నిలబడి, ఉద్యోగాలు చేస్తున్న ఆడవాళ్లు కూడా దీన్ని ఎందుకు సమర్థిస్తున్నారని అడిగితే.. భర్త లేని జీవితాన్ని వాళ్లు ఊహించుకోలేకపోవడమే అంటున్నారు. అంతేకాకుండా జీవితాంతం ఒంటరిగా ఉండాల్సి వస్తుందన్న భయంతో అన్నింటికీ సర్దుకుపోతున్నారు. 
 

సీరియల్స్​, సినిమాలు
భార్యపై.. భర్త చెయ్యి చేసుకోవడాన్ని ఒక ఫన్​ ఫ్యాక్టర్​గా ప్రొజెక్ట్​ చేస్తున్నారు చాలావరకు సినిమాలు, సీరియళ్లలో. ఒంటరి మహిళలు​ పడే కష్టాలు.. వాళ్లని మగవాళ్లు చూసే తీరుని  చూపించే విధానం కూడా ఆడవాళ్లు గృహహింసని సమర్థించడానికి కారణం అవుతోంది. పైగా ఇంటి, వంట పనుల్లో ఆరితేరిన క్యారెక్టర్సే మెయిన్​​ లీడ్స్​గా కనిపిస్తుంటాయి సీరియల్స్​లో. భర్తలు చెయ్యి చేసుకోవడం.. వాటిని ఓర్పుగా భరించిన హీరోయిన్​ని దేవతగా పోల్చే సీన్లకి కొదవలేదు. పైగా ఓ పెద్ద హీరో సినిమాలో  ‘కొట్టినా.. తిట్టినా.. తాళిబొట్టు కట్టినా..’ అంటూ ఓ పాట ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వీటన్నింటి ఇన్​ఫ్లుయెన్స్​ కూడా ఆడవాళ్లపై ఎంతోకొంత ఉంటోంది. భార్యంటే అన్నీ భరించాలి.. భర్త అలానే ఉంటాడన్న నేచర్​ వచ్చేస్తోంది వాళ్లలో. అదే వాళ్లని డొమెస్టిక్​ వయొలెన్స్​ తప్పు కాదన్న అభిప్రాయానికి తీసుకొస్తోంది. 
 

అక్కడ మరీ దారుణం
ఎక్కువ సంపాదించే మహిళలు లేదా బాగా చదువుకున్న వాళ్లలో కొందరైనా ఈ హింసని వ్యతిరేకిస్తున్నారు. కానీ, రూరల్​ ఏరియాల్లో, ఏజెన్సీల్లో ఉంటున్న చదువుకోని ఆడవాళ్ల  పరిస్థితి మరింత దారుణంగా ఉంది.  గృహహింసపై సరైన అవగాహన లేకపోవడం వల్ల భర్త, భార్యని కొట్టడం తరాలుగా వస్తున్న ఆచారంగా చూస్తున్నారు వాళ్లు. ‘ఇంటి పనులు చేయడం రాదు. పిల్లల్ని చూసుకోదు. భర్త బుద్ధి చెప్పకపోతే దారిలోకి రాద’నే మాటలు వినిపిస్తుంటాయి. ఇక గృహహింసని ఎదుర్కొంటున్న వాళ్లైతే  భర్త కొడితే నాలుగ్గోడలకే గోడు వినిపించుకుంటున్నారే తప్ప భర్త ప్రవర్తనని తప్పుబట్టట్లేదు. దాంతో భార్యల్ని కొట్టడం ఒక అలవాటుగా మారిపోయింది చాలామంది భర్తలకి.  ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే ఆడవాళ్ల ఆలోచనా విధానం మారాల్సిందే. హింస ఏ రూపంలో.. ఎవరి నుంచి ఎదురైనా అది హింసే. దాన్ని సమర్థించడం అంటే ఆ హింసని మరింత ప్రేరేపించడం. అందుకే ఆడవాళ్లు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. భర్త, పిల్లలు,  ఇంటి అవసరాలు తీర్చడమే భార్య పని అన్న అభిప్రాయం నుంచి బయటికి రావాలి. వాటిల్లో ఏ ఒక్క విషయంలో తప్పు జరిగినా కొట్టే హక్కు భర్తకి ఉందన్న ఆలోచనని తుడిచేయాలి. గౌరవం కోసం నోరు విప్పాలి. అప్పుడే గృహహింస ఆగుతుంది. కారణం ఏదైనా సరే సమర్థించుకుంటూ పోతే  ఆ హింస తీవ్రత అదుపు తప్పి.. చివరికి ప్రాణాలే తీస్తుంది. అందుకు ఉదాహరణలు తరచూ పేపర్లలో, టీవీల్లో వచ్చే వార్తలు చూస్తూనే ఉన్నాం.  

భార్యని కొట్టడాన్ని సమర్థిస్తారా?
లేదు. ఎలాంటి పరిస్థితుల్లోనూ నేను దాన్ని సమర్థించను. నా దృష్టిలో భార్యాభర్తల్లో  ఎవరూ ఎక్కువ కాదు. ఎవరూ తక్కువ కాదు. ఇద్దరూ సమానం. కుటుంబాన్ని నడిపించడంలో ఇద్దరిదీ సమాన పాత్ర. ఒకింత ఆడవాళ్లదే ఎక్కువ అన్నా ఆశ్చర్యం లేదు. అందుకే భార్యాభర్తల మధ్య ఎంత పెద్ద సమస్య వచ్చినా.. దానికి భార్యపై చెయ్యి చేసుకోవడం సొల్యూషన్​ కాదు. ఆ దెబ్బ భార్య గౌరవంపై పడుతుంది. వాళ్లను మానసికంగా దెబ్బతీస్తుంది. అందుకే పరిస్థితులని బట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. చిన్నచిన్న తప్పిదాలు, విభేదాలు చోటు చేసుకున్నప్పటికీ ఒకరికొకరు సర్ది చెప్పుకోవాలి. అంతేకానీ, భార్యను కొట్టడం కరెక్ట్ కాదు. భార్యాభర్తలు ఒకరిపై మరొకరు నమ్మకంతో ఉండి, కష్ట సమయంలో ఫ్రెండ్స్​లా మసలుకోవాలి.
                                                                                                                                                                                                          - దొడ్డ హరీష్, కమలాపూర్
చుట్టూ ఉన్న పరిస్థితుల వల్లే...
ఆడపిల్ల అంటే ఓపికగా ఉండాలి,   సర్దుకుపోవాలి అనే మాటలు చిన్నప్పట్నించీ వింటూ పెరుగుతారు ఆడపిల్లలు. దాంతో  అదే మైండ్​సెట్​ని అడాప్ట్​ చేసుకుంటున్నారు. అందుకే భర్త చెయ్యి చేసుకోవడాన్ని సమర్థిస్తున్నారు. అలాగే మగవాళ్లలో సాధారణంగానే డామినేటింగ్ నేచర్​ ఎక్కువ ఉంటుంది. వాళ్లని వాళ్లే సుపీరియర్​గా ఫీలవుతుంటారు. దాన్ని చూపించడానికి వాళ్లకి భార్య ఒక్కతే కనిపిస్తుంటుంది. అందుకే చిన్నాచితకా విషయాలకి కూడా భార్యని కొడుతుంటారు, తిడుతుంటారు. కొందరు మగవాళ్లలో యాంటీ సోషల్​ పర్సనాలిటి, బార్డర్​​ లైన్​​ డిజార్డర్స్ కూడా ఉంటాయి. ఇలాంటి వాళ్లకి వేరేవాళ్లని బాధపెట్టడం సంతోషాన్ని ఇస్తుంది. అందుకే కూరల్లో ఉప్పు ఎక్కువైందని.. కారం సరిపోలేదని కూడా భార్యల్ని కొడుతుంటారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా తీస్తారు. కానీ ఆర్థిక స్వాతంత్ర్యం లేకపోవడం, కుటుంబం, సొసైటీ నుంచి ఎలాంటి సాయం దక్కకపోవడం వల్ల ఆడవాళ్లు ఆ హింసకి అలవాటు పడిపోతున్నారు. ‘భర్త , అత్తింటి వాళ్లు చెప్పినట్టు నడుచుకో’ అని అందరూ చెప్పడం వల్ల ఆ హింసని సమర్థించే స్టేజ్​కి వచ్చేస్తున్నారు.                                                                                                          - ​డా. కె. జ్యోతిర్మయి (ఎమ్.డి), కన్సల్టెంట్​ సైకియాట్రిస్ట్​​.
 

ఆడవాళ్లని కొట్టే హక్కు మగవాళ్లకి ఉందా? 
ఈ భూమ్మీద ఎవరికీ వేరొకరిని హింసించే హక్కు లేదు. అందులోనూ భార్యని కొట్టే అధికారం భర్తకి అసలే లేదు. కానీ, కొందరు భర్తలు, భార్యల్ని ఒక వస్తువుగా చూస్తుంటారు. ఇంటి, వంట పనులు చక్కబెట్టడం ఒక్కటే ఆమె పనిగా చూస్తుంటారు. వాళ్లని శారీరకంగా, మానసికంగానూ గాయపరుస్తుంటారు. దీన్ని ఇంట్లో వాళ్లతో పాటు సమాజం కూడా చూసీచూడనట్టే వదిలేస్తుంది. అందుకే హింసకి పాల్పడుతున్న భర్తల్లో  తాము చేస్తున్నది తప్పన్న భావన రావట్లేదు. అదే సొసైటీ గృహహింసని గట్టిగా ప్రశ్నిస్తే.. చట్టాలు కఠినంగా ఉంటే ... ఆడవాళ్లు ఆ హింసకి వ్యతిరేకంగా గొంతు విప్పే పరిస్థితుల్ని కల్పిస్తే మార్పు వస్తుంది.                                                                                                         - ఎస్.మహేష్, సిద్దిపేట

సమానత్వం మెదడులో ఉండాలి
‘మొగుడన్నాక కొట్టకపోతాడా’ అన్న కాన్సెప్ట్​ ఎప్పట్నించో ఉంది మన సమాజంలో. ఎన్నో సందర్భాల్లో కార్మికుల కోసం పోరాడిన పెద్దపెద్ద హైకోర్టు​ జడ్జిలు కూడా మొగుడన్నాక కొట్టకుండా ఉంటాడా! అని బహిరంగంగానే కామెంట్​ చేశారు. అలాగే గృహహింస కేసు మీద పోలీస్​ స్టేషన్​కి వెళ్తే మొగుడు కొడతాడు కదా! అనే అంటారు. కానీ, అసలు మొగుడు అనేవాడు ఎందుకు కొడతాడు? అన్న ప్రశ్నని ఎవరూ అడగరు. ఇదే కాన్సెప్ట్​ భర్త కొట్టడాన్ని సమర్థిస్తున్న ఆడవాళ్లలోనూ ఉంది. నిజానికి ఒక మనిషి ఇంకో మనిషి తనని కొట్టడానికి ఎప్పుడూ ఇష్టపడడు. ఇవ్వాళ రేపు తల్లిదండ్రులు కొడితేనే పిల్లలు ఊరుకోవట్లేదు. అలాంటిది అన్నీ తానై చూసుకోవాల్సిన భర్త కొడితే ఎందుకు సమర్థిస్తున్నారంటే.. దానికి చాలా కారణాలున్నాయి. భర్త కొట్టకూడదు అని గట్టిగా అంటే కాపురాలు కూలిపోతాయన్న భయం కూడా చాలామందిలో ఉంది. ఒంటరి ఆడవాళ్లలా ఉంటే సమాజం ఎక్కడ వెంటాడుతుందోనని భర్త కొట్టినా పడి ఉండేవాళ్లు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే స్ర్తీ, పురుష సమానత్వం అనేది రాజ్యాంగం నుంచి మనుషుల మెదడులోకి రావాలి. అప్పుడు కొట్టడం ఉండదు..ఆ కొట్టడాన్ని సమర్థించేవాళ్లూ ఉండరు. 
                                                                                                                                                                                    - సంధ్య (పీఓడబ్ల్యూ), సోషల్​ యాక్టివిస్ట్​

అసలు కొట్టడం ఎందుకు?
భార్యని హింసించాలి అనుకునే భర్తకి ప్రత్యేకంగా కారణాలు అక్కర్లేదు. ఉప్పు, పప్పులు కూడా ట్రిగ్గర్​ పాయింట్సే. ఎందుకంటే మేల్​ డామినేటింగ్​ సొసైటీ ఇది. భార్య ఎంత పెద్ద పొజిషన్​లో ఉన్నా.. ఎంత సంపాదిస్తున్నా .. భర్త చెప్పినట్టే నడుచుకోవాలి.. వాళ్లకి నచ్చినట్టే ఉండాలి.. ఇదే ఆలోచనలో ఉంటున్నారు మగవాళ్లు. అలాగని అందరూ ఇలానే ఉంటారు అనను. భార్యకి ఇంటి, వంట పనుల్లో సాయం చేస్తూ.. ప్రతి అడుగులో అండగా ఉండేవాళ్లు ఉంటున్నారు. కానీ, మెజారిటీ మగవాళ్లు భార్యల్ని టేకెన్​ ఫర్​  గ్రాంటెడ్​గానే తీసుకుంటున్నారు. అదే గృహహింస ఇంతలా పెరగడానికి కారణం. 
                                                                                                                                                                                    - చందన ప్రియ గోన, టీచర్​, హైదరాబాద్​
ఎందుకు నోరు విప్పట్లేదు?
సొసైటీ, ఫ్యామిలీ సపోర్ట్​ లేకపోవడం వల్లే ఆడవాళ్లు మాట్లాడటం లేదనిపిస్తోంది నాకు. పెండ్లి తర్వాత ఆడపిల్లలు పుట్టింటికి వచ్చేస్తానంటే.. మొదట బిడ్డ బాధకంటే..అందరూ ఏమనుకుంటారనే ఆలోచిస్తారు చాలామంది తల్లిదండ్రులు. కుటుంబ పరువు గురించి భయపడతారు. నాలుగ్గోడల మధ్యే ఆమె బాధని వదిలేస్తారు. కొందరు ఆడపిల్లలు పుట్టింటి పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని కూడా ఆ హింస భరిస్తారు. తల్లిదండ్రులు పెండ్లి అయిన కూతురు పుట్టింట్లో ఉంటే ‘ ఓకే’ అనుకున్నప్పుడే ఈ పరిస్థితుల్లో మార్పు వస్తుంది. అమ్మాయిలు ధైర్యంగా నోరు విప్పుతారు. 
                                                                                                                                                                                                             - అరుణ, గృహిణి, వరంగల్​
పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి
భార్యాభర్తలు ఒకరినొకరు అర్ధం చేసుకోవాలి. బాధ్యతల్లో ఉమ్మడిగా కలిసి పనిచేయాలి.అంతే తప్ప భర్త ఆధిపత్యం కోసం భార్యపై చెయ్యిచేసుకోవడం సరైంది కాదు. అయినా ఇల్లు, కుటుంబం ఒక్క భార్యది మాత్రమే కాదు.. భర్త కూడా ఆ బాధ్యతల్ని సమానంగా తీసుకోవాలి. ఆమెతో కలిసి నడవాలి. అంతేకానీ కొట్టే హక్కు ఉందనటం తప్పు. చిన్న చిన్న విషయాలకే భార్యపై  పోట్లాటకు దిగడం.. కొట్టడం లాంటివి ఇగో ప్రాబ్లమ్స్ వల్లే ఎక్కువగా జరుగుతుంటాయి. ఆ మేల్​ ఇగోని పక్కనపెడితే పరిస్థితుల్లో మార్పు వస్తుంది. 
                                                                                                                                                                                                      - ముడెం సబిత, మేళ్లచెరువు
                                                                                                                                                                                           ::: ఆవుల యమున::: నెట్​వర్క్​, వెలుగు