
- జీహెచ్‌ఎంసీ, టాస్క్‌ఫోర్స్‌పై తీరుపై హైకోర్టు ఫైర్
హైదరాబాద్, వెలుగు: అక్రమ నిర్మాణాల తొలగింపునకు సంబంధించి తరాలు మారుతున్నా అధికారుల తీరు మాత్రం మారడం లేదని హైకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎవరికివారు తమకు సంబంధం లేదనే ధోరణితో పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండటంతోనే అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయని ఫైర్ అయ్యింది.
అక్రమ నిర్మాణాలకు బాధ్యులైన జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కౌన్సిళ్లతోపాటు అధికారుల ఫొటోలను ట్యాంక్‌బండ్‌పై పెట్టాలని, అక్రమ నిర్మాణాలకు వీరే కారకులని అందులో పెద్దపెద్ద అక్షరాలతో మెన్షన్ చేయాలని ఘాటుగా వ్యాఖ్యానించింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ఖానామెట్‌లోని తమ భూమిలో ప్రైవేటు వ్యక్తులు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ సయ్యద్ రహీమున్నీసా సహా మరో ఏడుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం విచారణ చేపట్టి అక్రమ నిర్మాణాల వ్యవహారం వస్తే చాలు ఎవరికి వారు తమ బాధ్యతను తాము నిర్వర్తిస్తున్నామనే చెబుతున్నారని కోర్టు కామెంట్ చేసింది. అక్రమ నిర్మాణాల తొలగింపునకు స్పీకింగ్ ఆర్డర్ జారీ అయినట్లు స్టాండింగ్ కౌన్సిళ్లు చెబుతున్నారని, ఇకపై కూల్చివేతలపై నెలవారీ నివేదిక సమర్పించాలని ఆదేశిస్తామన్నారు.
కూల్చివేత ఉత్తర్వులను టాస్క్‌ఫోర్సుకు అప్పగించామని జీహెచ్‌ఎంసీ కమిషనర్, పోలీసుల భద్రత లేదంటూ టాస్క్‌ఫోర్సు, ఇది శాంతి భద్రతల సమస్య అంటూ పోలీసులు ఎవరికి వారు చేతులు దులిపేసుకుంటున్నారని వివరించింది. పిటిషనర్లు ఇచ్చిన వినతి పత్రంపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ విచారణను వాయిదా వేసింది.