పాదయాత్ర చేస్తూ.. సమస్యలు తెలుసుకుంటూ: మంత్రి వివేక్

పాదయాత్ర చేస్తూ.. సమస్యలు తెలుసుకుంటూ: మంత్రి వివేక్

హైదరాబాద్ సిటీ/జూబ్లీహిల్స్/మెహిదీపట్నం, వెలుగు: జూబ్లీహిల్స్​నియోజకవర్గాన్ని ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేసుకుందామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. నియోజకవర్గంలోని రహమత్ నగర్‌‌‌‌‌‌‌‌లో గురువారం ఉదయం బస్తీ బాట కార్యక్రమం నిర్వహించారు. బస్తీలో పాదయాత్ర చేస్తూ.. స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. కార్మిక నగర్ నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర ఓం నగర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ నగర్, మహాత్మా నగర్, టి.అంజయ్య నగర్, ఇందిరానగర్‌‌‌‌లలో సాగింది. బస్తీల్లో ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తేవాలని, వెంటనే పరిష్కరించుకుందామని చెప్పారు.

ఇందిరానగర్ వీధిలో కొత్త రోడ్డు నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. పాదయాత్ర సందర్భంగా ఓ టిఫిన్ సెంటర్‌‌‌‌లో మంత్రి దోసెలు వేసి, స్థానిక వ్యాపారులతో మాట్లాడారు. రోడ్డు వెంబడి చిరు వ్యాపారుల దుకాణాల్లోకి వెళ్లి యజమానులను పలకరించారు. కార్మిక నగర్‌‌‌‌లో స్కూల్ బస్సు నడుపుతున్న ఓ మహిళా డ్రైవర్‌‌‌‌ను ఆపి, అభినందించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి ఈ బస్తీ బాట కార్యక్రమం ఎంతో ఉపయోగపడిందని చెప్పారు. పేదలు అధికంగా నివసించే ప్రాంతాల్లో వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, కాంగ్రెస్ లీడర్​అజారుద్దీన్, నవీన్ యాదవ్, బండపల్లి భవాని, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. మరోవైపు, కార్వాన్ నియోజకవర్గంలోని ఇబ్రహీం బాగ్ శ్మశానవాటిక స్థలం స్థానికులకు అప్పగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శ్మశానవాటిక పరిరక్షణ సమితి ప్రతినిధులు మంత్రి వివేక్ వెంకటస్వామికి వినతిపత్రం అందించారు. మంత్రి వెంట అధ్యక్షుడు సిరుగుమల్లె రాజు వస్తాద్, ప్రధాన కార్యదర్శి వీఎస్ రాజు, ప్రతినిధులు రాకేశ్‌‌‌‌ పటేల్, విశాల్ పటేల్ ఉన్నారు.