
- అక్కడి నుంచే పాలన సాగించనున్న కలెక్టర్
- భవనం మొత్తాన్ని తొలగించాలన్న నిపుణుల కమిటీ సూచనలతో తరలుతున్న ఆఫీస్‌లు
- జడ్పీ ఆఫీస్‌లోకి అర్బన్ తహసీల్దార్,ఆర్డీవో కార్యాలయాలు
- స్పీడప్ కానున్న ఆదిలాబాద్కొత్త కలెక్టరేట్ పనులు
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ కలెక్టరేట్ ను పెన్గంగా భవన్కు తరలిస్తున్నారు. అక్కడి నుంచే కలెక్టర్జిల్లా పరిపాలన సాగించనున్నారు. ఇటీవల భారీ వర్షాలకు కలెక్టరేట్ భవనం కూలిపోవడంతో నిపుణుల కమిటీ పరిశీలించి బిల్డింగ్మొత్తాన్ని తొలగించాలని నివేదిక ఇచ్చింది. ఆ భవనంలోని ఎ, బి సెక్షన్లు కూలిపోవడం, మిగతా గదులు శిథిలావస్థలో ఉండటంతో ఎప్పటికైనా ప్రమాదమేనని తేల్చింది. ఈ నేపథ్యంలో జడ్పీ కార్యాలయంలోని పలు గదులను సీఈవో జితేందర్ రెడ్డి పరిశీలించారు. కలెక్టరేట్ లోని ఆర్డీవో, అర్బన్తహసీల్దార్ఆఫీస్లను ఇక్కడికి తరలిస్తున్నారు. వారం రోజుల్లో పౌరసరఫరాల శాఖ, సర్వే ల్యాండ్ రికార్డ్స్, ట్రెజరీ, డీపీఆర్వో కార్యాలయాలను తరలింపునకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఊపందుకోనున్న కొత్త కలెక్టరేట్పనులు
ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయంలోని వివిధ శాఖలను ఇతర గవర్నమెంట్ఆఫీస్లకు తరలిస్తున్నందున.. ఇక కొత్త కలెక్టరేట్పనులు ఊపందుకోనున్నాయి. పట్టణ శివారులోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో 20 ఎకరాల్లో రూ.55 కోట్లతో నిర్మిస్తున్నారు. 2023 ఆగస్టులో పనులు ప్రారంభించగా.. బిల్లులు సరైన సమయంలో రాకపోవడంతో కాంట్రాక్టర్ పలుమార్లు పనులు నిలిపివేశారు. 2 నెలల క్రితమే బిల్లులు రావడంతో మళ్లీ పనులు మొదలయ్యాయి. రెండు బ్లాక్‌లలో మొదటి అంతస్తు పనులు పూర్తయ్యాయి. మరో రెండు బ్లాక్‌లు పిల్లర్లు, ఇంకో రెండు బ్లాక్ లు బేస్మెంట్ దశలో ఉన్నాయి.
84 ఏండ్లు.. 57 మంది కలెక్టర్లు
ఆదిలాబాద్ లో ఎన్నో ప్రాచీన ఆలయాలు, చారిత్రక కట్టడాలు ఉండగా.. వాటిలో కలెక్టరేట్ ఒకటి. దీన్ని నిజాం కాలంలో నిర్మించారు. 1937లో ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాన్ని ఆదిలాబాద్ పట్టణానికి మార్చారు. అదే ఏడాది ఇక్కడ 8 ఎకరాల విస్తీర్ణంలో కలెక్టరేట్ పనులు ప్రారంభమై1941లో పూర్తయాయి. 84 ఏండ్లపాటు 57 మంది కలెక్టర్లు ఇక్కడి పాలన సాగించారు. మధ్యలో భవనానికి పలుమార్లు రిపేర్లు చేయించారు. 2018లో సుందరీకరణ, మరమ్మతుల కోసం రూ.30 కోట్లు మంజూరు చేశారు. ఆ పనులు పెండింగ్‌లో పడ్డాయి.