మాలో ఎవరిపై దాడి చేసినా.. ఇద్దరం కలిసి అటాక్ చేస్తం

మాలో ఎవరిపై దాడి చేసినా.. ఇద్దరం కలిసి అటాక్ చేస్తం

 

  • పాక్, సౌదీ అరేబియా మధ్య వ్యూహాత్మక రక్షణ ఒప్పందం
  • దేశ భద్రతే మాకు ముఖ్యం
  • గల్ఫ్ రీజియన్​లో శాంతి స్థాపిస్తాం
  •  పాక్, సౌదీ సంయుక్త ప్రకటన 
  • ఈ ఒప్పందాన్ని పరిశీలిస్తున్నాం: ఇండియా 

రియాద్: పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ డీల్ ప్రకారం.. రెండింట్లో ఏ దేశంపై దాడి జరిగినా.. అది రెండు దేశాలపై జరిగిన అటాక్​గానే భావించి, రెండు దేశాలు కలిసి ప్రత్యర్థితో పోరాడతాయి. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ బుధవారం రియాద్​లో సౌదీ యువ రాజు మహ్మద్ బిన్ సల్మాన్​తో  భేటీ అయ్యారు. ఇద్దరూ కలిసి మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్​పై సంతకం చేశారు. అనంతరం జాయింట్ ప్రెస్​నోట్ రిలీజ్ చేశారు. ‘‘ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని పెంపొందిస్తుంది. 

ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు దానికి వ్యతిరేకంగా ఉమ్మడిగా పోరాడటాన్ని లక్ష్యంగా పెట్టుకుంటాం. రెండు దేశాల మధ్య భద్రతను పెంపొందించుకుంటాం. గల్ఫ్ రీజియన్​లో శాంతి స్థాపనకు కృషి చేస్తాం. ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా.. అది ఇరు దేశాలపై జరిగిన దాడిగానే భావిస్తాం. అప్పుడు మేమిద్దరం కలిసి ప్రత్యర్థిపై దాడులు చేస్తాం’’ అని పాకిస్తాన్, సౌదీ అరేబియా ప్రెస్​నోట్​లో పేర్కొన్నాయి. కాగా, ఖతార్ రాజధాని దోహాలో హమాస్ నేతలను లక్ష్యంగా చేసుకుని కొన్ని రోజుల కింద ఇజ్రాయెల్ దాడి చేసిన నేపథ్యంలో పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య కుదిరిన రక్షణ ఒప్పందానికి ప్రాధాన్యం ఏర్పడింది. ప్రధానంగా ఇజ్రాయెల్ ను కట్టడి చేసేందుకే సౌదీ ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా భావిస్తున్నారు. 

ఒప్పందంలోకి యూఏఈ, ఖతార్ కూడా..?  

రక్షణ ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య త్వరలో సైనిక విన్యాసాలు జరగనున్నాయి. అడ్వాన్స్ డ్ డిఫెన్స్ టెక్నాలజీని ఇరు దేశాలు ఇచ్చిపుచ్చుకోనున్నాయి. అలాగే, ఇంటెలిజెన్స్ డేటాను కూడా షేర్ చేసుకోనున్నట్లు తెలుస్తున్నది. కాగా, ఈ ఒప్పందంలోకి మరో రెండు ఇస్లామిక్ దేశాలు యూఏఈ, ఖతర్ కూడా చేరనున్నాయని ప్రచారం సాగుతోంది.   

మోదీ దౌత్య వైఫల్యాలకు నిదర్శనం: కాంగ్రెస్

పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య రక్షణ ఒప్పందం.. భారత జాతీయ భద్రతకు తీవ్ర ప్రమాదకరమని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధాని  నరేంద్ర మోదీ అసమర్థ విదేశీ విధానాల కారణంగానే ఇలాంటి పరిస్థితి వచ్చిందని విమర్శించింది. ప్రధాని మోదీ అతిగా స్పందించడం, వ్యక్తిగత దౌత్యం.. దేశానికి ప్రమాదకరంగా మారాయని ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేశ్ అన్నారు. ‘‘2025, ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడి జరిగినప్పుడు ప్రధాని మోదీ సౌదీ అరేబియాలోనే ఉన్నారు. అయినప్పటికీ.. పాకిస్తాన్​తో సౌదీ ఇప్పుడు వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నది’’అని జైరామ్ మండిపడ్డారు. 

ఇండియాపై ప్రభావాన్ని పరిశీలిస్తున్నాం: విదేశాంగ శాఖ 

పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య జరిగిన రక్షణ ఒప్పందంతో ఇండియాపై పడే ప్రభావాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. ‘‘పాక్‌‌, సౌదీ మధ్య వ్యూహాత్మక రక్షణ ఒప్పందం విషయం మా దృష్టికి వచ్చింది. దాన్ని మేం పరిశీలిస్తున్నాం. జాతీయ భద్రతతో పాటు ప్రాంతీయ, ప్రపంచ స్థిరత్వంపై ఈ ఒప్పందం పరిణామాలు ఎలా ఉంటాయనే దానిపై స్టడీ చేస్తున్నాం. జాతీయ ప్రయోజనాల పరిరక్షణకు కేంద్రం కట్టుబడి ఉంది’’ అని జైస్వాల్ పేర్కొన్నారు.