అమెరికాలో పోలీసుల కాల్పుల్లో పాలమూరు యువకుడు మృతి

అమెరికాలో పోలీసుల కాల్పుల్లో పాలమూరు యువకుడు మృతి
  •     రూమ్​మేట్స్​పై కత్తితో దాడికిపాల్పడ్డ నిజాముద్దీన్
  •     పోలీసులు వారించినా వినకపోవడంతో కాల్పులు
  •     ఘటనాస్థలంలోనే మృతి..పది రోజులు కింద ఘటన

పాలమూరు, వెలుగు: అమెరికాలో ఉద్యోగం చేస్తున్న పాలమూడు యువకుడు అక్కడి పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతిచెందాడు. వారిస్తున్నా వినకుండా రూమ్​మేట్స్​పై కత్తీతో దాడికి పాల్పడుతుండడంతో పోలీసులు అతన్ని షూట్​చేశారు. దీంతో యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. కాలిఫోర్నియా రాష్ట్రం శాంటా క్లారాలో ఈ దారుణం చోటు చేసుకుంది. మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలోని రామయ్య బౌలీ ప్రాంతానికి చెందిన నిజాముద్దీన్(29) ఉన్నత చదువుల కోసం 2014లో అమెరికాకు వెళ్లాడు.

 కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాంటా క్లారా ఏరియాలో కొందరు విద్యార్థులతో కలిసి ఒక ఇంట్లో అద్దెకు ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నాడు. కొద్దిరోజుల కింద అతన్ని ఉద్యోగంలో నుంచి తీసేశారు. అప్పటినుంచి అతను తరచూ రూమ్ మేట్స్, ఇంటి ఓనర్ తో గొడవలు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో పది రోజుల కిందట నిజాముద్దీన్ రూమ్ మేట్స్ తో ఘర్షణకు దిగాడు. వారిపై కత్తితో దాడికి ప్రయత్నించాడు. వారు పోలీసులకు సమాచారం అందడంతో వారు నిజాముద్దీన్ నివాసముంటున్న ఇంటికి వచ్చారు.నిజాముద్దీన్​ రూమ్​మేట్స్ పై కత్తితో దాడి చేస్తుండడంతో పోలీసులు అతన్ని దాడి చేయొద్దని వారించారు. అయినా వినకుండా వారిపై కత్తితో దాడికి పాల్పడడంతో.. పోలీసులు నిజాముద్దీన్ ను షూట్​చేశారు. దీంతో అతను స్పాట్​లోనే మృతిచెందాడు.