నేవీ యూత్ స్పోర్ట్స్ టీమ్‌కు నవీన్, సాత్విక్, రిజ్వాన్

నేవీ యూత్ స్పోర్ట్స్ టీమ్‌కు నవీన్, సాత్విక్, రిజ్వాన్

హైదరాబాద్, వెలుగు: సెయిలింగ్‌లో సత్తా చాటుతున్న హైదరాబాద్ యంగ్ స్టర్స్ నవీన్, సాత్విక్ ధోకి, రిజ్వాన్ మహమ్మద్  గోవాలోని నేవీ యూత్ స్పోర్ట్స్ కంపెనీ (ఎన్​వైఎస్సీ) టీమ్‌కు ఎంపికయ్యారు. ఈ ముగ్గురు కుర్రాళ్లు నిరుపేద కుటుంబాలకు చెందిన వాళ్లు. వరంగల్ నుంచి సిటీకి వలసవచ్చిన సాత్విక్ తల్లిదండ్రులు కూలీలు కాగా  రిజ్వాన్ ఏడేండ్ల వయసులో తండ్రి కోల్పోయి హైదరాబాద్ పాటిగడ్డలో పూరి గుడిసెలో నివాసం ఉంటున్నాడు.  

నవీన్‌ ఆరేండ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి తారా హోమ్ అనే అనాథ శరణాలయంలో చేరాడు. అయితే, యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ లో సెయిలింగ్ ట్రెయినింగ్‌కు ఎంపికవ్వడం ఈ ముగ్గురి జీవితాలను మార్చింది. కోచ్ సుహీమ్ శిక్షణలో రాటుదేలిన ఈ కుర్రాళ్లు పలు జాతీయ టోర్నీల్లో సత్తా చాటడంతో  నేవీ యూత్ స్పోర్ట్స్ కంపెనీ టీమ్ నుంచి వీళ్లకు పిలుపు వచ్చింది. ఇకపై జరిగే నేషనల్ టోర్నీల్లో నేవీ టీమ్​ తరఫున బరిలోకి దిగనున్నారు.