ఆదివాసీ ఉద్యమనాయకుడు స్టాన్ స్వామి కన్నుమూత

ఆదివాసీ ఉద్యమనాయకుడు స్టాన్ స్వామి కన్నుమూత

ఆదివాసీ ఉద్యమకారుడు స్టాన్ స్వామి గుండెపోటుతో ముంబైలో కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు రావడంతో ముంబైలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆయన సోమవారం రాత్రి కన్నుమూశారు. బీమా కోరేగావ్ కేసులో గతేడాది రాంచీలో ఆయనను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. స్టాన్ స్వామి గత అక్టోబర్ నుంచి తలోజా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన ఆరోగ్యం దెబ్బతినడంతో మే నెలలో స్టాన్ స్వామిని హాస్పిటల్‌లో చేర్పించారు. స్టాన్ స్వామి చాలాకాలంగా పార్కిన్ సన్స్ వ్యాధితో బాధపడుతున్నారు. 

స్టాన్ స్వామి జైలులో ఉన్నప్పుడు అధికారులు ఆయనతో వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. పార్కిన్ సన్ వ్యాధితో బాధపడుతున్న ఆయన.. చేతితో గ్లాస్ పట్టుకుని నీరు తాగలేరు. దాంతో తనకు స్ట్రా ఇప్పించాలని కోర్టును అభ్యర్తించారు. అయితే ఎన్ఐఏ అధికారులు దీనిపై అభ్యంతరం తెలిపారు. దాంతో స్టాన్ స్వామికి మద్ధతుగా దేశవ్యాప్తంగా ఓ ఉద్యమమే మొదలైంది. సిప్పర్ ఫర్ స్టాన్ పేరుతో సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. చాలామంది స్ట్రాలు కొని జైలుకు పంపించారు. ఆందోళన తీవ్రం కావడంతో.. చివరకు జైలు అధికారులు ఆయనకు సిప్పర్ అందజేశారు.

తమిళనాడులో పుట్టిన స్టాన్ స్వామి తండ్రి వ్యవసాయదారుడు. దళితుల పిల్లల కోసం స్టాన్ బెంగళూరులో స్కూలు నడిపించే వారు. ఝార్ఖండ్ ఏర్పడ్డాక అక్కడికి వెళ్లి ఆదివాసీ హక్కుల కోసం స్టాన్ స్వామి పోరాడుతున్నారు. మావోయిస్టులుగా ముద్రపడి జైళ్లలో ఉన్న వేలాది మంది ఆదివాసీల తరపున ఆయన కోర్టుల్లో కొట్లాడారు.

స్టాన్ స్వామి మృతి పట్ల పలువరు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, శశి థరూర్, కపిల్ సిబల్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్, సీపీఐ నేత సీతారాం ఏచూరి, కేరళ సీఎం పినరయి విజయన్ సంతాపం ప్రకటించారు.