
- ఈ నెల14 తర్వాత లబ్ధిదారులకు అందజేత
- సెప్టెంబర్ నెల కోటా నుంచి బియ్యం
- 10 ఏండ్ల తర్వాత లబ్ధిదారులకు అందనున్న కార్డులు
కామారెడ్డి, నిజామాబాద్, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్జిల్లాలో కొత్త రేషన్ కార్డులు 8,771 జారీ కానున్నాయి. పాత వాటితో పాటు, కొత్త కార్డుల్లో అదనంగా 1,73,388 మంది సభ్యులను చేర్చారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కొత్త కార్డులు ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ సర్కార్ కొత్తగా రేషన్‌కార్డులతో పాటు, ఇది వరకు ఉన్న కార్డుల్లో కొత్త సభ్యుల పేర్లు చేర్చే ప్రక్రియ చేపట్టింది.
గ్రామాలు, టౌన్‌లలో ప్రజా పాలన మీటింగ్‌లు నిర్వహించి అప్లికేషన్లు స్వీకరించారు. దీంతో పాటే మీ సేవాలో అప్లికేషన్లు తీసుకున్నారు. గత కొన్ని నెలలుగా పాత రేషన్‌కార్డుల్లో సభ్యులను చేర్చటం, కార్డుల జారీ ప్రక్రియ నిర్వహిస్తోంది. అప్లికేషన్లను వెరిఫికేషన్చేసి అర్హులైన వారికి ఆన్లైన్లో ఎంట్రీ చేసి కార్డులు ఇస్తారు. ఇప్పటికే కొత్త సభ్యులను పాత కార్డుల్లో చేర్చిన వారికి కూడా బియ్యం వచ్చాయి.
ఏళ్లుగా వెయిటింగ్..
చాలా మంది కొన్నేళ్లుగా రేషన్ కార్డుల కోసం, కొత్త సభ్యులను చేర్చటం కోసం మీసేవాతో పాటు, ఆఫీసుల్లో అప్లయ్చేసుకున్నారు. గ్రామాలకు వచ్చే ప్రజాప్రజా ప్రతినిధులకు, అధికారులకు విన్నవించారు. కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో కూడా తమకు రేషన్ కార్డులు ఇప్పించాలని వినతిపత్రాలు ఇచ్చారు. కొత్త కార్డులను జారీ చేయడంతో పాటు, మెంబర్లను చేర్చడం పై గత ప్రభుత్వం దృష్టి సారించలేదు. దీంతో ప్రతి జిల్లాలో వేలాది సంఖ్యలో అప్లికేషన్లు ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి.
పెరగనున్న బియ్యం కోటా..
సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డులను ఈ నెల14న నల్గొండ జిల్లాలో ప్రారంభించనున్నారు. ఆ తర్వాత జిల్లాల్లో కూడా లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు ఇస్తారు. నియోజకవర్గాల వారీగా మీటింగ్‌లు నిర్వహించి కార్డుల పంపిణీ చేసే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు. దీనిపై ఉన్నతాధికారుల నుంచి సమాచారం రావాల్సి ఉందని చెబుతున్నారు. సీఎం సందేశంతో కూడిన లేఖలు ఇప్పటికే డీఎస్వో ఆఫీసులకు చేరాయి. కార్డులతోపాటు, లబ్ధిదారుల సంఖ్య పెరిగిన దృష్ట్యా బియ్యం కోటా పెరగనుంది. ఈ నెలలో కొత్తగా జారీ అవుతున్న కార్డులు, కొత్త సభ్యులకు సెప్టెంబర్ నెలలో రేషన్ బియ్యం ఇస్తారు. ఇప్పటికే ఆగస్టు నెల వరకు 3 నెలల కోటాను జూన్‌లోనే లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
పరిశీలన చేపట్టి జారీ చేస్తున్నాం
అప్లికేషన్లను పరిశీలించి కొత్త కార్డులు జారీ చేస్తున్నాం. ఇది నిరంతర పక్రియ. కొత్త కార్డుల పంపిణీ ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాల తర్వాత లబ్ధిదారులకు ఇస్తాం. ఇప్పటికే పత్రాలు వచ్చాయి. ఆన్లైన్లో వచ్చే అప్లికేషన్లను పరిశీలిస్తూ వెంటనే జారీ చేస్తున్నాం. ఇంకా జారీ చేస్తాం. - మల్లికార్జునబాబు, డీఎస్వో, కామారెడ్డి
కామారెడ్డి జిల్లా లో రేషన్ కార్డుల వివరాలు
కొత్తగా జారీ అయ్యే కార్డులు : 7,220
పాత, కొత్త కార్డుల్లో చేరికలు : 60,100
మొత్తం కార్డుల సంఖ్య : 2,60,875
లబ్ధిదారులు : 9,37,818
నిజామాబాద్ జిల్లా రేషన్ కార్డుల వివరాలు...
కొత్తగా జారీ రేషన్ కార్డులు : 1,551
పాత, కొత్త కార్డుల్లో చేరికలు : 1,13,288
మొత్తం కార్డుల సంఖ్య : 4,03,510
లబ్ధిదారుల సంఖ్య : 13,94, 503