
- సీఎం పేరిట ప్రొసీడింగ్స్ లెటర్లు ఇవ్వనున్న అధికారులు
- కొత్త, పాత కార్డుల్లో చేర్పులతో కలిపి కొత్తగా 3,80,215 మందికి లబ్ధి
కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులతోపాటు పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల చేర్పులకు సంబంధించిన ప్రొసీడింగ్ లెటర్ల పంపిణీకి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లయీస్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతకాలతో కూడిన ప్రొసీడింగ్ లెటర్లను సోమవారం నుంచి అధికారులు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాల్లోని డీఎస్‌వో ఆఫీసులకు ఈ లెటర్లు చేరాయి.
ప్రజాపాలన దరఖాస్తులు, మీ సేవ కేంద్రాల్లో అప్లికేషన్లను వెరిఫై చేసి ఇప్పటివరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 87,516 కొత్త రేషన్ కార్డులు జారీ కాగా, కొత్త, పాత కార్డుల్లో కలిపి సుమారు 3,80,215 మందిని కుటుంబసభ్యులను చేర్చారు. కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని కరీంనగర్ డీఎస్‌వో నర్సింగారావు వెల్లడించారు.
లబ్ధిదారుల్లో సంబురం
రేషన్ కార్డుపై రేషన్ బియ్యం ఇవ్వడంతోపాటు ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లలాంటి అన్ని సంక్షేమ పథకాలకు రేషన్‌కార్డును ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటున్న విషయం తెలిసిందే. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రేషన్ కార్డుల పంపిణీ అంతంతమాత్రంగానే చేయడంతో వేలాదిమంది అర్హులు రేషన్ కార్డులు పొందలేకపోయారు. రేషన్ కార్డుల పిల్లల పేర్లు చేర్చడానికి కుదర్లేదు. దీంతో కొత్త రేషన్ కార్డుల కోసం జిల్లాలో కొత్తగా పెళ్లయిన జంటలు వేలాదిగా ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నాయి.
కొందరు తమ పిల్లల పేర్లు చేర్చకపోవడంతో ఇబ్బందులకు గురయ్యారు. ఈక్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాపాలనతోపాటు మీ సేవా కేంద్రాల్లో అప్లికేషన్లు తీసుకున్న అధికారులు.. ఫీల్డ్‌లో వెరిఫై చేస్తూ కొత్త కార్డులు జారీ చేస్తున్నారు. అలాగే పాత కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేరుస్తున్నారు. ఏళ్లుగా రాని రేషన్ కార్డులు ఇప్పుడు రావడంతో లబ్ధిదారులతో ఆనందం వ్యక్తమవుతోంది.
కరీంనగర్ జిల్లాలో కొత్త కార్డులు 32,361
కరీంనగర్ జిల్లాలో గత సర్కార్ హయాంలో 2,76,897 రేషన్ కార్డులు ఉండగా 7.56 లక్షల మంది లబ్ధి పొందేవారు. ఇప్పుడు మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 3,08,44కు చేరగా 9,22,913 మంది లబ్ధి పొందుతున్నారు. జిల్లాలో కొత్తగా 32,361 రేషన్ కార్డులు జారీ అయ్యాయి. కొత్త కార్డుల ద్వారా 96,282 మందిని చేర్చగా.. 50,348 పాత రేషన్ కార్డుల్లో 70,603 మంది కుటుంబ సభ్యులను చేర్చారు. కొత్త, పాత కార్డుల్లో కలిపి 1,66,885 మందిని కొత్తగా చేర్చినట్లు కరీంనగర్ డీఎస్‌వో వెల్లడించారు.
జగిత్యాలలో కొత్తగా 29,235 కార్డులు
జగిత్యాల జిల్లాలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో 3,07,096 రేషన్ కార్డులు ఉండగా 8.73 లక్షల మంది లబ్ధిదారులు ఉండేవారు. కొత్త రేషన్ కార్డుల జారీ, కొత్తగా కుటుంబ సభ్యుల చేర్చిన తర్వాత ప్రస్తుతం రేషన్ కార్డుల సంఖ్య 3,36,331కి చేరగా.. లబ్ధిదారుల సంఖ్య 9,85,713 చేరింది. కొత్తగా 29,235 రేషన్ కార్డులు మంజూరు కాగా, కొత్త, పాతకార్డుల్లో కలిపి 1,12,451 మందిని చేర్చారు.
పెద్దపల్లి జిల్లాలో 47,200 మంది
పెద్దపల్లి జిల్లాలో నిరుడు 2,19,711 రేషన్ కార్డులు ఉండగా 6,30,965 మంది లబ్ధిదారులు ఉండేవారు. ప్రస్తుతం ఈ జిల్లాలో రేషన్ కార్డుల సంఖ్య 2,31,175కు చేరగా లబ్ధిదారుల సంఖ్య 6,78,165 మందికి చేరింది. కొత్తగా 11,466 కార్డులు మంజూరుకాగా, కొత్త, పాతకార్డుల్లో కలిపి 47,200 మందిని చేర్చారు.
రాజన్న సిరిసిల్లలో 53,679 మందికి లబ్ధి
రాజన్న సిరిసిల్ల గతంలో 1,73,577 రేషన్ కార్డులు ఉండగా 5,02,673 మంది లబ్ధిదారులు ఉండేవారు. ప్రస్తుతం ఈ జిల్లాలో రేషన్ కార్డుల సంఖ్య 1,88,031కు చేరగా లబ్ధిదారుల సంఖ్య 5,56,352 మందికి చేరింది. కొత్తగా 14,454 రేషన్ కార్డులు మంజూరయ్యాయి. అలాగే కొత్త, పాతకార్డుల్లో కలిపి 53,679 మందిని చేర్చారు.
జిల్లా కొత్త కార్డులు
కరీంనగర్ 32,361 1,66,885
జగిత్యాల 29,235 1,12,451
పెద్దపల్లి 11,466 47,200
రాజన్నసిరిసిల్ల 14,454 53,679
మొత్తం 87,516 3,80,215