9 కోట్లతో కట్టిన్రు.. కోటి పెట్టి కూలుస్తున్రు!

9 కోట్లతో కట్టిన్రు.. కోటి పెట్టి కూలుస్తున్రు!
  • రూ.10 కోట్ల ప్రజాధనం జంపన్నవాగుపాలు
  • ప్లానింగ్‌‌‌‌‌‌‌‌ లేకుండా నిర్మించిన ఫలితం
  • 10 మంది భక్తుల ప్రాణాలు పాయె
  • అప్పటి ఐబీ ఆఫీసర్లపై చర్యలు లేకపాయె.. 

జయశంకర్‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు: మేడారం జంపన్నవాగులో అనువుగాని చోట రూ.9 కోట్లతో  చెక్​డ్యాంలు కట్టిన లీడర్లు, ఆఫీసర్లు.. తాజాగా కోటి రూపాయలు పెట్టి కూల్చివేస్తున్నారు. జాతరకు వచ్చిన10 మంది  భక్తులు నీటమునిగి ప్రాణాలు పోగొట్టుకున్నాక ఎట్టకేలకు కండ్లు తెరిచారు. ప్లానింగ్‌‌‌‌‌‌‌‌ లోపం అంటూ కూల్చివేస్తున్న ఆఫీసర్లు.. నాడు కేవలం కాంట్రాక్టర్ల కోసమే పనులు చేసిన ఇరిగేషన్​ బోర్డ్​ ఆఫీసర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మేడారంలో జంపన్నవాగుకు ప్రత్యేక స్థానం ఉంది. రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క మహాజాతరకు వచ్చే ప్రతి భక్తుడు ఈ వాగులో స్నానం చేసి అమ్మవార్లను దర్శించుకోవడం ఆనవాయితీ. జాతర సమయంలో భక్తులు స్నానం చేసేందుకు మోకాలు లోతు నీటిని నిల్వ చేయాలనే ఉద్దేశంతో ఐబీ ఆఫీసర్లు 2019లో జంపన్నవాగులో రూ.9 కోట్లతో మూడు చెక్‌‌‌‌‌‌‌‌డ్యాంలు హడావిడిగా నిర్మించారు. రెడ్డిగూడెం నుంచి ఊరట్టం వైపు వీటిని  కేవలం 2 కి.మీ దూరంలో కట్టారు. 

ఏడాది గడవకముందే ఒకటి కొట్టుకపాయె 

పనులు పూర్తయ్యి ఏడాది కూడా గడవకముందే  వర్షానికి ఒక చెక్‌‌‌‌‌‌‌‌డ్యాం కొట్టుకుపోయింది. క్వాలిటీ లేకుండా నిర్మించడం వల్లే కొట్టుకుపోయిందనే ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో పక్కనే ఉన్న రైతుల పంట భూములు కూడా దెబ్బతిన్నాయి. 2020లోనే ఇది జరిగినా అప్పటి కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా మళ్లీ ప్రభుత్వ నిధులతో రిపేర్లు చేశారు. వాస్తవానికి జంపన్నవాగులో ఏటా వరద వస్తోంది. ఈ ఫ్లడ్​ను తట్టుకొని నిలబడాలంటే  చెక్‌‌‌‌‌‌‌‌డ్యాంకు అటు.. ఇటు ఒడ్డు వైపు సీసీతో గోడ కట్టాలి. కానీ చెక్‌‌‌‌‌‌‌‌డ్యాం కుడివైపు సీసీతో గోడ కట్టిన కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ ఎడమవైపు కేవలం మట్టి పోసి వదిలేయడంతో కొట్టుకుపోయింది.

10 మంది ప్రాణాలు పోయాయ్

జంపన్నవాగులో భక్తులు స్నానం చేసేందుకు వీలుగా మోకాళ్ల లోతు నీరు నిల్వ ఉండేలా చెక్​డ్యాంలు కట్టాలని ఆఫీసర్లు అనుకున్నారు. కానీ రెండు కిలోమీటర్ల పరిధిలో ఏకంగా మూడు చెక్​డ్యాంలను ప్లానింగ్​లేకుండా కట్టడంతో మనిషి మునిగే స్థాయిలో నీళ్లు నిలిచాయి. దీంతో గడిచిన మూడేళ్లలో 10 మందికి పైగా భక్తులు ఈ చెక్​డ్యాంల పరిధిలో మునిగి చనిపోయారు. దీంతో 2020 జాతర సందర్భంగా అప్పటి జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌ సి. నారాయణరెడ్డి ఐబీ శాఖ ఆఫీసర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ చెక్‌‌‌‌‌‌‌‌డ్యాంలు ఎందుకు కట్టారని  ప్రశ్నించారు. లోతు తెలియక ఇప్పటికే చాలామంది భక్తులు వాగులో దిగి ప్రాణాలు పోగొట్టుకున్నారని, కేవలం మోకాలు లోతు మాత్రమే నీళ్లు ఉండేలా చెక్​డ్యాంల ఎత్తు తగ్గించాలని  ఆఫీసర్లను ఆదేశించారు. కలెక్టర్​ ఆదేశాలతో రూ.30 లక్షలు ఖర్చు చేసి మూడు చెక్‌‌‌‌‌‌‌‌డ్యాంలను సగం వరకు పగలగొట్టారు.  తాజాగా 2022 మహా జాతర సమీపిస్తున్న దృష్ట్యా జంపన్నవాగులో అసలు చెక్‌‌‌‌‌‌‌‌ డ్యాం రూపురేఖలే లేకుండా చేయాలని మరో రూ. కోటి మంజూరు చేశారు. ఈ డబ్బులతో కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ మూడు చెక్‌‌‌‌‌‌‌‌ డ్యాంలను పూర్తిగా పగలగొడుతున్నారు.  ఆఫీసర్లు, లీడర్ల ప్లానింగ్​లేమితో 10 కోట్ల ప్రజాధనం నీళ్లపాలవడమేగాక పది మంది ప్రాణాలు తీసినట్లయింది. 

ఐబీ ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలె

కేవలం కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమే ఐబీ ఆఫీసర్లు జంపన్నవాగులో 3 చెక్‌‌‌‌‌‌‌‌ డ్యాంలు కట్టారు. వీటి వల్ల అనేకమంది భక్తులు నీటిలో మునిగి చనిపోయారు. 10 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం కావడానికి కారణమైన అప్పటి ఐబీ శాఖ ఆఫీసర్లను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఆఫీసర్లకు భయం ఉండదు.

సీతక్క, ములుగు ఎమ్మెల్యే