
హైదరాబాద్ / అశ్వారావుపేట, వెలుగు: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం హైదరాబాద్ సిటీతో పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైందని.. దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజులు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడ్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఆదివారం రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశముందని ఐఎండీ పేర్కొంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
సోమవారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో.. మంగళ వారం ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో.. బుధవారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ ఆఫీసర్లు వెల్లడించారు.
హైదరాబాద్లో దంచికొట్టిన వాన
హైదరాబాద్ సిటీలో శనివారం సాయంత్రం పలుచోట్ల వర్షం దంచికొట్టింది. మధ్యాహ్నం 3 గంటలకే సిటీ అంతా మేఘాలు కమ్ముకున్నాయి. సాయంత్రం 5 గంటలకు చినుకులతో మొదలైన వర్షం కొన్ని ప్రాంతాల్లో జోరందుకుంది. వర్షం కారణంగా పలు చోట్ల రోడ్లపై నీరు చేరింది. శనివారం హాలిడే కావడంతో ఐటీ కారిడార్‌లో తిప్పలు తప్పాయి. ఇక ఆఫీసుల నుంచి ఇండ్లకు వెళ్లేవారు ఇబ్బందులు పడ్డారు.
వర్షం కురవడంతో వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద హైడ్రా మాన్సూన్ టీమ్స్ రంగంలోకి దిగాయి. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నాయి. అత్యధికంగా కుత్భుల్లాపూర్‌లో 4.63 సెం.మీ., షాపూర్ నగర్లో 2.35, షేక్‌పేట్‌లో 2.00 సెం.మీల వాన పడింది. నగరంలో మరో రెండ్రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే చాన్స్ ఉందని, కొన్నిచోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడుతాయని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు.