
- బీజేపీలో బీఆర్ఎస్ విలీనంలో భాగంగానేకాళేశ్వరంపై సీబీఐ విచారణ ఆగింది
- ఈ కేసును సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో తేలుస్తామన్న కిషన్‌రెడ్డి, సంజయ్ మౌనంగా ఎందుకున్నరు?
- జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి మద్దతివ్వని బీఆర్ఎస్కు తెలంగాణ పదం పలికే అర్హత లేదని ఫైర్
హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ మెప్పు కోసం, కాళేశ్వరం విచారణ నుంచి తప్పించుకునేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. రాహుల్‌గాంధీని విమర్శిస్తే సహించబోమని హెచ్చరించారు. దేశం కోసం సర్వం త్యాగం చేసిన గాంధీ కుటుంబం గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్‌కు ఎక్కడిదని ప్రశ్నించారు. శనివారం గాంధీ భవన్‌లో మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.
కేటీఆర్ వ్యాఖ్యల వెనుక బీజేపీ ఉందని ఆరోపించారు. కాళేశ్వరం విచారణ నుంచి బయటపడడం కోసం బీజేపీ నేతల అడుగులకు మడుగులు ఒత్తుతున్నాడని కేటీఆర్‌పై ధ్వజమెత్తారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంలో భాగంగానే కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఆగిందని తాము భావిస్తున్నామని అన్నారు. కవిత వ్యాఖ్యలతోనే బీజేపీ, బీఆర్ఎస్ ఏమాత్రం వేరు కాదని, ఈ రెండు మానసికంగా విలీనం అయ్యాయనేది స్పష్టమవుతున్నదని తెలిపారు. కాళేశ్వరం ఎంక్వైరీని సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో తేలుస్తామన్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్.. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ ఎందుకు స్పందిస్తరు ?
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై రాహుల్‌గాంధీ ఎందుకు స్పందిస్తారని కేటీఆర్‌ను మహేశ్‌గౌడ్ నిలదీశారు. ‘‘ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్‌లో చేర్చుకున్న విషయాన్ని మరిచిపోయి.. ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నావా కేటీఆర్ ..’ అంటూ ఫైర్ అయ్యారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశం స్పీకర్ పరిధిలోనిదని స్పష్టం చేశారు. కేటీఆర్, హరీశ్ కూడా ప్రధాని మోదీని కలిశారని, వారు బీజేపీలో చేరారని తాము నోటీసులు పంపిస్తామని చెప్పారు.
నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం సీఎంను పార్టీలకతీతంగా ఎమ్మెల్యేలు అందరూ కలుస్తారని, ఇటీవల బీజేపీ ఎమ్మెల్యేలు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారని, అంతమాత్రాన వాళ్లు బీజేపీలో చేరినట్లా అని ప్రశ్నించారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణ వాది జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తే బీఆర్ఎస్ మద్దతు ఇవ్వలేదని, ఇప్పుడు సిగ్గులేకుండా తెలంగాణ పదాన్ని ప్రస్తావిస్తున్నారని మండిపడ్డారు. ‘‘కేటీఆర్.. తెలంగాణలో ఇక మీ రాజకీయ శకం ముగిసింది” అని హెచ్చరించారు.
భవిష్యత్తు యూత్ కాంగ్రెస్ నేతలదే
రాష్ట్రంలో భవిష్యత్తు యూత్ కాంగ్రెస్ నేతలదేనని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా కష్టపడాలని పిలుపునిచ్చారు. శనివారం ఇందిరా భవన్‌లో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశానికి చీఫ్ గెస్ట్ గా హాజరైన మహేశ్‌గౌడ్.. మాట్లాడారు.
దేశంలో రాహుల్ నాయకత్వంలో యూత్ కాంగ్రెస్, సేవాదళ్, ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలకు ఎన్నో కీలక పదవులు వచ్చాయని, రాబోయే రోజుల్లో కూడా అధిక ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. దేశంలో ఓట్ చోరీపై విస్తృతంగా ప్రచారం చేయాలని, దీని ద్వారానే మూడోసారి మోదీ అధికారంలోకి వచ్చాడనే వాస్తవాన్ని ఇంటింటికీ యూత్ కాంగ్రెస్ నేతలు తీసుకెళ్లాలని కోరారు.