864 రోజులు హింస జరిగితే ఎటుపోయినవ్ ? మోదీపై ఖర్గే, ప్రియాంక గాంధీ ఫైర్

864 రోజులు హింస జరిగితే ఎటుపోయినవ్ ? మోదీపై ఖర్గే, ప్రియాంక గాంధీ ఫైర్
  • 46 సార్లు ఫారిన్ టూర్లకు వెళ్లారు గానీ.. ఒక్కసారీ మణిపూర్​కు వెళ్లలే 
  • ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సిందని కామెంట్

వయనాడ్/న్యూఢిల్లీ: అల్లర్లతో అట్టుడికిన మణిపూర్​కు ప్రధాని నరేంద్ర మోదీ రెండేండ్ల తర్వాత వెళ్లడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా ఫైర్ అయ్యారు. మోదీ మణిపూర్ టూర్ మూడు గంటలపాటు తూతూమంత్రపు పర్యటనలా సాగిందని ఖర్గే విమర్శించారు. అక్కడ మైనార్టీలంతా బాగానే ఉన్నారని చూపేలా ఆయన పర్యటన తీరు ఉందన్నారు. మణిపూర్ ప్రజలు బాధల్లో ఉంటే.. మోదీ రోడ్ షోలు నిర్వహించడం ద్వారా వారిని తీవ్రంగా అవమానించారని ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ శనివారం మణిపూర్​లో పర్యటించడంపై ఖర్గే ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.

‘‘మణిపూర్​లో 2023, మే నెలలో హింస మొదలైంది. 864 రోజుల హింసలో 300 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,500 మంది గాయపడ్డారు. 67 వేల మంది నిరాశ్రయులయ్యారు. ఈ రెండేండ్లలో మీరు 46 సార్లు విదేశాలకు వెళ్లి వచ్చారు. కానీ, మణిపూర్​కు మాత్రం ఒక్కసారీ వెళ్లలేదు. ఆ రాష్ట్ర ప్రజలకు రెండు సానుభూతి మాటలూ చెప్పలేదు” అని మోదీపై ఆయన విమర్శలు గుప్పించారు. మోదీ తనకు తానే గ్రాండ్ వెల్ కమ్ ఏర్పాటు చేయించుకున్నారని.. తద్వారా ఇప్పటికీ బాధల్లో ఉన్న మణిపూర్ ప్రజల గాయాలపై మళ్లీ ముల్లులా గుచ్చారన్నారు. ఇంఫాల్, చురాచాంద్​పూర్​లో రోడ్ షోలు నిర్వహించిన మోదీ.. రిలీఫ్ క్యాంపుల్లోని ప్రజల ఆక్రందనలను వినే ధైర్యంలేక ఎస్కేప్ అయ్యారన్నారు.

‘‘మోదీ చివరిసారిగా జనవరి 2022లో ఎన్నికల కోసమే మణిపూర్​కు వెళ్లారు. ఆ తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ మణిపూర్ అమాయక ప్రజల ప్రాణాలను బుల్డోజ్ చేసింది. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మణిపూర్ ప్రజలను పూర్తిగా మోసం చేశారు. మోదీ రాజ్యాంగ బాధ్యతలను విస్మరించారు” అని అన్నారు. ‘‘మీ మాటల్లోనే చెప్పాలంటే.. మీ రాజధర్మం ఎటుపోయింది?” అని మోదీని ఖర్గే ప్రశ్నించారు.  

ఈ పని ఎప్పుడో చేయాల్సింది.. 
మణిపూర్​లో హింసాత్మక ఘటనలు జరిగి, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన రెండేండ్ల తర్వాత అయినా ప్రధాని మోదీ ఇప్పుడు అక్కడ పర్యటించడం సంతోషకరమని వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. అయితే, మోదీ.. ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సిందన్నారు. గురువారం నుంచి వయనాడ్​లో పర్యటిస్తున్న ప్రియాంక శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘మణిపూర్​లో హింస జరుగుతున్నప్పుడు దానిని నివారించేందుకు ప్రధానమంత్రి చర్యలు తీసుకోకపోవడం, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినా పట్టించుకోకపోవడం దురదృష్టకరం. దేశంలో ఏ ప్రాంతంలోనైనా ప్రజలు బాధలు పడుతుంటే ప్రధానమంత్రి అక్కడకు వెళ్లి వారి కష్టాలను తీర్చేందుకు ప్రయత్నించడం ఆనవాయితీ.

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇలాగే చేశారు. మోదీ మాత్రం రెండేండ్ల తర్వాత ఈ బాధ్యతను నెరవేరుస్తున్నారు. కానీ, ఆయన ఈ పనిని చాలా ముందే చేయాల్సింది” అని ఆమె విమర్శించారు. కాగా, వయనాడ్ లోని ముండక్కి, చూరల్ మల ఏరియాల్లో గత ఏడాది భారీ వర్షాల వల్ల ల్యాండ్ స్లైడ్స్ సంభవించి సర్వం కోల్పోయిన బాధిత ప్రజల పునరావాసం కోసం జిల్లా అధికారులతో చర్చించానని ప్రియాంక తెలిపారు. బాధితులకు ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా సాధ్యమైన సాయం చేస్తామని.. అలా వీలుకాకపోతే పార్టీ పరంగానైనా సాయం చేస్తామన్నారు. ఫైనల్ లిస్టులో పేర్లను కోల్పోయిన బాధితులకు కాంగ్రెస్ నిర్మిస్తున్న వంద ఇండ్లలో వారికి కేటాయిస్తామన్నారు.